వెండికి ఫుల్ డిమాండ్.. అసలు కారణాలు ఇవే! | Silver Price Gains Should Investors Buy Hold or Sell Know The Details | Sakshi
Sakshi News home page

Silver Price: వెండికి ఫుల్ డిమాండ్.. అసలు కారణాలు ఇవే!

Aug 30 2026 1:09 AM | Updated on Aug 30 2026 1:20 AM

Silver Price Gains Should Investors Buy Hold or Sell Know The Details

బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్స్‌కు 69.71 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 26న ప్రారంభ ట్రేడింగ్‌లో ఈ స్థాయిని తాకింది. 2026 జూన్ 16 తర్వాత వెండి ధర ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో.. దేశీయ మార్కెట్‌లో కూడా వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. MCXలో సెప్టెంబర్ కాంట్రాక్ట్ వెండి ధర ఆగస్టు 25న 0.08 శాతం పెరిగి కిలోకు రూ.2,44,328కు చేరింది. ఈ నెలలో ఇప్పటివరకు వెండి ధర దాదాపు 20 శాతం పెరగడం గమనార్హం.

వెండి ధర ఎందుకు పెరుగుతోంది?
వెండి ధర పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, బంగారం ధరలు పెరగడం వంటి అంశాలు వెండికి మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రుణాలు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కూడా సిల్వర్ రేటు పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది. దీంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు చూస్తున్నారు.

బంగారం ధరల ప్రభావం
వెండి ధరల పెరుగుదలలో బంగారం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. బంగారం ధరలు పెరిగినప్పుడు చాలాసార్లు వెండిపై కూడా పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం బంగారం కూడా బలంగా ఉండటంతో వెండికి కూడా డిమాండ్ పెరిగింది. అందుకే వెండి ధరలు వేగంగా పైకి కదులుతున్నాయి.

పారిశ్రామిక డిమాండ్
బంగారంతో పోలిస్తే వెండికి మరో ప్రత్యేకత ఉంది. వెండిని కేవలం ఆభరణాలు, పెట్టుబడుల కోసమే కాకుండా అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర టెక్నాలజీ రంగాల్లో వెండిని ఉపయోగిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వెండికి పారిశ్రామిక డిమాండ్ కూడా పెరుగుతోంది.

డిమాండుకు సరిపడా వెండి అందుబాటులో లేనప్పుడు ధరలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వెండిలో పెట్టుబడి పెట్టినవారు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎందుకంటే.. ఒక్క నెలలోనే వెండి ధర దాదాపు 20 శాతం పెరిగింది. ఇలాంటి సమయంలో ధరలు మరింత పెరుగుతాయని భావించి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. కొత్తగా పెట్టుబడి పెట్టేవారు మొత్తం డబ్బును ఒకేసారి పెట్టకుండా.. కొంత కొంతగా పెట్టుబడి పెట్టడం లేదా ధరలు కొద్దిగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

భారతదేశంలో వెండి రేటు
భారతదేశంలో కూడా వెండి రేటు పెరుగుదల దిశగా పరుగులు పెడుతున్నాయి. దీంతో హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్ద, ఢిల్లీలో రూ.2.55 లక్షల వద్ద ఉంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే వెండి రేటు రూ.3 లక్షలకు చేరుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement