ఏఐతో వైరస్‌ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా? | Funday Special Cover Story On AI Artificial Viruses | Sakshi
Sakshi News home page

ఏఐతో వైరస్‌ సృష్టి.. మానవాళికి వరమా? శాపమా?

Sep 6 2026 8:39 AM | Updated on Sep 6 2026 8:45 AM

Funday Special Cover Story On AI Artificial Viruses

ఫండే

కవర్‌ స్టోరీ

వైరస్‌లు, బ్యాక్టీరియాల వంటి ఇతరేతర రోగకారక జీవకణాలు ప్రకృతిలో అసంఖ్యాకంగా ఉన్నవే మనకు తెలుసు. ఏఐ సాయంతో వీటిని కృత్రిమంగా కూడా సృష్టించడం సాధ్యమేనని ఇటీవల అమెరికన్‌ శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రకృతిలో లేని పదహారు వైరస్‌లను కొత్తగా సృష్టించారు. ఏఐతో కృత్రిమ వైరస్‌లు, ఇతరేతర జీవకణాలను సృష్టించే పరిజ్ఞానం వల్ల జరగబోయే మేలేమిటి? 
వాటిల్లబోయే కీడేమిటి? శాస్త్ర సాంకేతిక రంగాల్లో చర్చకు దారితీస్తున్న ఈ అంశం గురించి తెలుసుకుందాం...

నిజానికి నిండు కణం కూడా కాదు – జీవకణాల్లో ఉండే ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏతో కూడిన అతిసూక్ష్మ కణశకలం. ప్రొటీన్‌ కవచంతో ఉండే ఈ కణశకలమే వైరస్‌. ఇది ఏదైనా జీవకణంలోకి చొరబడితే, అసంఖ్యాకంగా వృద్ధి చెందుతుంది. అలవికాని అలజడి సృష్టిస్తుంది. జీవకణాల మనుగడకు ముప్పు తెస్తుంది. జీవుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. జీవకణాలతో రూపొందిన మనుషుల శరీరాలలోకి రకరకాల వైరస్‌లు చొరబడుతుంటాయి. వీటిలో కొన్ని వైరస్‌లు ప్రాణాంతక వ్యాధులను కూడా కలిగిస్తాయి. వైరస్‌ ధాటి ఎలా ఉంటుందో ‘కోవిడ్‌–19’ ద్వారా ఇప్పటి ప్రపంచానికి బాగా బోధపడింది.

ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసినవి ప్రకృతిలో పుట్టిన వైరస్‌లు మాత్రమే! ఇటీవల శాస్త్రవేత్తలు ఏఐతో పదహారు సరికొత్త వైరస్‌లు సృష్టించారు. ఇవి ఇంతవరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. ప్రస్తుతానికి ఏఐ సాంకేతికతతో సృష్టించిన వైరస్‌లు సానుకూల ఫలితాల కోసమే రూపొందించినవి. ఇదే సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్‌లను సృష్టించే అవకాశం కూడా ఉండటమే ఆందోళనకు కారణమవుతోంది. ప్రపంచంలో కలకలం రేపుతున్న ఈ ‘కృత్రిమ కణ’కలం గురించి ఈ ప్రత్యేక కథనం...

ప్రకృతిలో ఉన్న వైరస్‌లతోనే మానవాళి ఇప్పటికీ సతమతవుతుంటే, తాజాగా ఏఐతో తయారైన కృత్రిమ వైరస్‌లు పుట్టుకొచ్చాయి. ఏఐ సాయంతో వైరస్‌లు, ప్రొటీన్‌ కణాలను రీడిజైన్‌ చేసే ఈ కొత్త ప్రక్రియకు శాస్త్రవేత్తలు ‘సింథటిక్‌ బయాలజీ’ అనే పేరు పెట్టారు. 
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆర్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఏఐ సాంకేతికతో పదహారు కొత్త వైరస్‌లను తయారు చేశారు. ఈ వైరస్‌లు ఇదివరకు ప్రకృతిలో ఎక్కడా లేనివి. స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు ఏఐకి వైరస్‌ల డీఎన్‌ఏ నమూనాలను ఇచ్చి, వాటి ఆధారంగా కొత్తగా పదహారు వైరస్‌ జీనోమ్‌లను రూపొందించారు. ఇవి బ్యాక్టీరియా కణాల్లోకి చొరబడి వాటిని నాశనం చేయగలవు. లాబొరేటరీల్లో జరిపిన పరీక్షల్లో ఈ పదహారు వైరస్‌లు ఇ–కోలి బ్యాక్టీరియా కణాలను విజయవంతంగా అరికట్టగలిగాయి.

