భారతదేశంలో కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఉత్పత్తులలో విరివిగా ఉపయోగించే 'టూటీ ఫ్రూటీ' (Tutti Frutti) తయారీ విధానానికి సంబంధించిన ఒక వీడియో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీని తయారీలో పాటిస్తున్న శుభ్రతా ప్రమాణాలు, కాలుష్య పూరిత వాతావరణం చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'పాయల్ కుష్వాహా' అనే నెటిజన్ ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఎంతో శుభ్రమైన పద్ధతిలో టూటీ ఫ్రూటీని తయారు చేస్తున్న వీడియో ఇది అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది చూశాక చాలా మందికి టూటీ ఫ్రూటీ ఇష్టమైనదిగా మారిపోతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. మురికి నీళ్లలో, ఎలాంటి రక్షణ పద్దతులను పాటించకుండా, ఒంటిపై ఒక నిక్కరు మాత్రమే వేసుకుని కార్మికులు పనిచేయడం, ఇతర ప్రక్రియకు సంబంధించి, ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
కేక్‌లు, డెజర్ట్‌లలో టూటీ ఫ్రూటీని చూడగానే తమ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తయారీ వాతావరణం, అపరిశుభ్రతను చూసి తీవ్ర అసహ్యానికి గురయ్యారు. ఇకపై తినడానికి ఇది భయపడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Guys, Aap sabhi ke liye bahut hi hygienic tarike se tuti furti banai ja rahi hai, video dekhne ke baad kafi logo ka fruti favourite ban jayega pic.twitter.com/rvCsvE8GiW
— Payal Kushwaha (@payalpixel) September 3, 2026
కాటన్ క్యాండీ, ఐస్ గోలా, స్ట్రీట్ ఫుడ్స్ తయారీ వీడియోలు గతంలో చాలానే వైరల్ అయ్యాయి. తాజా వీడియో కూడా ఆహార భద్రతా ప్రమాణాలు (Food safety standards), అసంఘటిత చిన్న తరహా పరిశ్రమలలో పరిశుభ్రత లోపాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు ఈ వైరల్ వీడియో ప్రామాణికత, ఎక్కడిది లాంటి వివరాలపై స్పష్టతలేనప్పటికీ, లేదా అందులో చూపించిన ఫ్యాక్టరీ వాతావరణంపై ఇప్పటివరకు ఏ ప్రముఖ టూటీ ఫ్రూటీ తయారీ సంస్థ గానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు గానీ అధికారికంగా స్పందించలేదు.


