టెహ్రాన్: అమెరికా తన వైఖరిని మార్చుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ‘హార్ముజ్ జలసంధి’ మూసివేసే ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసేన్ రెజాయ్ స్పష్టం చేశారు. అమెరికా చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని, ఆ దేశం తన ప్రవర్తనను సరిదిద్దుకునేంత వరకు ఈ జలమార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఐఆర్ఐబీ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు.
వాషింగ్టన్ ప్రత్యక్ష సైనిక దాడులకు స్వస్తి చెప్పి, ఆర్థిక ఆంక్షల వైపు మళ్లిందని రెజాయ్ పేర్కొన్నారు. ఇరాన్‌పై ఆర్థిక దిగ్బంధం విధిస్తే లొంగిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భరోసా ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే ఆంక్షలను అధిగమించి చమురు ఎగుమతులు కొనసాగించే మార్గాలను తాము ఎప్పటినుంచో నేర్చుకున్నామని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ తీరంలో 50 శాతానికి పైగా భూభాగం ఇరాన్‌దేనని, హార్ముజ్ నిర్వహణ బాధ్యత తమదేనని తేల్చిచెప్పారు.
ఈ జలసంధి అమెరికా భూభాగమంటూ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఆర్థిక దిగ్బంధం ముగింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, చమురు ఆంక్షల ఎత్తివేతతో కూడిన 14 అంశాల ఒప్పందాన్ని అమెరికా నెరవేరిస్తేనే జలసంధిని తెరుస్తామని పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. మరోవైపు, యూఎస్ నౌకాదళ భద్రతతో చమురు రవాణా నిరాటంకంగా సాగుతోందని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ పేర్కొన్నారు. అంతర్జాతీయ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ సంక్షోభం ప్రస్తుతం ప్రపంచ ఇంధన మార్కెట్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ సీక్రెట్ హిస్టరీ ఇదే!


