లైకుల కోసం వేట.. కటకటాలకు బాట..
ఫాలోవర్స్ కోసం పక్షుల ‘హక్కులు’ విరుస్తారా!
వేట వీడియోలు పెడితే తప్పవు బేడీలు..
జీవహింసపై మీరూ ఫిర్యాదు చేయొచ్చు
ఉదయాన్నే కిటికీ పక్కన వాలి కిచకిచమనే పిచ్చుక, ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులు ప్రకృతి మనకిచ్చిన అత్యంత మధురమైన బహుమతులు. వాటిని చూసినప్పుడు, ఆ కిలకిల రావాలు విన్నప్పుడు మనసులో కలిగే ఆహ్లాదం, ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. చెట్లకు విత్తనాలు పంచుతూ, పంటలను చీడపీడల నుంచి కాపాడుతూ, ప్రకృతికి ప్రాణం పోసే ఆ అమాయక ప్రాణులకు ఆకాశమే ఇల్లు. పక్షుల్లాగే, జంతువులు కూడా ప్రకృతికి రమ్యతను చేకూర్చేవే! మానవ జీవితానికి నిండుదనం తెచ్చేవే!
కానీ, ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది, కొన్ని క్షణాల లైకులు, వ్యూస్, ఫాలోవర్ల కోసం ఆ మూగజీవాల స్వేచ్ఛను, ప్రాణాలను హరిస్తున్నారు. అడవి జంతువులు, పక్షులను వేటాడి, వాటిని హింసిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ధోరణి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వినోదం పేరుతో వన్యప్రాణులను వేటాడటం మానవత్వానికే మచ్చ. ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యల వల్ల కలిగే నష్టం గురించి, కఠిన శిక్షల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
చట్టం కళ్లు కప్పలేరు..
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో అడవి పక్షులను వేటాడి, వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన ఘటన ఇటీవల సంచలనం రేపింది. ఈ వీడియోలపై జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఇండియా తక్షణమే స్పందించింది. పెటా ఫిర్యాదు మేరకు సంబంధిత నిర్మల్ అధికారులు రంగంలోకి దిగారు. న్యూ బొప్పారం గ్రామంలోని షేక్ ఆఫ్రోజ్ అనే వ్యక్తి ఇంటిలో తనిఖీలు చేశారు. సోదాల్లో ఒక రబ్బరు గులేరు, ఉచ్చు, మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: రోజుకొక కప్పు చాయ్: గుండె జబ్బులకు బై–బై
నేరుగా రిపోర్ట్ చేయడం
మీరు ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ మొదలైన వాటిలో ఏ యాప్‌లో వీడియో చూస్తున్నా అక్కడికక్కడే చర్య తీసుకోవచ్చు. వీడియో పైన లేదా కింద ఉన్న మూడు చుక్కల ( ...) గుర్తుపై క్లిక్ చేసి, అక్కడ రిపోర్ట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కారణాలు అడిగినప్పుడు జంతు హింస లేదా హింస / హానికరమైన కంటెంట్ (హింసాత్మక కంటెంట్) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి సబ్‌మిట్ చేయండి. దీనివల్ల ఆ ప్లాట్‌ఫారమ్‌లు తక్షణమే ఆ వీడియోలను తొలగిస్తాయి.
ఇదీ చదవండి: దీపథూన్ వివాదం: సుప్రీంకోర్టు కీలక అదేశాలు
సంస్థలకు ఫిర్యాదు చేయడం
వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు వన్యప్రాణులపై జరిగే సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. వీడియో లింక్‌లు, స్క్రీన్‌షాట్‌లను wccd@wti.orf.in లేదా ingo@wti.orf.in మెయిల్ ఐడీలకు పంపవచ్చు. అలాగే, పెటా ఇండియా వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్
సోషల్ మీడియా వేదికగా వన్య ప్రాణులను హింసించే కంటెంట్‌ను ప్రచారం చేయడం సైబర్ నేరం కిందకు వస్తుంది. అధికారిక వెబ్‌సైట్ అయిన సైబర్ క్రైమ్.gov.in ద్వారా లేదా 1930 టోల్–ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మూగ జీవాలకు మాటలు రాకపోవచ్చు, కానీ వాటి ప్రాణాలకు రక్షణగా నిలబడే గొంతుక మనది కావాలి.సోషల్ మీడియా లైకుల కంటే ప్రకృతి ప్రేమ, జీవకారుణ్యం ఎంతో గొప్పవని గుర్తుంచుకుందాం!
– సాక్షి స్పెషల్ డెస్క్


