ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1 ఆర్థిక సంవత్సరం 2027)కి సంబంధించి కేంద్రం ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాలపై కొందరు విశ్లేషకులు లేవనెత్తిన సందేహాలకు ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ జవాబిచ్చారు. దేశ జీడీపైపై వస్తున్న విమర్శలకు ఆయన గణాంకాల ఆధారంగానే కళ్లెం వేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న నాగేశ్వరన్ ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.
గత ఏడాది (FY26) క్యూ1 జీడీపీని(పాత పద్ధతిలో 2011-12 బేస్ ఇయర్ ప్రకారం) కొందరు రూ.86 లక్షల కోట్లుగా లెక్కించారు. ఈ ఏడాది (FY27) క్యూ1 జీడీపీని(కొత్త పద్ధతిలో 2022-23 బేస్ ఇయర్ ప్రకారం) రూ.88 లక్షల కోట్లుగా లెక్కించారు. కొందరు విమర్శకులు ఏం చేశారంటే, ఈ రెండు అంకెలనూ నేరుగా పోల్చి 86 నుంచి 88కి పెరిగింది కాబట్టి వృద్ధి రేటు కేవలం 2-2.3 శాతమే అని లెక్క కట్టారు.
సీఈఏ అభ్యంతరం ఏమిటి?
గత ఏడాది క్యూ1 అంకెను కొత్త పద్ధతిలో మళ్లీ లెక్కించాలి (అంటే, పాత సిరీస్ కొనసాగి ఉంటే ఈ కొత్త మెథడాలజీ ప్రకారం ఎంత వచ్చేదో చూడాలి). ఆయన అంచనా ప్రకారం, ఆ అంకె రూ.86 లక్షల కోట్ల కంటే ఎక్కువగా, రూ.90 లక్షల కోట్లకు దగ్గరగా ఉండేది. ఆ సవరించిన అంకెతో ఈ ఏడాది రూ.88 లక్షల కోట్లను పోలిస్తేనే అసలైన, న్యాయమైన వృద్ధి రేటు తెలుస్తుందని చెప్పారు. అంతేగానీ, రెండు వేర్వేరు కొలమానాల అంకెలను నేరుగా పోల్చడం సరికాదన్నారు.
గత ఏడాది జీడీపీ అంకెల్లో సవరణకు ప్రధాన కారణం డబుల్ డిఫ్లేటర్ పద్ధతి మాత్రమే కాదని, మెరుగైన కార్యనిర్వహణ, అసంఘటిత రంగం మెరుగైన కవరేజీ వంటి అనేక అంశాలు కారణమని వివరించారు. కొత్త పద్ధతిలో ఎఫ్‌వై26 అంకెలు పెరగకపోవడం, గతంలో తాము ఆర్థిక వ్యవస్థను సక్రమంగా కవర్ చేశామనడానికి నిదర్శనమని చెప్పారు. జీడీపీని లెక్కించేటప్పుడు, నామినల్ జీడీపీ (ధరల పెరుగుదలతో సహా) నుంచి రియల్ జీడీపీ (ధరల ప్రభావం తీసేసి అసలైన ఉత్పత్తి వృద్ధి)కు మారాలంటే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసేయాలి. దీనికి వాడే సాధనాన్నే డిఫ్లేటర్ అంటారు.
డబుల్ డిఫ్లేటర్ పద్ధతి కేవలం అంతర్జాతీయ సంస్థల సూచన వల్లే అనుసరిస్తున్నామన్న వాదనను తోసిపుచ్చారు. ఇది గణాంక నిపుణుల విస్తృత సమాలోచనల ఫలితమని, ఇన్‌పుట్-అవుట్‌పుట్ ధరలు వేర్వేరు కారకాల ప్రభావంతో మారతాయి కాబట్టి ఇదే శాస్త్రీయ పద్ధతని తెలిపారు. 7.8 శాతం వృద్ధి రేటు గాలిలోంచి ఊడిపడలేదని, జీఎస్టీ వసూళ్లు, ఈ-వే బిల్ జారీ, వాహన విక్రయాలు, ఎగుమతుల వృద్ధి, బ్యాంకు రుణ వృద్ధి వంటి నెలవారీ సూచికలన్నీ ముందు నుంచే బలమైన వృద్ధిని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ డేటా అంతా ఆర్‌బీఐ, కస్టమ్స్, ప్రభుత్వ ఖజానా వంటి విశ్వసనీయ మూలాల నుంచి వచ్చిందని పేర్కొన్నారు.
ఉద్యోగ కల్పనపై స్పందిస్తూ కొవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పన సవాలుగా మారిందని, అయితే సాంకేతిక మార్పులు, సామాజిక-ఆర్థిక అంశాలు, స్వచ్ఛంద నిరుద్యోగం వంటి అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయన్నారు. భారత ఉద్యోగ వృద్ధి ధోరణులు ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: డిజిటల్ విప్లవంలో జియో పదేళ్ల ప్రస్థానం!


