ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది! | Political Heat Rising in Warangal Congress | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది!

Sep 5 2026 11:04 AM | Updated on Sep 5 2026 11:12 AM

Political Heat Rising in Warangal Congress

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్‌ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. 

కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్‌ తూర్పుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్‌ గుండు సుధారాణిలు పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్‌ నేతల కదలికలపై చర్చ మొదలైంది.

కాంగ్రెస్‌లోనే.. సురేఖ స్పష్టత.. 
పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య  సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్‌లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

చదవండి: మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌?

పెరుగుతున్న వ్యతిరేక స్వరం
వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి.  మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్‌ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్‌ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని బసవరాజు సారయ్య సురేఖకు సవాల్‌ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్‌లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

‘కొండా’ అనుచర వర్గంలో మౌనం
తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. 

భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్‌లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దష్టికి తీసుకెళ్లడమా? వరంగల్‌ తూర్పులో తన కేడర్‌ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement