రక్తపోటు పూర్తిగా అదుపులో ఉండి, మధుమేహం (డయాబెటిస్) లేకుండా, పొగతాగకుండా ఉండేవారు... పై రెండు సమస్యలతోపాటు పొగతాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మతిమరపు (డిమెన్షియా) సమస్య లేకుండా దాదాపు 13 ఏళ్లు ఎక్కువకాలం జీవించినట్లు పరిశోధకులు గుర్తించారు. సగటున చూసిననప్పుడు పై మూడు అంశాలూ లేనివారు 30.1 ఏళ్ల పాటు డిమెన్షియా లేకుండా ఉంటే... డిమెన్షియాకు కారణమయ్యే ఆ మూడు రిస్క్‌ఫ్యాక్టర్లూ ఉన్నవారు 17.5 ఏళ్ల పాటే డిమెన్షియాను నివారించగలిగారు.
‘న్యూరాలజీ ఓపెన్ యాక్సెస్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన అమెరికాకు చెందిన ఓ అధ్యయనంలో సగటున 56 ఏళ్ల వయసున్న 12,409 మంది అడల్ట్స్‌ను సుమారు 28 ఏళ్ల పాటు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశోధన కాలంలో వాళ్లలో 3,008 మందికి డిమెన్షియా వచ్చింది. డిమెన్షియా ముప్పు తెచ్చిపెట్టే పై మూడు అంశాలు ఉన్నప్పటికీ... సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో డిమెన్షియా తక్కువ. మతిమరపు లేకుండా మహిళలు ఎక్కువకాలం జీవించినట్లు కూడా ఈ అధ్యయనం తెలిపింది.
‘‘హైబీపీ, డయాబెటిస్, పొగతాగే అలవాటు ఉన్నవాళ్లలో డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాదు... ఇతర కారణాలతో చిన్న వయసులోనే చనిపోయే అవకాశమూ ఎక్కువే. అంతేకాదు... ఈ అలవాట్లు ఉన్నవాళ్లలో ఆయు ప్రమాణమే కాదు... దాంతోపాటు జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు పదిలంగా ఉండే సమయమూ తగ్గుతాయం’టూ ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు తెలిపారు.
మరో అధ్యయనంలో సైతం ఇలాంటి ఫలితాలే...
సరిగ్గా ఇదే అంశంపై స్వీడన్‌లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘ది జర్నల్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దాదాపు 500 మంది ఆరోగ్యవంతులైన పెద్దలు పాల్గొన్న ఈ అధ్యయనంలో నాలుగేళ్ల పాటు వారిని పరిశీలించారు.
ఈ అధ్యయనం చెబుతున్నదాని ప్రకారం... పొగతాగడం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వంటి అంశాలకూ మెదడులోని చిన్న రక్తనాళాలు, వైట్ మ్యాటర్ దెబ్బతినడంతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇలాంటి మార్పులు చివరకు రక్తనాళాలకు సంబంధించిన డిమెన్షియా (వాస్క్యులర్ డిమెన్షియా)కు దారితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారిలో అమైలాయిడ్ బీటా అనే ప్రోటీన్ ఎక్కువగా పేరుకుపోయే అవకాశం కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రోటీన్‌కు కూడా అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉంటుంది. వయసు, జెండర్, జన్యుపరమైన అంశాలను మనం మార్చలేం. అయితే పొగతాగే అలవాటును మానేయడం లేదా ఆ అలవాటుకు పూర్తిగా దూరంగా ఉండటం, హైబీపీనీ, డయాబెటిస్‌నూ అదుపులో పెట్టుకోవడం వంటి అంశాలు పూర్తిగా మన చేతుల్లో ఉన్నవే.
కాబట్టి కనీసం మధ్య వయసు నుంచైనా రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, పొగతాగడం మానేయడం, ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, శారీరకంగా చురుగ్గా ఉండటం వంటివి అలవాటు చేసుకుంటే... వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవెంతో కొంత తోడ్పడవచ్చన్నది నిపుణులు చెబుతున్న మాట.
మతిమరపు లేకుండా అంటే... డిమెన్షియాను రానివ్వకుండా చాలాకాలం నిరోధించాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే చాలు. పైగా అవి చాలా సులభం కూడా. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, పొగతాగకపోవడం, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం వంటి చాలా సులభమైన జీవనశైలి అలవాట్లతో దీర్ఘకాలం పాటు డిమెన్షియా బారిన పడకుండా ఉండటంట తోపాటు చాలాకాలం పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చంటూ రెండు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ జీవనశైలి అలవాట్లేమిటో చూద్దాం...
(చదవండి: తలగడలోని డస్ట్‌మైట్స్‌తో అలర్జీలు!)


