హావ్రా: పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా మండపాల వెనుక మాంసాహార వంటకాలు తయారు చేయడంపై బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. హావ్రాలో నిర్వహించిన హనుమాన్ కథాశ్రవణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నవరాత్రులు ప్రారంభమైనప్పుడు దుర్గాపూజ కోసం పలు ప్రాంతాల్లో భారీ మండపాలు ఏర్పాటు చేస్తారని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే కొన్ని చోట్ల మండపాల వెనుక లేదా వేదికల పక్కన మాంసాహారం, ఇతర రకాల ఆహార పదార్థాలను వండుతుంటారని, ఇలా చేయడం తనకు నచ్చదని అన్నారు. ఈసారి నవరాత్రుల సందర్భంగా ఇలాంటి ఆహారాన్ని మండపాల వెనుక తయారు చేసే వారిని బహిష్కరించాలని బెంగాల్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మతపరమైన విశ్వాసాలను పాటిస్తున్నామని చెప్పుకుంటూ దుర్గాపూజ మండపాల వెనుక మాంసాహారం తయారు చేసే వారిని తాను మతపరమైన వ్యక్తులుగా భావించబోనని అన్నారు. అలాంటి వారిని కపటులు అని పిలుస్తామని వ్యాఖ్యానించారు.
నవరాత్రుల సమయంలో హిందువులు మేల్కొని ఇలాంటి వ్యక్తులను బహిష్కరించాలని ధీరేంద్ర శాస్త్రి పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజను భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైభవంగా మండపాలు ఏర్పాటు చేస్తారు.
ఇది కూడా చదవండి: నేపాల్: జాతీయ జెండా అవనతం.. మృతులకు నివాళులు


