ఆర్‌ఎస్‌ఎస్‌‌ అంటే విద్వేషమా? మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు | RSS Is Not About Hatred: Mohan Bhagwat's Key Remarks in London | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌‌ అంటే విద్వేషమా? మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

Sep 7 2026 8:45 AM | Updated on Sep 7 2026 8:55 AM

RSS Is Not About Hatred: Mohan Bhagwat's Key Remarks in London

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ భావజాలంపై ఏళ్లుగా రాజకీయంగా తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య అనుబంధం, ఏకత్వ భావనే సంఘ్‌ ఆలోచనకు ఆధారమని ఆయన స్పష్టం చేశారు. అలాగే వైవిధ్యాన్ని గౌరవిస్తూ అందరూ కలిసి ముందుకు సాగడమే తమ దృక్పథమని చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలకు విద్వేషమే పునాది అనే విమర్శలను ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఖండించారు. లండన్‌లో జరిగిన ‘సెలబ్రేషన్‌ ఆఫ్‌ వన్‌నెస్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘విద్వేషం కాదు.. అందరినీ కలిపే భావనే ఆర్‌ఎస్‌ఎస్‌ పునాది అని, అదే తమ సంస్థ పనితీరుకు ఆధారమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నుంచి కుటుంబం, సమాజం, మానవాళి వరకు ఒకరితో ఒకరికి అనుబంధ భావన ఉండటమే హిందూ ఆలోచనా విధానమని భాగవత్‌ చెప్పారు. 

భిన్నత్వం సహజమేనని, అయితే దాని వెనుక ఉన్న ఏకత్వాన్ని గుర్తించి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ‘వైవిధ్యం కోసం ఏకత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.. ఏకత్వం కోసం వైవిధ్యాన్ని తొలగించాల్సిన పనిలేదు’ అనే భావనను వివరించారు.

‘అందరం కలిసి ఎదగాలి’
ప్రపంచంలో ఘర్షణలు, పోటీ, పర్యావరణ సమస్యలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. మనిషి ప్రకృతిలో భాగమే తప్ప.. దానికి వేరుగా లేడని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రకృతిని దెబ్బతీయకుండా దాని పురోగతికి తోడ్పడాలని చెప్పారు. ‘జీవించు.. ఇతరులను జీవించనివ్వు.. వారిని కూడా ఎదగనివ్వు’ అనే దృక్పథాన్ని ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు.

హిందూ దేశంపై వివరణ
‘హిందూ’ అనేది కేవలం ఒక మతం లేదంటే పూజా విధానం కాదని భాగవత్‌ అన్నారు. భిన్న మార్గాలను గౌరవించడం, ప్రతి ఒక్కరూ తమ మార్గంలో ముందుకు సాగేందుకు అవకాశం కల్పించడమే హిందూ ఆలోచనా విధానమని చెప్పారు. ‘యూనిఫార్మిటీ అవసరం లేదు.. యూనిటీ ఇన్‌ డైవర్సిటీ ఉండాలి’ అని పేర్కొన్నారాయన. 

బ్రిటిష్‌ హిందువులపై.. 
బ్రిటన్‌లో నివసించే హిందువులు తమ కర్మభూమి అయిన బ్రిటన్‌ పట్ల విధేయతతో ఉండాలని మోహన్‌ భాగవత్‌ అక్కడున్నవాళ్లు వేసిన ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు. బ్రిటన్‌, భారత్‌ ప్రయోజనాల మధ్య ఎప్పుడైనా విభేదం తలెత్తితే.. బ్రిటిష్‌ హిందువులు తమ కర్మభూమి వైపే నిలవడం సహజమని అన్నారు. “మీ కర్మభూమి ఎక్కడైతే ఉందో.. మీ విధేయత కూడా అక్కడే ఉండాలి. జన్మభూమి నుంచి విలువలను పొందుతారు.. ఆ విలువలను కర్మభూమిలో ఆచరిస్తూ అక్కడి సమాజానికి సేవ చేయాలి” అని చెప్పారు. హిందుత్వం ఎప్పుడూ కర్మభూమికి ద్రోహం చేయాలని చెప్పదని స్పష్టం చేశారు. భారత్‌ తమకు విలువలను అందించిన జన్మభూమి కాగా.. బ్రిటన్‌ తమ కర్మభూమి అని పేర్కొన్నారు.

యువతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని భాగవత్‌ చెప్పారు. వారికి ఏం సాధించాలో లక్ష్యాన్ని నిర్దేశించాలి కానీ.. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలన్న మార్గాన్ని మాత్రం వారికే వదిలేయాలని సూచించారు. కొత్త తరానికి తమదైన ఆలోచనలు, సామర్థ్యాలతో ముందుకు సాగే అవకాశం కల్పించాలని అన్నారు.

వందేళ్ల ప్రస్థానం.. ముందున్న లక్ష్యం
ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకల్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌లో భాగవత్‌ పర్యటిస్తున్నారు. లండన్‌ కార్యక్రమంలో 326 సంస్థలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులు, బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు, మేయర్లు, కౌన్సిలర్లు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు. సమాజాన్ని మరింత సంఘటితం చేసి, ప్రజలంతా కలిసి ముందుకు సాగే వాతావరణాన్ని సృష్టించడమే తదుపరి లక్ష్యమని భాగవత్‌ చెప్పారు. 

ఇదీ చదవండి: ఛిద్రమైన కలల్ని నిలబెట్టగలరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement