కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘పీఎం-కుసుమ్’ రెండో విడతను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఏడో అగ్రివోల్టాయిక్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పీఎం-కుసుమ్ 2.0 కింద ఫేజ్-2 ప్రక్రియ శరవేగంగా జరుగుతోందన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని మీడియా సమావేశంలో తెలియజేశారు.
ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. రెండో విడత పీఎం-కుసుమ్ పథకంలో అగ్రివోల్టాయిక్స్ కోసం ప్రత్యేక విభాగాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు. అగ్రివోల్టాయిక్స్ విధానం ద్వారా ఒకే భూమిలో పంటల సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని సమర్థవంతంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఇది రైతులకు రెండు రకాల ఆదాయ మార్గాలను అందిస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచే క్రమంలో ప్రభుత్వం ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, పంచాయతీలకు ప్రాధాన్యతనిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన భద్రతను సాధించడంతో పాటు రైతు స్వయంసమృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు.
అగ్రివోల్టాయిక్ సాంకేతికతపై పరిశోధనలు మరింత ముమ్మరం చేయాలని, భారతీయ వాతావరణ పరిస్థితులకు తగిన నమూనాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులకు ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు.
పీఎం-కుసుమ్ గురించి కీలక వివరాలు..
పీఎం-కుసుమ్ అనేది రైతులకు ఇంధన భద్రత కల్పించడం, వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం.
రైతులు తమ బంజరు లేదా నిరుపయోగమైన భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను స్థానిక విద్యుత్ సంస్థలకు (డిస్కమ్) విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.
గ్రిడ్ విద్యుత్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఆఫ్-గ్రిడ్ సోలార్ పంప్‌సెట్లను (7.5 హెచ్‌పీ వరకు) ఏర్పాటు చేయడానికి సబ్సిడీ అందిస్తారు.
ఇప్పటికే ఉన్న గ్రిడ్-ఆధారిత డీజిల్ లేదా విద్యుత్ పంప్‌సెట్లను సోలార్ పంప్‌సెట్లుగా మారుస్తారు. దీనిద్వారా సాగుకు ఉచితంగా విద్యుత్ అందడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్మి ఆదాయం సంపాదించవచ్చు.
ఇదీ చదవండి: ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే..


