కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు! | Rahul Gandhi Interviews 120 Leaders for Congress Future Team | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!

Sep 8 2026 11:44 AM | Updated on Sep 8 2026 11:49 AM

Rahul Gandhi Interviews 120 Leaders for Congress Future Team

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా 120 మంది కొత్త జాతీయ కార్యదర్శుల ఎంపికకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్వయంగా నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారి చురుకుదనం, పనితీరు నివేదిక ఆధారంగా అర్హతలను పరిశీలిస్తున్నారు. జాతీయ స్థాయి పదవుల నియామకాలకు రాజకీయ సీనియారిటీకి బదులుగా పనితీరు, చురుకుదనాన్ని ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తున్నారు.

జాతీయ కార్యదర్శి పదవుల కోసం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కలిసి నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన నేతలను ఢిల్లీకి పిలిపించారు. సోమవారం 30 మంది నేతలను ఇంటర్వ్యూ చేశారు. రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ రెండు రోజుల పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ కొనసాగనుంది. ఒక్కోసారి 10 మంది చొప్పున నేతలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. గతంలో వారు చేసిన పనులు, ప్రొఫైల్‌ తదితర అంశాలపై రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్వ్యూకు హాజరవుతున్న నేతల పనితీరు నివేదికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లో జాతీయ కార్యదర్శుల నియామకానికి కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత కార్యదర్శుల్లో 60 శాతానికిపైగా మార్పులు చేసి కొత్త ముఖాలకు అవకాశం కల్పించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. కేవలం సిఫార్సులు, సిఫార్సు లేఖల ఆధారంగా కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలు, పని సామర్థ్యం, దూరదృష్టి ఆధారంగా యువతకు అవకాశం కల్పించాలన్నది రాహుల్‌గాంధీ ఉద్దేశం. జాతీయ కార్యదర్శి పదవికి 120 మంది నేతలను ఇంటర్వ్యూ చేయనున్నారు. అనంతరం వారి నియామకం చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ ‘సంఘటన్‌ సృజన్‌’ కార్యక్రమంలో పరిశీలకులుగా పనిచేసిన నేతలకు ఈ పదవుల కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.

2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పునరుద్ధరణ, తరాల మార్పు రాహుల్‌గాంధీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. యువతను ముందుకు తీసుకురావడంతోపాటు సంస్థాగత వ్యవస్థలో మార్పులకు ఆయన గతంలోనూ ప్రయత్నించారు. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐలోనూ ఇంటర్వ్యూ ఆధారిత నియామక ప్రక్రియను అనుసరించారు. గతంలో సీనియర్‌ నేతల వ్యతిరేకత, అంతర్గత విభేదాల కారణంగా ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో జరుగుతున్న మార్పులతో పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువ నేతలకు అవకాశాలు కల్పిస్తున్నారు. దీని కొనసాగింపుగానే జాతీయ కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన యువతకు అవకాశం కల్పించి సమ్మిళిత బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇది కూడా చదవండి: పేరులో తేడా.. పద్మశ్రీ గ్రహీతకూ ‘సర్‌’ నోటీసు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement