మోదీని గద్దె దించేందుకు ఐక్య పోరాటం అవసరం
తెలంగాణలో కోటి ఓట్ల తొలగింపు కుట్ర..
కొడంగల్ నియోజకవర్గంలోనే 81 వేల ఓట్ల వ్యత్యాసం
సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత ప్రమాదకరమైన మోదీని గద్దె దించేందుకు జాతీయస్థాయిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇప్పటి నుంచే పునాది వేయాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తే ప్రజా సమస్యలకు తమ ప్రభుత్వం సహేతుకమైన పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు అక్రమ పద్ధతులను బీజేపీ అనుసరిస్తుందని, అందులో భాగంగానే ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తుందని ధ్వజమెత్తారు. సీపీఎం సీనియర్ నేత, రైతాంగ ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరు ఓడాలో, గెలవాలో ఎన్నికల సంఘం నిర్ణయించే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గమైన కొడంగల్‌లోనే వలస వెళ్లిన పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని, సుమారు 81 వేల ఓట్లను అనుమానాస్పద ఓట్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బిహార్, పశ్చిమబెంగాల్‌లో గెలిచిన విధంగానే, ఓట్లను తొలగించిన విధానాన్ని తెలంగాణలో అమలు చేసి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించి, తమకు అనుకూలంగా ఉండేందుకు ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 33 శాతం ఓట్లను తొలగిస్తున్నప్పుడు మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక్కరు మాట్లాడడం లేదన్నారు.
రైతాంగానికి ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా’సారంపల్లి మల్లారెడ్డి
సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై అపారమైన అవగాహన ఉన్న నాయకుడని రేవంత్‌రెడ్డి కొనియాడారు. భూసారం నుంచి విత్తనం, పెట్టుబడి, పంట, కౌలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర వరకు వ్యవసాయ రంగంలోని ప్రతి అంశంపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి ప్రత్యేకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. మల్లారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిపేలా రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని సీఎం తెలిపారు.
ప్రమాదంలో’లౌకికవాదం, ప్రజాస్వామ్యం : ప్రకాశ్ కారత్
దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్లు, ఆదివాసీలు లక్ష్యంగా ఎస్‌ఐఆర్ కింద ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను సందేహాస్పద ఓట్లుగా మిగిలాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు తొత్తుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం రైతులు, పేదలు, కార్మికుల సమస్యల కోసం పోరాడిన నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు.
ఆయన చూపిన మార్గంలో ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సభలో నేతలు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షత వహించగా, మంత్రి అజహరుద్దీన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, తమ్మినేని వీరభద్రం, వీరయ్య, జ్యోతి, మల్లు లక్ష్మి, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి రచన ‘నాగేటి సాళ్లు’పుస్తకాన్ని ప్రకాశ్ కారత్ ఆవిష్కరించగా, మల్లారెడ్డిపై ప్రజానాట్యమండలి రూపొందించిన పాటల సీడీని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.


