న్యూఢిల్లీ: కష్టాల ఊబిలోంచి కరిగిపోని సంకల్పం పుట్టుకొస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపించింది 19 ఏళ్ల సైనా సమీర్ ఖాన్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) విడుదల చేసిన సీఎస్ ప్రొఫెషనల్ జూన్ 2026 పరీక్షా ఫలితాల్లో ఆమె జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. రాజస్థాన్‌కు చెందిన ఖుషి అగర్వాల్‌తో కలిసి సైనా సంయుక్తంగా ఈ అగ్రస్థానాన్ని పంచుకుంది. తీవ్రమైన అనారోగ్యంతో గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కుతున్న సమయంలోనూ మనోధైర్యాన్ని వీడకుండా పరీక్షలు రాసి, 700 మార్కులకు గాను 432 మార్కులు సాధించి విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలిచింది.
దర్జీ కూతురి అసాధారణ ప్రస్థానం
సైనా కుటుంబ మూలాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినవైనప్పటికీ, వారి కుటుంబం కొన్నేళ్లుగా ముంబైలోనే స్థిరపడింది. ఆమె తండ్రి వృత్తిరీత్యా దర్జీ (టైలర్) కాగా, తల్లి గృహిణి. నలుగురు సోదరీమణులలో సైనా రెండో సంతానం. పాఠశాల విద్యను శ్రీ కల్గీధర్ మిషన్ హైస్కూల్‌లో పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం శ్రీ చినాయ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకాం ఆనర్స్ చదువుతోంది. మధ్యతరగతి కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులను చూసిన ఆమె ఉన్నత లక్ష్యాలకు ఎన్నడూ విడిచిపెట్టలేదు.
సీఎస్ ప్రయాణంలో..
సైనా 12వ తరగతి పూర్తి చేసిన సమయానికి కూడా కంపెనీ సెక్రటరీ (CS) కోర్సు చేయాలనే ఆలోచన ఏదీ లేదు. అయితే ఆమె సోదరి ఇచ్చిన సలహాతో ఈ వృత్తిపరమైన కోర్సుపై పూర్తిస్థాయిలో పరిశోధన చేసింది. కంపెనీల పాలన, చట్టపరమైన బాధ్యతల్లో ఈ కోర్సు ప్రాధాన్యతను అర్థం చేసుకున్న సైనా, వెంటనే ప్రవేశ పరీక్షకు సిద్ధమై తన లక్ష్య సాధనకు గట్టి పునాది వేసింది.
టార్గెట్ బేస్డ్ స్టడీ
సీఎస్ ప్రొఫెషనల్ సిలబస్ చాలా విస్తృతమైనది కావడంతో సైనా ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని ఎంచుకుంది. రోజుకు ఇన్ని గంటలు చదవాలని లెక్కలు వేసుకోకుండా, ప్రతిరోజూ నిర్దిష్టంగా రెండు లేదా మూడు అధ్యాయాలు (చాప్టర్లు) పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ టార్గెట్ పూర్తయ్యే వరకు ఎంత సమయమైనా కేటాయించేది. ఈ పద్ధతిలో ఆమె రోజూ సగటున 10 నుంచి 12 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించింది.
ఆసుపత్రి గ్లూకోజ్ బాటిల్స్..
ఏప్రిల్, మే నెలల్లో సీఎస్ ప్రొఫెషనల్ రెండు గ్రూపుల పరీక్షలు రాసే విద్యార్థులకు పేపర్ల మధ్య తగినంత విరామం దక్కదు. ఒక పరీక్ష రాసి వచ్చిన వెంటనే తర్వాతి పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సి వచ్చేది. ఈ విపరీతమైన ఒత్తిడి, నిరంతర షెడ్యూల్ కారణంగా సైనా తీవ్ర అనారోగ్యానికి గురైంది. శరీరంలో నీరసం పెరిగి ఆసుపత్రి పాలై గ్లూకోజ్ ఎక్కించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండా మిగిలిన పరీక్షలను విజయవంతంగా రాసింది.
ఆల్ ఇండియా ర్యాంక్ వన్..
అనారోగ్య సవాళ్లను అధిగమించి సాధించిన ఫలితం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మొత్తం 700 మార్కులకు గాను సైనా 432 మార్కులతో టాపర్‌గా నిలిచింది. గ్రూప్ 1లో 246 మార్కులు, గ్రూప్ 2లో 186 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. ఈ విజయం కేవలం ర్యాంకు మాత్రమే కాదని, ఎన్నో నెలల కఠిన శ్రమ, నిద్రలేని రాత్రులు, ఎన్నో త్యాగాల సమాహారమని సైనా వెల్లడించింది.
కార్పొరేట్ లా దిశగా భవిష్యత్ ప్రణాళిక
బీకాం పూర్తయిన తర్వాత ఎల్‌ఎల్‌బీ (LLB) పూర్తి చేయాలనేది సైనా తదుపరి ప్రణాళిక. అయితే పూర్తిస్థాయిలో కంపెనీ సెక్రటరీగానే తన వృత్తి జీవితాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది. కార్పొరేట్, నియంత్రణ (రెగ్యులేటరీ) వ్యవహారాల్లో తన వృత్తి నైపుణ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు న్యాయశాస్త్ర విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె భావిస్తోంది.
ఇది కూడా చదవండి: హిమానీనదీ విలయంపై ఐరాస సంచలన హెచ్చరిక!


