తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్‌.. ‘లా’లో తండ్రిని మించిన తనయి | Father-Daughter Make History By Securing Top Ranks In HPU LLB Exams Together, Daughter Bags 1st Rank And Father Secures 3rd Rank | Sakshi
Sakshi News home page

తండ్రికి మూడు.. కూతురికి మొదటి ర్యాంక్‌.. ‘లా’లో తండ్రిని మించిన తనయి

Aug 23 2026 9:41 AM | Updated on Aug 23 2026 12:46 PM

Father and Daughter Shine Together in LLB Exams Daughter Bags 1st Rank Father 50+ Secures 3rd

పాలంపూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా ఆలంపూర్‌కు చెందిన తండ్రీకూతుళ్లు అరుదైన విజయాన్ని నమోదు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం (హెచ్‌పీయూ) నిర్వహించిన మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ (లా) కోర్సు పరీక్షల్లో వీరిద్దరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో అగ్ర ర్యాంకులు కైవసం చేసుకున్నారు. హెచ్‌పీయూ రీజినల్ సెంటర్ (ధర్మశాల)లో 2023 నుంచి 2026 జూన్ వరకు ఇద్దరూ కలిసి న్యాయవిద్యను అభ్యసించారు.

23 ఏళ్ల కుమార్తె అన్షికా రాణా రెగ్యులర్ విధానంలో చదువుకోగా, ఆమె తండ్రి ప్రవీణ్ రాణా కరస్పాండెన్స్ విధానంలో కోర్సును పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఆరో సెమిస్టర్ తుది ఫలితాల్లో అన్షికా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి మొదటి ర్యాంకు సాధించగా, ఆమె తండ్రి ప్రవీణ్ మూడో ర్యాంకును దక్కించుకున్నారు. ప్రవీణ్ రాణా ప్రస్తుతం దరోహ్‌లోని హిమాచల్ ప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆయన మళ్లీ చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. పోలీసు శాఖలో బాధ్యతలు ఎంతో శ్రమతో కూడుకున్నవైనప్పటికీ, విధులను సమర్థంగా నిర్వర్తిస్తూనే క్రమం తప్పకుండా చదువుకు సమయం కేటాయించారు.

మూడేళ్ల పాటు తండ్రీకూతుళ్లు ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ తరగతులకు హాజరయ్యారు. తండ్రితో కలిసి చదువుకోవడం మరచిపోలేని అనుభవమని అన్షికా పేర్కొనగా, నేర్చుకోవాలనే తపన ఉంటే వయసు ఏనాడూ అడ్డంకి కాదని ప్రవీణ్ స్పష్టం చేశారు. ఏ వయసులోనైనా కొత్త లక్ష్యాలను సాధించవచ్చని ఆయన నిరూపించారు. ఈ అపూర్వ విజయంపై కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులతో పాటు పలువురు విద్యావేత్తలు ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చదవండి: ఐఫోన్‌ ఈఎంఐ కట్టలేక ‘యమున’లో దూకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement