11న మోదీ, పుతిన్‌ భేటీ | PM Modi To Meet Russian President Putin On September 11 Ahead Of BRICS Summit | Sakshi
Sakshi News home page

11న మోదీ, పుతిన్‌ భేటీ

Sep 9 2026 2:30 AM | Updated on Sep 9 2026 2:30 AM

PM Modi To Meet Russian President Putin On September 11 Ahead Of BRICS Summit

ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న ఇరువురు నేతలు  

ఈ నెల 12, 13న ఢిల్లీలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు  

న్యూఢిల్లీ: బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండియా, ఇండోనేసియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ‘బ్రిక్స్‌’శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 12, 13న ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరిగే సమావేశానికి కూటమి దేశాల అధినేతలు హాజరుకాబోతున్నాయి. సదస్సు కంటే ఒక రోజు ముందు ఈ నెల 11న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్‌ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ విషయాన్ని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మంగళవారం నిర్ధారించారు. 

ఆయన భారత జర్నలిస్టులతో ఆన్‌లైన్‌లో సంభాషించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో అధ్యక్షుడు పుతిన్‌ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు దృష్టి పెట్టునున్నట్లు పేర్కొన్నారు. ఇరువురు నేతల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. అత్యంత సున్నితమైన అంశాలపై బహిరంగంగా, నిర్మాణాత్మకంగా చర్చించేలా మోదీ, పుతిన్‌ ఆచరణాత్మక దృక్పథం, చిత్తశుద్ధి కలిగి ఉన్నారని పెస్కోవ్‌ వివరించారు. 

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులను మోదీకి వివరించడానికి పుతిన్‌కు ఇది మరో అవకాశం కానుందని అభిప్రాయపడ్డారు. రష్యా మార్కెట్‌లో విస్తరణ చర్యలు చేపట్టడానికి, రష్యా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఆయా కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలియజేశారు. ఉక్రెయిన్‌–రష్యా ఘర్షణను ముగించడానికి భారత్‌ చేసే ఎలాంటి శాంతి ప్రయత్నాలనైనా తాము స్వాగతిస్తామని స్పష్టంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కారం సాధించాలన్న భారత్‌ వైఖరికి రష్యా వ్యూహం చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement