సాక్షి, కొడంగల్: కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘SIR’ పేరుతో కేంద్రం ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలనే ముఖ్యంగా టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కొడంగల్ నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొడంగల్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు ఈ గుర్తింపు, గౌరవం వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారు. తెలంగాణలోనూ అలాగే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో దొంగ దెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరు. ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను బీజేపీ టార్గెట్ చేసింది. ఇంతకుముందు ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి బీజేపీ పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ కుట్రకు బీఆర్‌ఎస్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉంది. గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలి. ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులదే. నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత వహించాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలి’ అని అన్నారు.
ఇదీ చదవండి: ‘ఓరుగల్లు రాజకీయంలో ఆట మొదలైంది’
మరోవైపు.. కొడంగల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ సలహదారు కేశవరావు సహా పలువురు నేతలు ఉన్నారు.


