చండీగఢ్: ఈ రోజుల్లో పెళ్లి పేరుతో అమ్మాయిలు, లేదా అబ్బాయిలు ఇతరులను బురిడీ కొట్టించడం సాధారణంగా మారింది. తప్పుడు వివరాలు చెప్పి తీరా పెళ్లయ్యాక డబ్బు లేదా ఆస్తులతో ఉడాయిస్తుంటారు. అయితే పంజాబ్‌లోనే ఇలాంటి తరహా జరిగింది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకుంటున్నారా? అయితే ఆ మహిళ మోసం చేసింది సాదా సీదా వ్యక్తిని కాదు రాష్ట్ర స్థాయి నాయకున్ని ఈ స్టోరీ తెలుసుకోవాలనుందా అయితే ఓ లుక్కేయ్యండి!
వివరాల్లోకి వెళితే.. AAP జాయింట్ సెక్రటరీ అమరీందర్ సింగ్ మండోఫల్ కు 2026 ఫిబ్రవరిలో మన్విందర్ కౌర్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో మహిళను ఆమె కుటుంబ సభ్యులు PCS అధికారిగా పరిచయం చేశారు, అంతేకాకుండా తనకు అంతకు ముందు పెళ్లి కాలేదని చెప్పారు. కాగా కొద్ది నెలలకే ఆమహిళ ఇంటి నుంచి బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను తీసుకుని వెళ్లిపోయింది. తీరా ఆమె గురించి ఆరా తీస్తే
పెళ్లికి ముందు ఆమె చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలింది. ఈ వివరాలను అమరీందర్ సింగ్ చెప్పారు. అంతే కాకుండా తనకు ఆమె వయస్సు విషయంలోనూ అబద్ధాలు చెప్పారని తెలిపారు
వివాహం అనంతరం ఆ మహిళ గురించి తాను సమాచారం సేకరించగా, ఆమెకు గతంలోనే పెళ్లి జరిగిందని, ఆ వివాహం విడాకులతో ముగిసిందని తెలిసిందని తెలిపారు. అంతేకాకుండా ఆమెకు 18 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడన్నారు. తప్పుడు గుర్తింపు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తనను పెళ్లి చేసుకునేలా మోసం చేశారని ఆయన ఆరోపించారు. అమరీందర్ సింగ్ మండోఫల్ జిల్లా పరిషత్ సభ్యుడిగా, అలాగే మార్కెట్ కమిటీ సిర్హింద్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.
కాగా ఈ వివాహ వేడుకకు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, క్యాబినెట్ మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సౌండ్ సహా పలువురు ప్రముఖ AAP నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. వాటిలో రాజకీయ నాయకులు దంపతులతో కలిసి వేడుకల్లో పాల్గొంటూ, భాంగ్రా చేస్తూ కనిపించారు. రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుడినే మహిళ బురిడీ కొట్టించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
మండోఫల్ ఫిర్యాదు మేరకు పోలీసులు మోసం, ఫోర్జరీకి సంబంధించిన కేసును ఆరుగురిపై నమోదు చేశారు. కేసులో మన్విందర్ కౌర్‌తో పాటు ఆమె సోదరుడు తర్లోచన్ సింగ్, తల్లి వరిందర్‌జిత్ కౌర్, బంధువు నరిందర్ సింగ్ గోల్డీ, వదిన రుపిందర్ కౌర్, మాజీ గ్రామ సర్పంచ్ సురిందర్ సింగ్ రాణాలను నిందితులుగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