స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కంప్యూటేషనల్‌ బయాలజిస్ట్‌ డాక్టర్‌ బ్రియాన్‌ హై ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఏఐకి వైరస్‌ల డీఎన్‌ఏ నమూనాలను ఇచ్చి, వాటిలో తాము కోరుకున్న మార్పులను సూచించి, ఇదివరకు ప్రకృతిలో ఎక్కడాలేని పదహారు సరికొత్త వైరస్‌లను సృష్టించింది. కొత్త వైరస్‌ల సృష్టి కోసం ఏఐ రూపొందించిన జీనోమ్‌ నమూనాలకు ‘ఇవో–1’, ‘ఇవో–2’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ వైరస్‌లను ప్రధానంగా మానవాళికి హాని చేసే ‘ఇ–కోలి’ తరహా బ్యాక్టీరియాలను తుదముట్టించే లక్ష్యంతో రూపొందించారు. ఈ ప్రయత్నంలో భాగంగా డాక్టర్‌ బ్రియాన్‌ హై నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిజానికి వందలాది కృత్రిమ వైరస్‌ నమూనాలను ఏఐ సాయంతో పరీక్షించింది. వీటిలో పదహారు వైరస్‌లు మాత్రమే శాస్త్రవేత్తలు ఆశించినట్లుగా బ్యాక్టీరియా కణాలను నిర్మూలించగలిగాయి.

శాస్త్రవేత్తల జాగ్రత్తలు
ఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌లను సృష్టించడంలో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆర్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఏఐకి వైరస్‌ జన్యు సమాచారం ఇవ్వడంలో గరిష్ఠస్థాయి అప్రమత్తత పాటించారు. ఏఐకి కేవలం బ్యాక్టీరియాను నిర్మూలించగలిగే ‘బ్యాక్టీరియోఫేజ్‌’ వైరస్‌ల జన్యు సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇందులోంచి మనుషులకు, జంతువులకు, మొక్కలకు సోకే వైరస్‌ జన్యు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో ఉనికిలో ఉన్న వైరస్‌లకే జన్యు ఉత్పరివర్తనలు జరపడం మాత్రమే చేస్తూ వచ్చారు.

ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జన్యు విశ్లేషణల కోసం, జన్యు మార్పిడి సూచనలు తెలుసుకోవడం మాత్రమే దానిని వాడుతూ వచ్చారు. ఇప్పుడు తొలిసారిగా ఏఐతోనే వైరస్‌ జీనోమ్‌లకు రూపకల్పన చేసి, కొత్త వైరస్‌లను సృష్టించారు. ఏఐ అందించిన జీనోమ్‌ నమూనాల ఆధారంగా ప్రయోగశాలలో సృష్టించిన ఈ వైరస్‌లు పూర్తిస్థాయి కృత్రిమ వైరస్‌లు. జీవశాస్త్ర ప్రయోగాల్లో దీనినొక గొప్ప మైలురాయిగా కొందరు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్‌ల ద్వారా సాధించగల సానుకూల ఫలితాల గురించి వారు చాలా విశేషాలే చెబుతున్నారు. అయినా, ఏఐ కృత్రిమ వైరస్‌లను సృష్టించగలగడం పట్ల శాస్త్ర సాంకేతిక వర్గాల్లోనే కాకుండా, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా కొన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- డాక్టర్‌ బ్రియాన్‌ హై

ఇవీ సానుకూలతలు
ఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌లను సృష్టించడం ఇదివరకటి ప్రక్రియల కంటే చాలా సులువైనది. దీని వల్ల చాలావరకు సమయం కలిసొస్తుంది. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇదివరకు లాబొరేటరీల్లో ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతిలో రకరకాల ప్రయత్నాలు సాగిస్తే తప్ప వైరస్‌లలో ఆశించిన జన్యు ఉత్పరివర్తనలు తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు. ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఇప్పుడు ఏఐకి ఈ పని అప్పగించడం వల్ల వేగంగా ఫలితాలు వస్తున్నాయి. ఏఐ తనకు అందించిన జీవ సమాచారాన్ని శరవేగంగా ఆకళింపు చేసుకుని, కొత్త జన్యు నమూనాలకు రూపకల్పన చేయగలుగుతోంది.

బ్యాక్టీరియాను నాశనం చేయగల వైరస్‌లను ఏఐ సాయంతో సృష్టించడం ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారి వాదన ప్రకారం ఇప్పటికే కొన్ని ప్రమాదకరమైన వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా కణాలు యాంటీ బయోటిక్స్‌ను తట్టుకునే శక్తిని సంతరించుకున్నాయి. వీటిని అరికట్టడానికి మరింత శక్తిమంతమైన యాంటీ బయోటిక్స్‌ను తయారు చేసే బదులుగా ఏఐ సాయంతో తయారు చేసిన వైరస్‌లనే ఆయుధాలుగా ఉపయోగిస్తే సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌ల సృష్టి వల్ల కలిగే ఉపయోగాలు ఇవీ:

1. వ్యాక్సిన్లు
ఏఐ సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ వైరస్‌లతో మెరుగైన వ్యాక్సిన్లను తయారు చేయడం సులువుగా మారుతుంది. కృత్రిమ వైరస్‌లతో తయారు చేసిన వ్యాక్సిన్ల ద్వారా ప్రమాదకరమైన వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులను శాశ్వతంగా అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న వైరస్‌లలో జరగబోయే ఉత్పరివర్తనలను ముందుగానే ఏఐతో అంచనా వేసి, వాటిని అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేయడానికి కూడా వీలవుతుంది.

2. జన్యు చికిత్స
జన్యు వ్యాధులను నయం చేయగల జన్యుచికిత్స పద్ధతులు మరింత తేలికవుతాయి. జన్యులోపాల వల్ల తలెత్తే వ్యాధులను నయం చేయడానికి జన్యువులను సరిచేసే పదార్థాలను జన్యుకణాల్లోకి పంపాల్సి ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఏఐ సాంకేతికతతో తయారు చేసే హానికరం కాని ‘ఆర్టిఫిషియల్‌ వైరల్‌ వెక్టర్స్‌’ను జన్యుకణాల్లోకి పంపడం ద్వారా జన్యులోపాలను సవరించడం సులువుగా మారుతుంది. ఈ ‘ఆర్టిఫిషియల్‌ వైరల్‌ వెక్టర్స్‌’ ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా, లోపాలు ఉన్న జన్యుకణాలకే నేరుగా జన్యు పదార్థాలను చేరవేస్తాయి.

3. క్యాన్సర్‌ చికిత్స
ఏఐ సాయంతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో క్యాన్సర్‌ చికిత్స మరింత మెరుగుపడుతుంది. ఏఐ సాయంతో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించగలిగే ‘ఆంకోలైటిక్‌ వైరస్‌’లను రూపొందించవచ్చు. ‘ఆంకోలైటిక్‌ వైరస్‌ థెరపీ’ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా, క్యాన్సర్‌ కణాలనే నిర్మూలిస్తాయి. క్యాన్సర్‌ చికిత్సలో ఇప్పటికే వాడుకలో ఉన్న రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి పద్ధతులు తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుండటం తెలిసిందే! ‘ఆంకోలైటిక్‌ వైరస్‌ థెరపీ’ అందుబాటులోకి వస్తే, క్యాన్సర్‌ రోగులకు ఈ చికిత్స వరంగా మారుతుంది.

4. ఫేజ్‌ థెరపీ
కృత్రిమ వైరస్‌లు ‘యాంటీబయెటిక్‌ రెసిస్టెన్స్‌’కు విరుగుడు కాగలవు. వీటి ద్వారా చేసే చికిత్సను ‘ఫేజ్‌ థెరపీ’ అంటున్నారు. ‘ఫేజ్‌ థెరపీ’లో ఉపయోగించే కృత్రిమ వైరస్‌లు అత్యంత శక్తిమంతమైన యాంటీ బయోటిక్‌లకు లొంగని జగమొండి బ్యాక్టీరియా కణాలను సైతం నిర్మూలించగలవు.

ఇంకొన్ని ఇబ్బందులు
ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా, ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో కొన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండే వైరస్‌లు మన శరీరంలోకి చేరితే, వాటిని ఎదుర్కోవడానికి మన శరీరంలో ఎంతో కొంత నిరోధకత ఉంటుంది. మన శరీరంలోని యాంటీబాడీలు వైరస్‌లతో శక్తిమేరకు పోరాటం సాగిస్తాయి. కృత్రిమ వైరస్‌లు శరీరంలోకి చేరి వ్యాధులను కలిగిస్తే, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించలేదు.

మన శరీరంలోని యాంటీబాడీలు వాటితో పోరాడే ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. పైగా, వాటిని అరికట్టే మందులు, వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండవు. కృత్రిమ వైరస్‌లను కట్టడి చేసే మందులు, వ్యాక్సిన్లు రూపొందించడానికి చాలా కాలమే పట్టవచ్చు. ఏఐ సాంకేతికత శరవేగంగా విస్తరిస్తోంది గాని, దానిని నియంత్రించే చట్టాలు, అంతర్జాతీయ నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతికతను వాడుకుని సృష్టించే కృత్రిమ వైరస్‌ నమూనాలను డిజిటల్‌ డేటా ఆధారంగా గుర్తించడం దుస్సాధ్యం.

ఇక భయాలెందుకు?
ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌లతో ఇన్ని సానుకూలతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటే, వీటిపై భయాలెందుకు? అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. కృత్రిమ వైరస్‌లపై శాస్త్రవేత్తల సమూహం నుంచే భయాలు వ్యక్తమవుతున్నాయి. వారి భయాలు ఎందుకంటే, ప్రపంచంలో దాదాపు డజను దేశాలు ‘బయో వెపన్స్‌’ను సమకూర్చుకుని ఉన్నాయి. ఈ దేశాలు ఆ సంగతిని బాహాటంగా ప్రకటించకపోయినా, అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం ఇవి పకడ్బందీగా కట్టుదిట్టమైన లాబొరేటరీల్లో జన్యు ఉత్పరివర్తనల ద్వారా ప్రమాదకరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు వంటి వాటిని రూపొందించి, ఇప్పటికే నిల్వ చేసుకుని ఉన్నాయి. 

ఇలాంటి మరికొన్ని బయో వెపన్స్‌ను రూపొందించేందుకు రహస్య ప్రయోగాలను ముమ్మరంగా సాగిస్తున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు తలెత్తే సందర్భాల్లో ‘బయో వెపన్స్‌’ను వినియోగించరాదనే ఐక్యరాజ్య సమితి ఒడంబడికను 185 దేశాలు ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో మిగిలిన డజను దేశాలు ఈ ఒడంబడికపై ఇంతవరకు కనీసం సంతకాలు కూడా చేయలేదు. అంతర్జాతీయ గూఢచర్య సంస్థల సమాచారం ప్రకారం చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, సిరియా సహా డజను దేశాల వద్ద ఇప్పటికే ‘బయో వెపన్స్‌’ ఉన్నాయి.

ఈ దేశాలు మరింత ప్రమాదకరమైన ‘బయో వెపన్స్‌’ తయారీ కోసం రహస్య ప్రయోగాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఒడంబడికను ఖాతరు చేయని ఇలాంటి దేశాలకు కృత్రిమ వైరస్‌లను సృష్టించగలిగే ఏఐ సాంకేతికత చేతికందితే, అవి మరిన్ని బయో వెపన్స్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాలతో యుద్ధాలు తలెత్తితే అవి విచక్షణారహితంగా బయోవెపన్స్‌ను బయటకు విడిచిపెట్టి, మహమ్మారి వ్యాధులను వ్యాప్తి చేసి, భారీ జనహననానికి తెగబడవచ్చు. ఐక్యరాజ్య సమితిని ఖాతరు చేయని ధూర్త దేశాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కూడా ఇదే పద్ధతిలో ‘బయో వెపన్స్‌’ తయారీకి సిద్ధపడవచ్చు.

ఉగ్రవాద సంస్థల చేతికి ఈ పరిజ్ఞానం చేరితే, వాటి వల్ల ఎలాంటి విపత్తులు ఏర్పడవచ్చో ఊహించడం కూడా కష్టమే! ధూర్త దేశాలు, ఉగ్రవాద సంస్థలు ఇష్టానుసారం ఏఐ సాంకేతికతతో ప్రమాదకరమైన వైరస్‌లను రూపొందించే ప్రక్రియలో లాబొరేటరీల్లోంచి పొరపాటున లీకైతే, అవి వాతావరణంలో కలిసిపోయి, మహమ్మారి వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐతో రూపొందించే కృత్రిమ వైరస్‌ల వల్ల ఎన్ని సానుకూలతలు ఉన్నాయో, వాటి వల్ల ప్రమాదావకాశాలు అంతకు మించే ఉన్నాయి.

నియంత్రణకు శాస్త్రవేత్తల సూచనలు
కృత్రిమ వైరస్‌ల వల్ల ప్రపంచానికి ముప్పు తలెత్తకుండా ఉండాలంటే, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, బయో సెక్యూరిటీ నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. అవేమిటంటే, ఏఐతో వైరస్‌లను రూపొందించే సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండటానికి, బయో టెర్రరిజం వ్యాపించకుండా చూడటానికి జీన్‌ డేటాను ప్రాసెస్‌ చేసే ఏఐ నమూనాలకు కఠిన నియమావళిని అమలులోకి తేవాలి. డీఎన్‌ఏ విశ్లేషణలు జరిపే కంపెనీలను ఎవరెవరు ఆర్డర్లు ఇస్తున్నారు, వారు ఎలాంటి జన్యు నమూనాలను ప్రింట్‌ చేయిస్తున్నారు అనే దానిపై కచ్చితమైన తనిఖీలు ఉండాలి.

అన్నింటి కంటే ముఖ్యంగా ప్రాణాంతకమైన వైరస్‌లు, పాథోజెన్‌ల డేటాను ఏఐ నమూనాల నుంచి తొలగించాలి. ఆర్టిఫిషియల్‌ బయో–డిజైనింగ్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ ఒప్పందం దిశగా ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలి. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను వీలైనంత త్వరగా అమలులోకి తేవాలి. ఇకపై ఏఐ ద్వారా సృష్టించే కృత్రిమ వైరస్‌లు, బ్యాక్టీరియాల ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ నమూనాలు స్క్రీనింగ్‌ను తప్పించుకునే అవకాశాలు లేకుండా నిబంధనలను కట్టుదిట్టం చేయాలని బయో సెక్యూరిటీ నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు.

ఇదే అంశమై ఓపెన్‌ ఏఐ అధినేత సామ్‌ ఆల్ట్‌మన్, ఆంథ్రోపిక్‌ అధినేత డేరియో అమోడి, గూగుల్‌ డీప్‌మైండ్‌ అధినేత డెమిస్‌ హసబీస్, మైక్రోసాఫ్ట్‌ ఏఐ అధినేత ముస్తఫా సులేమాన్, మెటా చీఫ్‌ ఏఐ ఆఫీసర్‌ ఆలెగ్జాండర్‌ వాంగ్‌ తదితర ఏఐ నిపుణులు అమెరికా కాంగ్రెస్‌కు ఇటీవల లేఖ రాశారు. ఏఐ సాయంతో కృత్రిమ వైరస్‌ల వంటి వాటి తయారీపై శాస్త్రవేత్తల ఆందోళనలను ప్రభుత్వాలు పట్టించుకుని, సత్వర చర్యలకు నడుం బిగించాలి. ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తే, తర్వాత తలెత్తబోయే అనర్థాలకు ప్రపంచ దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.
- పన్యాల జగన్నాథదాసు

ఇవి కూడా చదవండి: ఏమిటీ టెక్‌ నెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement