టీచర్స్ డే వేడుకల్లో.. అదీ పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, మేధావులు హాజరైన కార్యక్రమంలో అమ్మాయిలు చేసిన ఓ డ్యాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీచర్స్ ఐకాన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండగా.. దేశాన్ని ఊపేసిన ఓ ఐటెం సాంగ్‌కు వాళ్లు హుషారుగా ఊగిపోయారు. ఆ వీడియోనే ఇప్పుడు నెట్టింట రచ్చకు కారణమైంది.
డెహ్రాడూన్‌లోని జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సెప్టెంబర్ 5న నిర్వహించిన కార్యక్రమం వీడియో ఎక్స్‌లో వైరల్ అయ్యింది. మొత్తం 46 మంది ఉపాధ్యాయులను సత్కరించిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అయితే ఎంచుకున్న పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. డర్టీ పిక్చర్ చిత్రంలోని ‘ఊ లా లా.. ఊ లా లా.. తూ హై మేరీ ఫ్యాంటసీ’ అంటూ ఆ అమ్మాయిలు హుషారుగా స్టెప్పులేశారు. అది చూసి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు.
మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే టీచర్స్ డే వేడుకలకు ఇలాంటి పాట సరిపోతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం దీనిపై వస్తున్న విమర్శలను అతిగా స్పందించడం అని కొట్టిపారేస్తున్నారు.
కళాశాల కార్యక్రమాల్లో విద్యార్థులు తమకు నచ్చిన పాటలకు సరదాగా డ్యాన్స్ చేయడం సాధారణమేనని, దీనిని సంప్రదాయాలకు వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. యువత వేడుకలను చూసే దృక్పథంలో వచ్చిన మార్పుగా మరికొందరు అభివర్ణిస్తున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో టీచర్స్ డే వేడుకల్లో సంప్రదాయ విలువలకే ప్రాధాన్యమివ్వాలా? లేదంటే విద్యార్థుల ఆధునిక శైలికీ చోటివ్వాలా? అనే చర్చ మొదలైంది. ఒక చిన్న నృత్య ప్రదర్శన కాస్తా సంప్రదాయం, ఆధునికత మధ్య సోషల్ మీడియాలో వాదనకు దారితీసింది.
Dr. Sarvepalli Radhakrishnan be like "Thank god, i didn't live long enough to see this"pic.twitter.com/ypB3p27XaH
— Keh Ke Peheno (@coolfunnytshirt) September 7, 2026


