అభివృద్ధిని చూడలేని నారాజ్‌ మామ | Prime Minister Narendra Modi at NaMo for Viksit Bharat event | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని చూడలేని నారాజ్‌ మామ

Sep 9 2026 1:49 AM | Updated on Sep 9 2026 1:49 AM

Prime Minister Narendra Modi at NaMo for Viksit Bharat event

ఫిర్యాదులు చేస్తూ లేనిపోని సమస్యలు సృష్టించడమే ప్రతిపక్షాల పని  

అది ఛాత్రోంకీ గూంజ్‌ కాదు.. ఝూట్‌ కీ గూంజ్‌  

2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలు నిర్మించాం.  

యూపీఏ హయాంలో 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేదు  

‘నమో ఫర్‌ వికసిత్‌ భారత్‌’ వేదికగా  ప్రధాని మోదీ ఆగ్రహం  

వడోదర: ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేక విమర్శకులు నిత్యం అసంతృప్తి చెందుతూ అలిగిన మామ(నారాజ్‌ ఫుఫా) లాగా ఫిర్యాదులు చేస్తూ, లేనిపోని సమస్యలను సృష్టిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాహుల్‌ నిర్వహిస్తున్న ఛాత్రోంకీ గూంజ్‌(విద్యార్థుల ప్రతిధ్వని) సభలను ఝూట్‌ కీ గూంజ్‌(అబద్ధాల ప్రతిధ్వని)గా కొట్టిపారేశారు. 

మోదీ మంగళవారం గుజరాత్‌లో పర్యటించారు. వడోదరలో ‘నమో ఫర్‌ వికసిత్‌ భారత్‌’కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నవీ ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని అనుసంధానించే వెస్ట్రన్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌లోని మూడు కీలక సెక్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతంగా పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేగంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకలా సాగేవని ఆక్షేపించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..  

తప్పులు వెతకడమే వారి పని  
‘‘తప్పులు వెతకడమే ప్రతిపక్షాల పనిగా మారింది. కొత్తగా ప్రారంభించిన ఫ్రైట్‌ కారిడార్‌ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతారు. ముంబై ఓడరేవు నుంచి వడోదరకు ఇటీవల డబుల్‌–స్టాక్‌ కంటైనర్‌ సరుకు రవాణా రైలును నడిపించాం. దీనివల్ల ఒకే ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును ఆ రెండు నగరాల మధ్య రవాణా చేయగలిగాం. 

ఇప్పుడు నారాజ్‌ ఫుఫాజీ (అలిగిన మామగారు) నోటికి పని చెబుతారు. డబుల్‌–స్టాక్‌ కంటైనర్‌ రైళ్లు వస్తే ట్రక్‌ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయి? ప్రజలు కొనుగోలు చేసిన ట్రక్కుల మాటేంటి? అని ప్రశ్నిస్తారు. విమర్శలు చేయడానికి ఫుఫాజీకి ఇప్పుడు కొత్త విషయం దొరికింది. రవాణా కారిడార్‌పైనా వారికి సందేహాలు వస్తాయి. దేశ పురోగతికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకైనా వెళ్తాయి. ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి.  

ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు  
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌తో పోలిస్తే ఎన్డీయే పదేళ్ల పాలనలో ఆధునీకరణ వేగంగా జరిగింది. 2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలను నిర్మించాం. గత ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. రాజకీయ ప్రసంగాల కంటే వాస్తవికతకే యువత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు. రాజకీయ తప్పుదారి పట్టించే చర్యలకు గురికావొద్దు. అబద్ధాలతో అడుగడుగునా తప్పుదోవ పట్టించేవారు కనిపిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో పనిచేస్తోందో యువతకు తెలుసు’’ అని మోదీ అన్నారు.

ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌  
‘‘దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మన కుటుంబాల ఆదాయంలో చాలాభాగం కోచింగ్‌ల కోసమే ఖర్చవుతోంది. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని మోదీ స్పష్టం చేశారు.  

‘నమో కమలం’ ప్రారంభం  
దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అధికార పార్టీకి ఉన్న అధికారం, పదవులు, సంస్థాగత బలం పూర్తిగా ప్రజాసేవ కోసమేనని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో సాధారణ క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ఎప్పుడూ అధికార మదంతో విర్రవీగలేదని అన్నారు. తమ కార్యకర్తలు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ దృష్టిలో అధికారం కేవలం సేవాభావం కోసమేనని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement