ఇన్వెస్టర్లకు.. న్యూక్లియర్‌ ‘పవర్‌’ | Sakshi special story on nuclear economy | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు.. న్యూక్లియర్‌ ‘పవర్‌’

Aug 31 2026 4:10 AM | Updated on Aug 31 2026 4:10 AM

Sakshi special story on nuclear economy

వచ్చే 20 ఏళ్లలో 100 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యం

ప్రస్తుతం దేశంలో అణు విద్యుదుత్పత్తి 8–9 గిగావాట్లే

లక్ష్యాన్ని సాధించాలంటే ఏకంగా 10–11 రెట్లు పెరగాలి

దీన్ని సాధించే క్రమంలో పలు కంపెనీలకు భారీ అవకాశాలు

సౌర, పవన విద్యుత్తులా కాకుండా ప్రత్యేక కంపెనీలకే చోటు

అణు విద్యుత్తు రంగాన కంపెనీలు... పోటీ కూడా తక్కువే

వాచ్‌లిస్టులో పెట్టుకోవటానికి డజనుకు పైగా లిస్టెడ్‌ కంపెనీలు

దీర్ఘకాల వ్యూహంతో ఇన్వెస్ట్‌ చేస్తే రివార్డు కూడా ఎక్కువే

‘న్యూక్లియర్‌ ఎకానమీ’పై సాక్షి వెల్త్‌ ప్రత్యేక కథనం 

సోలార్‌ విప్లవాన్ని చూశాం. డిఫెన్స్‌ తయారీ విస్ఫోటాన్నీ చూశాం. అవి సృష్టించిన విజేతలనూ చూశాం. ఎన్నో అవకాశాలు... ఎన్నెన్నో కంపెనీలు. కొత్తవి వచ్చాయి. పాతవీ ఎదిగాయి. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ‘వారీ రెన్యూవబుల్స్, వారీ ఎనర్జీ, కేపీఐ ఎనర్జీ, జీఈ వెర్నోవా, హిటాచీ ఎనర్జీ లాంటివి కళ్లు చెదిరే లాభాలనిచ్చాయి. దేశ సోలార్‌ ఎనర్జీ సామర్థ్యం ఏకంగా 150 గిగావాట్లకు చేరింది. కాకపోతే ఇది స్థాపిత సామర్థ్యం. దీని ద్వారా నికరంగా ఉత్పత్తయ్యేది 20 నుంచి 22 శాతం మాత్రమే. 30 నుంచి 33 గిగావాట్లు. డిఫెన్స్‌ కంపెనీలైతే చెప్పనక్కర్లేదు. రక్షణ రంగానికి చిన్న చిన్న పరికరాలు తయారు చేసే స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు సైతం ఏకంగా లార్జ్‌క్యాప్‌ స్థాయికి చేరాయి. ప్రభుత్వ రంగంతో సహా పలు కంపెనీలు మల్టీ బ్యాగర్‌ రాబడులనిచ్చాయి.  

ఇపుడు అణు విద్యుత్తు విషయానికొద్దాం. ప్రస్తుతం ఉత్పత్తవుతున్నది 8–9 గిగావాట్లు. కానీ వచ్చే 20 ఏళ్లలో 100 గిగావాట్లకు చేర్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. సౌర, పవన విద్యుత్తుల మాదిరి కాకుండా ఈ ప్లాంట్లు 85–90% సామర్థ్యంతో నడుస్తాయి. కాబట్టి 100 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే 85–90 గిగావాట్ల నికర విద్యుత్తూ ఉత్పత్తవుతుంది. అంటే సోలార్‌కన్నా 3 రెట్లు ఎక్కువ. 

కాకపోతే ప్రస్తుత సామర్థ్యాన్ని ఏకంగా 10 రెట్లు పెంచాలి. మరి దానికెంత యురేనియం కావాలి? ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని కేంద్రాలు నిర్మించే సత్తా మనకుందా? ఎలాంటి పరికరాలు కావాలి? వాటిని తయారు చేసేదెవరు? ప్లాంట్లు నిర్మించేదెవరు? వీటిలో లాభపడే కంపెనీలేంటి? రాబోయే అవకాశాలేంటి? సోలార్‌కు 3 రెట్లుండే ఈ ‘న్యూక్లియర్‌ ఎకానమీ’లో భవిష్యత్తు విజేతలెవరు? ఇన్వెస్టర్లు దీన్నెలా తీసుకోవాలి? ఇదే ఈ ‘సాక్షి వెల్త్‌’ ప్రత్యేక కథనం..

- రమణమూర్తి మంథా 

అణు విద్యుత్తును థర్మల్‌లానే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయటం సాధ్యమేనా? అంటే... అవుననే చెప్పాలి. ఎందుకంటే ఒక గిగావాట్‌ విద్యుత్‌కు ఏడాదికి 160–200 టన్నుల యురేనియం ఉంటే చాలు. శుద్ధిచేశాక వచ్చే 25–30 టన్నుల యురేనియం ఇంధనాన్ని అణు రియాక్టర్లలో నేరుగా వాడొచ్చు. అదే థర్మల్‌ విద్యుత్తుకైతే ఒక గిగావాట్‌కు ఏకంగా 3–4 మిలియన్‌ టన్నుల బొగ్గు కావాలి. అంటే 20వేల కిలోల బొగ్గు చేసే పనిని.. ఒక కిలో యురేనియం చేస్తుంది. కాబట్టి థర్మల్‌ మాదిరి నిరంతరం ప్లాంట్లకు గూడ్సు రైళ్లు తిరగక్కర్లేదు. ఏడాది, రెండేళ్లకోసారి ఇంధనాన్ని రవాణా చేస్తే  చాలు. ఇక ప్రభుత్వం లకి‡్ష్యంచిన 100 గిగావాట్లకైతే ఏడాదికి 17,000 టన్నులు కావాలి. మరి అంత యురేనియం నిల్వలు మన దగ్గరున్నాయా? ఇదే అసలైన సవాలు. 

దేశంలో ప్రస్తుతం ఏటా 600–800 టన్నుల యురేనియం ఉత్పత్తవుతోంది. అంటే 100 గిగావాట్లకు కావాల్సిన దాంట్లో 4–5 శాతం. ఏపీలోని తుమ్మలపల్లె (కడప), తెలంగాణలోని లంబాపూర్‌–పెద్దగట్టు, జార్ఖండ్‌లోని జాదుగూడ, మేఘాలయ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో యురేనియం నిల్వలున్నా... చాలావరకూ లో గ్రేడ్‌. ఇవి దాదాపు 4 లక్షల టన్నులుండొచ్చని అంచనా. 

కాకుంటే ఎక్కువశాతం లోగ్రేడ్‌. కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలతో పోలిస్తే మనకు వెలికి తీయటానికయ్యే ఖర్చు ఎక్కువ. కాబట్టి ప్రస్తుతం అణు విద్యుదుత్పత్తికి కజకిస్తాన్, కెనడా, ఉజ్బెకిస్తాన్, రష్యా, నమీబియా, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటున్నాం. కాకపోతే కొన్ని సంవత్సరాలకు సరిపడా యురేనియాన్ని ఒకేసారి నిల్వ చేసుకోవచ్చు కనక దిగుమతులకు పెద్ద సమస్యేమీ లేదు. విశేషమేంటంటే దేశంలోని యురేనియం నిల్వల్లో 4వ వంతు... అంటే లక్ష టన్నులకు పైగా ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లె పరిశరాల్లోనే ఉన్నట్లు అంచనా. 

థోరియంపైనే ఆశలన్నీ...  
దేశంలో హైగ్రేడ్‌ యురేనియం నిల్వలు తక్కువ. కాకపోతే కావాల్సినంత యురేనియాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి అనుమతులున్నాయి. కానీ భారత అణుశక్తి విభాగం మాత్రం యురేనియం విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో ఉంది. అందుకే... ప్రపంచంలోకెల్లా ఇక్కడే అత్యధికంగా ఉన్న థోరియం నిల్వల్ని ఇందుకు ఉపయోగించుకోవాలనే యోచనలో ఉంది. మొనజైట్‌ అత్యధికంగా ఉండే కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిషాలోని బీచ్‌ శాండ్స్‌లో థోరియం నిల్వలు భారీగా ఉన్నాయి. దేశంలో అంచనా వేసిన నిల్వలు 10 లక్షల టన్నులకు పైనే.

కానీ రియాక్టర్లలో ఇంధనంగా నేరుగా థోరియం పనిచెయ్యదు. దాన్ని యురేనియంగా మార్చాలి. దశాబ్దాల కిందట హోమీ జహంగీర్‌ బాబా నేతృత్వంలోనే దీనికి సంబంధించిన మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశారు. సహజ యురేనియాన్ని ఇంధనంగా వాడి  భారజల రియాక్టర్ల ద్వారా విద్యుత్తును, ప్లుటోనియాన్ని ఉత్పత్తి చేయటం తొలిదశ. రెండోదశలో ఫాస్ట్‌బ్రీడర్‌ రియాక్టర్లలో థోరియంను ఇంధనంగా వాడి యురేనియం–233ని ఉత్పత్తి చేయటం... మూడోదశలో థోరియం రియాక్టర్లలో యురేనియం–233ని వాడి విద్యుదుత్పత్తి చేయటం.

నిజానికి ఇప్పటికీ మనదేశం మూడోదశకు చేరలేదు. తొలిదశ నుంచి రెండోదశకు వెళుతున్న పరిస్థితుల్లోనే ఉంది. థోరియం నుంచి యురేనియం –233 ఉత్పత్తికి కల్పక్కం ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌ పనిచేస్తోంది కూడా. మూడోదశకు మరికొంత సమయం పట్టినా... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే సరిపడినన్ని యురేనియం నిల్వలున్నాయి కనక, దిగుమతి చేసుకోవటానికి మనకు ఇబ్బందుల్లేవు కనక 100 గిగావాట్ల లక్ష్యానికి ఇబ్బందులు లేవన్నది నిపుణుల మాట.  

100 గిగావాట్లకు కావాల్సిందేంటి? 
రియాక్టర్లే కాదు. మొత్తం న్యూక్లియర్‌ వ్యవస్థ ఎదగాలి. లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి. న్యూక్లియర్‌ గ్రేడ్‌ ఫోర్జింగ్, కంట్రోల్‌ వ్యవస్థలు, అత్యంత దృఢమైన పంప్‌లు, వాల్‌్వలు, ప్రత్యేక లోహాలు, ప్రెసిషన్‌ మాన్యుఫాక్చరింగ్, ట్రాన్స్‌మిషన్‌ ఇన్‌ఫ్రా, ఇంధన ప్రాసెసింగ్, వేస్ట్‌ మేనేజిమెంట్‌ ఇలా పలు రకాల వ్యవస్థలు కావాలి. రియాక్టర్లనేవి ఒక కోణమే. విస్తరించే క్రమంలో డజన్ల కొద్దీ ప్రత్యేక పరిశ్రమలు కావాలి. నిజానికి దేశంలో తమ పేర్లలోనే సౌర, పవన విద్యుత్తును తగిలించుకున్న కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ‘అణు’ విద్యుత్తు పేరిట ప్రభుత్వ కార్పొరేషన్లు తప్ప ఒక్క లిస్టెడ్‌ కంపెనీ కూడా లేదు. కాకపోతే దీనికి కావాల్సిన కీలక పరికరాలు తయారుచేసే కంపెనీలు చాలావరకూ వచ్చే రెండు దశాబ్దాల్లో లబ్ధి పొందనున్నాయి. వాటిని ఇన్వెస్టర్లు రకరకాలుగా వర్గీకరించుకోవచ్చు...

హెవీ ఫోర్జింగ్స్, అణు పరికరాలు
ఎక్కువ లబ్ధి పొందేది ఈ రంగమే. ఎందుకంటే రియాక్టర్లకు వందల కొద్దీ టన్నుల... లెక్కలేనన్ని ఫోర్జింగ్‌ చేసిన పరికరాలు కావాలి. దీన్లో అగ్రగామి ఎల్‌ అండ్‌ టీయే. ఎందుకంటే రియాక్టర్ల నిర్మాణం, హెవీ ఫోర్జింగ్స్, స్టీమ్‌ జనరేటర్లు, రియాక్టర్‌ కూలింగ్‌ వ్యవస్థలు, న్యూక్లియర్‌ పైపులతో సహా మొత్తం ఈపీసీని పూర్తిచేసే సామర్థ్యం దేశంలో ఈ కంపెనీ ఒక్కదానికే ఉంది.  

వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ 
పురాతన అణు ఇంజినీరింగ్‌ కంపెనీగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే రియాక్టర్‌ పరికరాలు, కాలండ్రియా భాగాలు, ఎండ్‌ షీల్డ్‌లు, హెవీ ఫోర్జింగ్‌లు దీని ప్రత్యేకత. ఈ రంగంలోకి రావటానికి రకరకాల అర్హతలుండాలి కనక కొత్త కంపెనీలు రావటం అంత తేలికకాదు. కాకపోతే ఈ కంపెనీ సైజు చిన్నది. పని పూర్తి చేయటంలో రిస్కు ఎక్కువ. విజయవంతంగా పూర్తయితే రివార్డూ ఎక్కువే.  

బీహెచ్‌ఈఎల్‌ 
ఎక్కువమంది ఈ కంపెనీ కేవలం టర్బయిన్లే తయారు చేస్తుందనుకుంటారు. కానీ ఇది స్టీమ్‌ జనరేటర్లు, హీట్‌ ఎక్సే్ఛంజీలు, అణు పరికరాలు, భారీ ఫ్యాబ్రికేటెడ్‌ పరికరాలు సరఫరా చేస్తుంది. కాబట్టి అణు విద్యుత్తు లక్ష్యంలో దీని వాటా ఎక్కువే ఉంటుంది.  

ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ 
రియాక్టర్లలోని పరికరాలు తయారు చేసే కంపెనీల విషయానికొస్తే ఎంటార్‌ టెక్నాలజీస్‌ను ప్రధాన లబి్ధదారుగా చూడొచ్చు. ఫ్యూయల్‌ హ్యాండ్లింగ్‌ వ్యవస్థలు, రియాక్టర్‌ అసెంబ్లీలు, ప్రెసిషన్‌ మెషిన్‌ భాగాలు, ఏరోస్పేస్‌ పరికరాలు, ఇస్రో పరికరాలు తయారు చేసే ఈ తరహా కంపెనీలు తక్కువే. ఇందులోకి ప్రవేశించటం అంత తేలికకాదు

కనక పోటీ కూడా తక్కువే.  
పీటీసీ ఇండస్ట్రీస్‌: ప్రత్యేకంగా వాచ్‌ చేయాల్సిన కంపెనీ ఇది. హైస్పీడ్‌ సూపర్‌ అల్లాయ్‌ కాస్టింగ్‌లు తయారు చేసే ఈ కంపెనీ ఏరోస్పేస్, డిఫెన్స్, అణు రంగాలకు వీటిని సరఫరా చేస్తోంది. అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరిగితే అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునే అల్లాయ్‌ కాస్టింగ్‌లు ఎక్కువ కావాలి. అప్పుడు పీటీసీ బాగా లబ్ధి పొందే అవకాశముంది.  

పంప్‌లు, వాల్‌్వలు 
ప్రతి అణు విద్యుత్తు కర్మాగారానికీ వేలకొద్దీ వాల్‌్వలు కావాలి. అలాగని అవేమీ సాధారణ వాల్వ్‌లు కాదు. రేడియేషన్‌ను, అత్యధిక ఒత్తిడిని, అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకుని దశాబ్దాల పాటు రాణించాలి. దీనికి సంబంధించిన లిస్టెడ్‌ కంపెనీల్ని చూస్తే కేఎస్‌బీ లిమిటెడ్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రైమరీ కూలెంట్‌ పంప్‌లు, న్యూక్లియర్‌ గ్రేడ్‌ పంప్‌లు సరఫరా చేసిన చరిత్ర దీని సొంతం. ఆ తరువాతి స్థానంలో డబ్ల్యూపీఐఎల్, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ కంపెనీలను వాచ్‌ లిస్టులో పెట్టుకోవచ్చు.

స్పెషల్‌ అల్లాయ్స్‌ 
అణు విద్యుత్తు కర్మాగారాలకు భారీ ఎత్తున ప్రత్యేక లోహాలు కావాలి. దీనికి సంబంధించి దేశంలో పోటీ లేని అగ్రశ్రేణి సంస్థ ‘మిశ్రా ధాతు నిగమ్‌ – మిధానీ’యే అని చెప్పొచ్చు, ప్రభుత్వ రంగంలోని ఈ సంస్థ ప్రత్యేక లోహాలతో పాటు టైటానియం లోహాలు, నికెల్‌ అల్లాయ్స్, స్పెషల్‌ స్టీల్స్‌ తయారు చేస్తుంది. అంతేకాదు. ఇస్రో, డీఆర్‌డీఓ, న్యూక్లియర్‌ రంగాలకు సరఫరా కూడా చేస్తోంది. ఆ తరువాతి స్థానంలో ఆధునిక లోహాలు తయారు చేసే కంపెనీగా పీటీసీ ఇండస్ట్రీస్‌ను కూడా వాచ్‌లిస్టులో పెట్టుకోవచ్చు.  

నిర్మాణం – ఈపీసీ 
అణు విద్యుత్తు కర్మాగారాలకు అయ్యే ఖర్చులో సివిల్‌ నిర్మాణాలకే ఎక్కువవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎల్‌ అండ్‌ టీ, హిందుస్థాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ వంటివి ప్రధాన లబ్ధిదారులుగా నిలిచే అవకాశముంది. హెచ్‌సీసీకి దీర్ఘకాల చరిత్ర ఉండగా... కైగా అణు విద్యుత్‌ కర్మాగారంలో టర్బైన్‌ ఐలాండ్‌ పనుల్ని పూర్తిచేసిన చరిత్ర పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌’కు ఉంది. దీని న్యూక్లియర్‌ పోర్టుఫోలియో పెరుగుతోంది కూడా.

ఇన్‌స్ట్రమెంటేషన్‌ 
సేన్సర్స్, ఆటోమేషన్, సేఫ్టీ వ్యవస్థలు, కంట్రోల్‌ ప్యానెల్‌ వంటివి కావాల్సిన ఈ రంగంలో టాటా గ్రూప్‌నకు చెందిన హనీవెల్‌ ఆటోమేషన్‌ ఇండియాను లీడర్‌గా చెప్పొచ్చు. కాకపోతే సీమెన్స్‌ ఇండియా, ఏబీబీ ఇండియా వంటివి దీనికి పోటీదారులుగా నిలుస్తాయి.  

ట్రాన్స్‌మిషన్‌
అణు విద్యుత్తు ప్లాంట్లలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే తలెత్తే నష్టాన్ని అంచనా వేయలేం. కాబట్టి అలాంటి సమయాల్లో జనాన్ని తరలించడానికి, ప్రమాదాన్ని నిలువరించడానికి భారీ ఎత్తున ఎవాక్యుయేషన్‌ వ్యవస్థలుండాలి. హిటాచీ ఎనర్జీ ఇండియా, జీఈ వెర్నోవా టీ అండ్‌ డీ ఇండియా, కేఈసీ ఇంటర్నేషనల్, కల్పతరు ప్రాజెక్ట్స్‌’ ఇంటర్నేషనల్‌ వంటివి ఈ రంగంలో దిగ్గజాలు.

ఫ్యూయల్‌ సైకిల్‌...
ఇది చాలా క్లిష్టమైన రంగం. కాబట్టి ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ), భారజల బోర్డు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనివే. అన్‌లిస్టెడ్‌ సంస్థలే.  మొత్తంగా చూస్తే అణు విద్యుత్తు లక్ష్యం సాకారమవుతున్న కొద్దీ భారీ ఆర్డర్‌ బుక్స్‌తో ఎదిగే కంపెనీల జాబితా ఎక్కువే కనిపిస్తోంది. కాకపోతే దీనికి పట్టే సమయం ఎక్కువ. రివార్డు కూడా ఎక్కువే ఉంటుంది కనక... దీర్ఘకాలం దృష్టితో ఇన్వెస్టర్లు న్యూక్లియర్‌ ఎకానమీ కంపెనీలకు పోర్టుఫోలియోలో చోటివ్వవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement