‘ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు’ | No Damage Complaints E20 Petrol Regular Servicing Enough Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

‘ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు’

Sep 10 2026 11:32 AM | Updated on Sep 10 2026 11:36 AM

No Damage Complaints E20 Petrol Regular Servicing Enough Ponnam Prabhakar

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ (ఈ20) వినియోగం వల్ల వాహనాలకు ముప్పు వాటిల్లుతోందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇప్పటివరకు తమ శాఖకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి వివరణాత్మక సమాధానమిచ్చారు.

వాహన యజమానుల నుంచి గానీ, ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణుల నుంచి గానీ ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. అందువల్ల నియంత్రణ లేదా దిద్దుబాటు చర్యలు చేపట్టే ప్రసక్తి లేదన్నారు. అయితే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ శక్తి సాంద్రత కొంత తక్కువగా ఉంటుందని, ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల పికప్, మైలేజీలో 3 నుంచి 5 శాతం స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందన్నారు. వాహనాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే పెద్ద సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.

ఈ పథకం కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం అమలవుతోందన్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిందన్నారు. వాహనాల రక్షణ, సర్టిఫికేషన్ నిబంధనలన్నీ కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త వాహనాలు ఈ20 ఇంధనానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నాయని, పాత వాహనదారులు చిన్నపాటి మార్పులు లేదా కొన్ని విడిభాగాలను మార్చుకోవాల్సి రావచ్చునని పేర్కొన్నారు.

మూడు ప్రధాన ప్రయోజనాలు

ఇథనాల్ మిశ్రమం ద్వారా మూడు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. చెరకు రసం, బెల్లం పాకం, వరి, మొక్కజొన్నల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరిగి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర, అదనపు ఆదాయం లభిస్తుంది. పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.

ఇథనాల్ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుందనే భయాలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పాటు చేస్తున్న ఆధునిక ప్లాంట్లలో కాలుష్య నియంత్రణ చర్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరీంనగర్‌లోని 2-3 ప్లాంట్లతో సహా మొత్తం ఏడు ఇథనాల్ కర్మాగారాలు ఉన్నాయని వెల్లడించారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆయిల్ కంపెనీలు, పారిశ్రామికవేత్తల మధ్య ఒప్పందాలకు వ్యవసాయ, అబ్కారీ శాఖలు సహకరిస్తున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: కాగ్నిజెంట్‌పై వీసా మోసం ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement