దగ్గరైన వాళ్లకు సో స్వీట్.. నిఖితా గాంధీ
‘‘ఏ రంగంలోనైనా మహిళలు ఎక్కువగా విమర్శలకు గురవుతూనే ఉంటారని అయితే వాటిని ఆత్మవిశ్వాసంతోనే ఎదుర్కోవాలని ప్రముఖ బాలీవుడ్ గాయని నిఖితా గాంధీ సూచించారు. ప్రతీ మహిళా తన భధ్రత పట్ల తాను బాధ్యత వహించాలని, అందుకు తగ్టట్టుగా హద్దులు నిర్ణయించుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన రాయల్‌స్టాగ్ బూమ్ బాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
గాత్రంలో నాదైన ప్రత్యేకత ...
ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు, విశ్లేషించలేదు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన గాన శైలి ఉంటుందని అనుకుంటాను. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ పెరిగాను. కమర్షియల్ మ్యూజిక్ ఎక్కువగా వినేదాన్ని కాదు. మా తాతగారి కలెక్షన్ లోని ఆల్బమ్‌లు, పాత రికార్డులు చాలా వినేదాన్ని. చిన్నతనంలో మనపై పడే ఆ ప్రభావాలే మనం సంగీతాన్ని ఎలా అర్థం చేసుకుంటామో, ఎలా అందిస్తామో.. నిర్ణయిస్తాయి.
‘రాబ్తా’ కెరీర్‌లో కీలక మలుపు
ప్రతి పాటకూ తనదైన మైలురాయి ఉంటుంది. కానీ నా కెరీర్‌కు నిజంగా ఊపు తెచ్చింది మాత్రం ‘రాబ్తా’.. నా గాత్రాన్ని బాలీవుడ్‌కు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పరిచయం చేసింది.
కొత్త భాషలో పాడే ముందు?
ఆయా భాషలు మాట్లాడే వ్యక్తులను గమనించడం, వారి ఉచ్చారణ, యాస, భాషలోని రిథమ్‌ను పరిశీలించడం చేస్తాను. ఇది కూడా దాదాపు నటనలాంటిదే. ఒక పాత్రలోకి వెళ్లినట్టుగా ఆ భాషలోకి మనం వెళ్లాలి. నేను పాడిన మొదటి పాట తమిళంలో. అప్పట్లో ఆ భాష నాకు దాదాపు అర్థం కాలేదు. తెలుగులో మూడు, నాలుగు పాటలు పాడాను.
సోషల్ మీడియా...ప్రభావం...
సోషల్ మీడియా ఎంతోమందిని గుర్తించడానికి, వెలుగులోకి తీసుకురావడానికి కచ్చితంగా సహాయపడింది. కానీ అందరికీ అది ఉపయోగపడుతుందని నేను అనుకోను. ప్రతిభతో పాటు తమను తాము ప్రజల ముందుకు తీసుకురావడంలో కూడా నైపుణ్యం ఉన్నవారికి ఇది బాగా సహకరిస్తుంది. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ తగిన గుర్తింపు పొందని వారు ఇంకా చాలామంది ఉన్నారు.
ఏఐ తో సంగీతానికి ముప్పు ఉందా?
ఇది మంచిదో చెడ్డదో నాకు తెలియదు. సంగీతం, మ్యూజిక్ ప్రొడక్షన్ లో ఇప్పటికే ఏఐని చూస్తున్నాం. ఇప్పుడు అది అకస్మాత్తుగా చర్చనీయాంశంగా మారింది అంతే. గతంలో ప్రతిదీ లైవ్‌గా, టేప్‌పై రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడు స్టూడియోలో ప్రతిదీ డిజిటల్‌గా చేస్తున్నాం. ఇప్పుడు చేయాల్సిన ఉత్తమమైన పని ఏమిటంటే పరిస్థితికి అనుగుణంగా మారుతూ ముందుకు సాగడం.
గాయనీ గాయకుల ‘నేపధ్యం’లోనే ఉండిపోవడంపై...
ఇది ఒక ఆసక్తికరమైన పరిస్థితి. నేపధ్యగాయకులుగా ఒకవైపు ఫేమస్, మరోవైపు ఫేమస్ కానట్టే. అయితే చాలామంది గాయకులు దీనితో పూర్తిగా సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే వారు తమ గుర్తింపు కోసం లేదా ప్రముఖంగా కనిపించడం కోసం ప్రయత్నించరు. నేను మాత్రం ఈ విషయంలో మధ్యలో ఉన్నాననుకుంటున్నా. ఎందుకంటే నేను విజువల్ ప్రెజెన్స్ ఉన్న పెర్ఫార్మర్‌ను. అందుకే నన్ను నేను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తాను. సాంగ్‌రైటర్‌గా సొంత ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను విడుదల చేయడం దానికో మంచి మార్గం. అప్పుడు కేవలం గాయనిగా కాకుండా ఒక ఆర్టిస్ట్‌గా నేను ఎవరో ప్రేక్షకులకు చూపించగలను.
గర్విష్టి అనే పేరు రావడం వెనుక?
నేను చాలా గర్విష్ఠిగా, కఠినంగా ఉంటానని చాలామంది అనుకుంటారు. కానీ నన్ను కలిసిన తర్వాత ‘ఓహ్.. మీరు చాలా స్వీట్‌గా!’ అని అంటారు. చాలా మంది మహిళల విషయంలో ఇదొక అపోహ . ఎవరైనా ఇండస్ట్రీలోని మరో మహిళను ‘ఆమె చాలా కఠిన వ్యక్తి’ అని పిలిస్తే నేను ఆమెకు మద్దతుగా నిలుస్తాను. సాధారణంగా మహిళలే ఎక్కువగా విమర్శలకు గురవుతారు. చాలా సందర్భాల్లో వారు కేవలం ప్రొఫెషనల్‌గా ఉంటూ తమ పనిని సీరియస్‌గా తీసుకుంటుంటారు. మహిళగా మనం భద్రత కోసం కొన్ని హద్దులు ఏర్పరచుకోవాలి, శారీరక స్పర్శను కూడా నియంత్రించుకోవాలి. కానీ వాటిని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. దానికి మనం చేయగలిగిందేమీ లేదు.
ఔత్సాహిక యువతులకు సలహా...
సోషల్ మీడియా నిస్సందేహంగా గొప్ప వేదిక. అవకాశాల కేంద్రంగా ఉన్న ముంబై లాంటి నగరాలకు చాలా దూరంగా ఒక చిన్న పట్టణంలో కూర్చొని కూడా మన ప్రతిభను లోకానికి చూపించవచ్చు. చాలామంది ఆర్టిస్టులు తమ ఇళ్లలోనే ఉంటూ వైరల్ అయ్యారు, అక్కడి నుంచే గుర్తింపు పొందారు. అయితే సుదీర్ఘకాలిక కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
తీరాల్సిన కల?
ప్లేబ్యాక్ సింగర్‌గా నాకు ఉన్న గుర్తింపు, ఆదరణ, ఫాలోయింగ్‌ను ఒక పాప్‌స్టార్‌గా, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా కూడా పొందాలన్నదే నా కల.
–సత్యబాబు


