తెలంగాణ: కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కల్లెడ శివారు ధర్మపురి రోడ్డులో జరిగింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్‌కి సమాచారం అందించి, క్షతగాత్రులను కారులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు.
అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాత్రి మహేష్ (23) పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ముగ్గురిని చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


