మిస్ కేరళ-2014 విజేతగా గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి సురేశ్.. తాజాగా ‘బిగ్‌బాస్ మలయాళం 8’లోకి అడుగుపెట్టారు. మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆమె పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి.. సినిమాల నుంచి రియాలిటీ షో వైపు అడుగులు వేయడం విశేషం.
మిస్ కేరళ టైటిల్ గెలుచుకున్న తర్వాత గాయత్రి సురేశ్ సినిమాల్లోకి ప్రవేశించారు. కుంచాకో బోబన్ సరసన నటించిన ‘జమ్నా ప్యారి’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘కరింకున్నం 6ఎస్’, ‘ఒరే ముగమ్’, ‘ఒరు మెక్సికన్ అపరాథ’ తదితర మలయాళ చిత్రాల్లో నటించారు. కొంతకాలం బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన ఆమె.. తన కెరీర్‌కు కొంతకాలం విరామం ఇచ్చారు.
తాజాగా ‘డిస్కో’ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు గాయత్రి ప్రకటించారు. ఆంటోనీ పెపే, అర్జున్ అశోకన్, చెంబన్ వినోద్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గాయత్రి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ‘హీరో హీరోయిన్’, ‘నేను లేని నా ప్రేమ కథ’, ‘గంధర్వ’ తదితర చిత్రాల్లో నటించారు. ర్యాంప్ వాక్ మోడల్‌గా కూడా గుర్తింపు పొందిన గాయత్రి.. సోషల్ మీడియాలో తన ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.
ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్ మలయాళం నాలుగో సీజన్‌కు ముందు గాయత్రి సురేశ్ షోలో పాల్గొంటారనే ప్రచారం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించిన విషయాన్ని అప్పట్లో ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఆ సీజన్‌లో తాను కంటెస్టెంట్‌గా పాల్గొనడం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే భవిష్యత్‌లో ఏదైనా సీజన్‌లో బిగ్‌బాస్ హౌస్‌లోకి రావచ్చని అప్పట్లో సంకేతాలు ఇచ్చారు. ఆమె అన్నట్టుగానే ఇప్పుడు బిగ్‌బాస్ మలయాళం 8లో గాయత్రి సురేశ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న గాయత్రి.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి ఆటతీరు కనబరుస్తారో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి బాక్సింగ్ దిగ్గజం.. వణికిపోతున్న పోటీదారులు!


