బీజేపీలో నితిన్ మార్క్ షురూ.. తొలి రోజే ఎన్నికల రోడ్‌మ్యాప్ సిద్ధం! | Nitin Nabin Chairs First Meeting with BJPs New National Team | Sakshi
Sakshi News home page

బీజేపీలో నితిన్ మార్క్ షురూ.. తొలి రోజే ఎన్నికల రోడ్‌మ్యాప్ సిద్ధం!

Aug 22 2026 12:23 PM | Updated on Aug 22 2026 12:25 PM

Nitin Nabin Chairs First Meeting with BJPs New National Team

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతనంగా నియమితులైన జాతీయ కార్యవర్గంతో శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, యువతకు మరింత చేరువకావడం తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నిలిచిన నబీన్.. త్వరలోనే వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
 

ఇటీవలే ప్రకటించిన 65 మంది సభ్యుల నూతన కార్యవర్గంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్ తదితరులు నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) బీఎల్‌ సంతోష్ కొనసాగుతుండగా, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్ వ్యవహరించనున్నారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు.

జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. ఐటీ విభాగాధిపతిగా అమిత్ మాల్వియా స్థానంలో దీపక్ మ్హాస్కే, యువమోర్చా అధ్యక్షుడిగా తేజస్వి సూర్య స్థానంలో హేమాంగ్ జోషిని నియమించారు. నూతన కార్యవర్గానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్ ’వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. అనుభవం, యువశక్తి కలగలసిన ఈ బృందం ప్రజాసేవలో ముందంజలో ఉంటుందని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: అమెరికా వీసా రూల్స్ దెబ్బకు భారతీయ జంట విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement