పాకిస్తాన్‌కు బిగ్‌ టెన్షన్‌.. సౌదీ కోసం యుద్ధం తప్పదా? | Pakistan To Fight Houthis? Saudi Attack Puts Makkah Defense Alliance To First Test, Check More Details | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు బిగ్‌ టెన్షన్‌.. సౌదీ కోసం యుద్ధం తప్పదా?

Sep 10 2026 7:59 AM | Updated on Sep 10 2026 9:17 AM

Pakistan Faces New Tension for Saudi Arabia And Yemen

AI Pic

హౌతీలపై పాకిస్తాన్‌ నేరుగా యుద్ధానికి దిగుతోందా?.. సౌదీ అరేబియాపై జరిగిన భారీ దాడి మూడు దేశాల సైనిక కూటమిని రంగంలోకి దించే పరిస్థితి తెచ్చిందా?.. యెమెన్‌ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులు సౌదీ నగరాలు, చమురు కేంద్రాలను తాకడంతో గల్ఫ్‌లో యుద్ధ వేడి పెరిగింది. ఈ సమయంలో పాకిస్తాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్‌, టర్కీపైనా జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేయడంతో.. గత నెలలో ఏర్పాటైన ‘మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అలయన్స్‌’ తొలిసారి అసలు పరీక్షను ఎదుర్కొంటోంది.

సెప్టెంబర్‌ 8న హౌతీ దళాలు సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 73 మంది గాయపడగా.. కొన్ని చమురు, ఇంధన కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆగస్టు 7న పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ ఒప్పందంపై చర్చ మొదలైంది. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. దాన్ని మిగతా సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలన్నది ఈ ఒప్పందంలోని కీలక నిబంధన. ఖ్వాజా ఆసిఫ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యెమెన్‌ ఘర్షణ సౌదీ భూభాగంలోకి విస్తరించినా, సౌదీపై దాడి జరిగినా మక్కా ఒప్పందం అమల్లోకి రావచ్చన్నారు. అవసరమైతే పాకిస్తాన్‌ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని తెలిపారు. దీంతో హౌతీల దాడులు కొనసాగితే పాక్‌, టర్కీ సౌదీ రక్షణకు ముందుకొచ్చే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.

జాగ్రత్తగా పాక్‌ వ్యూహం..
ఇదే సమయంలో అసలు ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై పాకిస్తాన్‌ వైమానిక దాడులు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోందని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ EFE వార్తా సంస్థ తెలిపింది. అయితే దీనిపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇస్లామాబాద్‌ బహిరంగ వైఖరి కూడా జాగ్రత్తగానే ఉంది. సౌదీని రక్షించడం ఒకటైతే.. యెమెన్‌లోకి వెళ్లి నేరుగా యుద్ధం చేయడం మరో అంశమని పాక్‌ స్పష్టం చేస్తోంది. హౌతీలను అదుపులో పెట్టాలని ఇరాన్‌ను హెచ్చరించినప్పటికీ.. తన పాత్రను ప్రధానంగా సౌదీ రక్షణకే పరిమితం చేయాలని చూస్తోందని రాయిటర్స్‌ పేర్కొంది.

మరోవైపు టర్కీ కూడా హౌతీ దాడులను ఖండిస్తూ.. సౌదీ సార్వభౌమత్వానికి మద్దతు ప్రకటించింది. అయితే యెమెన్‌లో ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతామని మాత్రం ప్రకటించలేదు. దీంతో మక్కా ఒప్పందానికి అసలు పరీక్ష ఏంటన్నది స్పష్టమవుతోంది. హౌతీలు సౌదీపై దాడి చేస్తే పాక్‌, టర్కీ ఎంతవరకు ముందుకొస్తాయి?.. సౌదీ యెమెన్‌లో హౌతీలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తే ఈ రెండు దేశాలు అదే స్థాయిలో మద్దతు ఇస్తాయా? అన్నదే కీలకంగా మారింది.

వైమానిక దాడులు చేస్తుందా?
ఇక హౌతీలకు ఇరాన్‌ మద్దతు ఉండటం, అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిణామాలను మరింత సున్నితంగా మార్చాయి. పాకిస్తాన్‌, టర్కీ నేరుగా హౌతీలకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే.. ఇప్పటివరకు యెమెన్‌ పరిధిలో ఉన్న ఘర్షణ విస్తృత గల్ఫ్‌ సంక్షోభంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఇస్లామాబాద్‌పైనే. పాకిస్తాన్‌ సౌదీ రక్షణకే పరిమితమవుతుందా?.. హౌతీ స్థావరాలపై నేరుగా వైమానిక దాడులు చేస్తుందా? అన్నదే కీలకం. పాక్‌ నిజంగా హౌతీలపై దాడులకు దిగితే.. అది మక్కా డిఫెన్స్‌ అలయన్స్‌కు తొలి పెద్ద పరీక్ష మాత్రమే కాదు.. యెమెన్‌ యుద్ధం గల్ఫ్‌ ప్రాంతానికి విస్తరించే కీలక మలుపుగా మారొచ్చు.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌ నెతన్యాహుకు కొత్త కష్టాలు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement