‘ఇదే నా ఇల్లు.. ఈయనే నా రాజు!’ పురావస్తు శాస్త్రవేత్తలకే షాక్‌! | Funday Special Story On Dorothy Eady Mystery | Sakshi
Sakshi News home page

గతజన్మ కథ చెప్పిన మూడేళ్ల చిన్నారి! అంతుచిక్కని డోరతి మిస్టరీ!

Sep 6 2026 9:35 AM | Updated on Sep 6 2026 9:40 AM

Funday Special Story On Dorothy Eady Mystery

ఫండే

మిస్టిక్‌ వరల్డ్‌

ది 1907... లండన్‌లోని ఓ సువిశాలమైన భవనం... డోరతి లూయిస్‌ ఈడీ అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ మెట్లపై నుంచి జారి కిందపడిపోయింది. తలకు గట్టి దెబ్బ తగలడంతో ఎలాంటి చలనం లేదు. వెంటనే వైద్యుడు వచ్చి పరిశీలించారు. ‘పాప శ్వాస ఆడటంలేదు. గుండె కొట్టుకోవడంలేదు. ఆమె చనిపోయింది’ అని చెప్పడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

కొద్దిసేపటికే అద్భుతం జరిగింది. చనిపోయిందనుకున్న ఆ చిన్నారి కళ్లు తెరిచి, ‘అమ్మా...’ అని పిలిచేసరికి శోకసంద్రంలో ఉన్న ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే, బతికిన ఆ పాప డోరతీ ఈడీ కాదు ప్రమాదం తర్వాత డోరతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంగ్లిష్‌ కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారి, స్పష్టమైన బ్రిటిష్‌ యాక్సెంట్‌ మరచిపోయి, వింతైన ప్రాచీన ఈజిప్షియన్‌ శైలిలో మాట్లాడటం మొదలుపెట్టింది.

నిద్రలో లేచి కూర్చుని ‘నన్ను మా ఇంటికి తీసుకెళ్లండి... ఇది నా ఇల్లు కాదు’ అని ఏడ్చేది. తలకు దెబ్బ తగలడం వల్ల పాప మానసిక స్థితి సరిగ్గా లేదని తల్లిదండ్రులు భావించేవారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. 
ఒకరోజు డోరతిని ఆమె తల్లిదండ్రులు బ్రిటిష్‌ మ్యూజియానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న పురాతన ఈజిప్ట్‌ విగ్రహాలు, ఫారోల శిల్పాలను చూడగానే డోరతి కళ్లు మెరిసిపోయాయి. ఒక్కసారిగా ఆ విగ్రహాల వైపు పరుగెత్తుకెళ్లి, వాటి పాదాలను ముద్దాడి, గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.

ఒక ఫారో ప్రతిమను చూపిస్తూ, ‘ఇదిగో... ఇది నా ఇల్లు. ఈయన నా రాజు సెటి–1’ అని బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు అయోమయం చెందారు.
ఆ తర్వాత ఆమెకు ప్రాచీన ఈజిప్ట్‌పై ఆసక్తి రోజురోజుకూ పెరిగింది. ఈజిప్టు చరిత్ర, హైరోగ్లిఫిక్స్, దేవాలయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.
కొంచెం పెద్దయ్యాక తన గతజన్మ గురించిన జ్ఞాపకాలను స్పష్టంగా వివరించడం ప్రారంభించింది. తన పేరు బెంట్రెషిట్‌ అని, మూడేళ్ల వయసులో తల్లి చనిపోగా, తండ్రి తనను వదిలేయడంతో అబిడో‹స్‌లోని సెటి–1 ఆలయ పూజారి తనను పెంచినట్టు చెప్పింది.

అక్కడ పూజారిణిగా ఉన్న తాను కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలని, కానీ ఈజిప్ట్‌ రాజు సెటి–1 ఆ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు తమ ఇరువురి మధ్య ప్రేమ చిగురించి గర్భవతిని అయ్యానని చెప్పింది. విషయం బయటకు వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భావించి, ఆత్మహత్య చేసుకున్నానని పేర్కొంది. తనకు రాత్రివేళల్లో ‘హోర్‌–రా’ అనే ఆత్మ కనిపించేదని ఆమె చెప్పింది. ఆ ఆత్మ తన గతజన్మ కథను నెమ్మదిగా చెప్పేదని, దాన్ని తాను హైరోగ్లిఫిక్‌ లిపిలో రాసుకున్నానని పేర్కొంది.

డోరతి మాటలను ప్రపంచం మొదట్లో పట్టించుకోలేదు. ఆమెను ఓ పిచ్చి వ్యక్తిలానే చూశారు. అయితే, ఆమె పెద్దయ్యాక ఇంగ్లండ్‌ వదిలి ఈజిప్ట్‌ చేరుకుంది. అక్కడ ఈజిప్షియన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ యాంటిక్విటీస్‌లో పనిచేసే పరిశోధకులతో తన గతజన్మ వివరాలను పంచుకుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆమె చెప్పేది నిజమో కాదో తేల్చడానికి సిద్ధమయ్యారు. ‘అబిడోస్‌ సెటి–1 ఆలయం’ వద్ద ఆమెకు కఠినమైన పరీక్ష పెట్టారు.

చీకటి పడిన తర్వాత, ఎలాంటి వెలుతురు లేని సమయంలో డోరతిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. గతంలో అక్కడ ఉన్న కుడ్య చిత్రాల లొకేషన్లు, భూగర్భంలో దాగి ఉన్న తోటల అమరికను గుర్తించమన్నారు. ఆ చీకటిలోనే ప్రాచీన కుడ్య చిత్రాలతోపాటు రాజభవన తోటల సరిహద్దులు ఎక్కడున్నాయో చెప్పడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఆమె సూచించిన ప్రదేశాలను పరిశీలిస్తే, అక్కడి పురాతన నిర్మాణాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం వారిని ఆశ్చర్యపరచింది.

ఈ విషయం అలా బయటకు రావడంతో ఈజిప్షియన్లు ఆమెను గౌరవంతో ‘ఓమ్‌ సెటి’ అని పిలవడం ప్రారంభించారు. అనంతరం ఈజిప్షియన్‌ వ్యక్తిని వివాహం చేసుకున్న డోరతికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి సెటీ అని పేరు పెట్టారు. జీవితాంతం గతజన్మ తాలూకు జ్ఞాపకాలతోనే బతికిన డోరతి 1981లో కన్నుమూసింది.

ఆమె నిజంగానే బెంట్రెషిటా? లేక ప్రాచీన ఈజిప్ట్‌పై ఉన్న చిన్ననాటి మక్కువ ఒక అసాధారణమైన మానసిక ప్రపంచాన్ని సృష్టించిందా? డోరతి చెప్పిన విషయాల్లో చరిత్ర ఎంత? జ్ఞాపకం ఎంత? ఊహ ఎంత? ఈ ప్రశ్నలకు శాస్త్రం ఇప్పటికీ తుది సమాధానం ఇవ్వలేదు. కానీ, లండన్‌ లో పుట్టిన ఓ చిన్నారి.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అబిడోస్‌ అనే పురాతన నగరంతో ఏర్పరచుకున్న అనుబంధం సాధారణ కథ కాదు.
డోరతీ ఈడీ చనిపోయింది. కానీ ‘ఓమ్‌ సెటీ’గా ఆమె వదిలిన మిస్టరీ మాత్రం ఇంకా బతికే ఉంది.

- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

ఇవి కూడా చదవండి: ఏఐతో వైరస్‌ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement