జెలెన్‌స్కీ ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం.. పుతిన్‌ ప్లానేనా? | Zelensky’s Plane Narrowly Escapes Drone Strike During Takeoff, Russian Drone Suspected, More Details Inside | Sakshi
Sakshi News home page

జెలెన్‌స్కీ ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం.. పుతిన్‌ ప్లానేనా?

Sep 10 2026 8:56 AM | Updated on Sep 10 2026 9:57 AM

Zelenskyy Plane Narrowly Escapes Disaster At Moldova

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మోల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన ఆయన విమానం టేకాఫ్‌ తీసుకునే సమయంలో ఓ డ్రోన్‌ దాదాపు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చింది. దీంతో కొద్దిసేపు దేశ గగనతలాన్ని మూసివేసి విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆ డ్రోన్‌ రష్యాకు చెందినదిగా భావిస్తున్న నేపథ్యంలో.. జెలెన్‌స్కీ విమానానికి ఇంత దగ్గరగా అది ఎలా వచ్చింది? దీని వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యూహం ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే డ్రోన్‌ ఉద్దేశపూర్వకంగా జెలెన్‌స్కీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుందా అన్నది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

ఈ ఘటన సెప్టెంబర్‌ 8, మంగళవారం చోటుచేసుకుంది. జెలెన్‌స్కీ మోల్డోవా రాజధాని చిసినావ్‌ నుంచి నార్వే రాజధాని ఓస్లోకు బయలుదేరాల్సి ఉండగా.. అదే సమయంలో ఓ డ్రోన్‌ మోల్డోవా గగనతలంలోకి ప్రవేశించింది. విమానాల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో జెలెన్‌స్కీ విమానంతో పాటు మరో మూడు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముప్పు తొలగిన తర్వాతే జెలెన్‌స్కీ విమానం నార్వేకు బయలుదేరింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో జెలెన్‌స్కీతో పాటు ఆయన భార్య, ఉక్రెయిన్‌ ఫస్ట్‌ లేడీ ఒలెనా జెలెన్‌స్కా కూడా విమానంలో ఉన్నారు.

కూలిన డ్రోన్‌.. మంటలు.. 
మోల్డోవా అధికారుల ప్రకారం రెండు రష్యన్‌ డ్రోన్లు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిలో ఒకటి రిస్కానీ జిల్లాలోని ఓ గ్రామ శివార్లలోని సన్‌ఫ్లవర్‌ పొలంలో కూలిపోయి పేలింది. దీంతో నాలుగు చోట్ల మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రాంతం చిసినావ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో డ్రోన్‌ పొరుగున ఉన్న నాటో సభ్యదేశం రొమేనియా గగనతలంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

డ్రోన్‌ కదలికలను పర్యవేక్షించేందుకు స్పెయిన్‌కు చెందిన రెండు ఎఫ్‌-18 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించారు. కూలిపోయిన డ్రోన్‌ శకలాలను పరిశీలించిన నిపుణులు.. దాని ప్రొపల్షన్‌ వ్యవస్థ, నిర్మాణ లక్షణాలు రష్యా యుద్ధంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న ‘గెరాన్‌’ తరహా డ్రోన్‌ను పోలి ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో ఉన్న పేలుడు పదార్థం రకం, పరిమాణంపై దర్యాప్తు కొనసాగుతోంది.

నార్వే ప్రధాని స్పందన.. 
మరోవైపు నార్వే ప్రధాని జోనాస్‌ గార్‌ స్టోర్‌ బుధవారం స్పందిస్తూ.. మోల్డోవా నుంచి టేకాఫ్‌ అవుతున్న సమయంలో జెలెన్‌స్కీ విమానం దాదాపు డ్రోన్‌ బారిన పడిందని తెలిపారు. అయితే డ్రోన్‌ విమానానికి ఎంత దూరంలో ఉందన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. జెలెన్‌స్కీ ఓస్లోకు వెళ్లడానికి ప్రధాన కారణం నార్వే రాజు హరాల్డ్‌-5 అంత్యక్రియలకు హాజరుకావడం. సెప్టెంబర్‌ 8న రాత్రి ఓస్లో చేరుకున్న ఆయన మరుసటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నార్వే నేతలతో రక్షణ, వైమానిక రక్షణ సహకారంపై చర్చలు జరిపారు.

మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ మోల్డోవా, రొమేనియా గగనతలాల్లో డ్రోన్‌ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ విమానం టేకాఫ్‌ సమయంలోనే డ్రోన్‌ ముప్పు ఎదురవడం కలకలం రేపుతోంది. అయితే ఇది జెలెన్‌స్కీని లక్ష్యంగా చేసుకున్న పుతిన్‌ ఆపరేషనా? లేక యుద్ధ ప్రభావంతో జరిగిన మరో డ్రోన్‌ చొరబాటా? అనేది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రానుంది.
ఇదీ చదవండి: ఏం చేసేది.. పాకిస్తాన్‌కు కొత్త కష్టం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement