గర్ల్స్‌ హాస్టల్‌లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే! | Illegal Egg Collection Racket in hyderabad | Sakshi
Sakshi News home page

గర్ల్స్‌ హాస్టల్‌లోకి పురుషులు.. లోపల బాగోతం వేరే!

Nov 18 2026 1:51 PM | Updated on Nov 18 2026 1:58 PM

Illegal Egg Collection Racket in hyderabad

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన అక్రమ అండాల సేకరణ, విక్రయ వ్యవహారాన్ని ఓ సామాన్యుడి అప్రమత్తత బట్టబయలు చేసింది. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌లో మహిళా హాస్టల్‌ ముసుగులో రెండేళ్లుగా సాగుతున్న అంతర్రాష్ట్ర ముఠా రాకెట్‌ గుట్టును స్థానిక టీకొట్టు వ్యాపారి పోలీసులకు ఉప్పందించడంతో వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 12 మంది నిరుపేద మహిళలకు విముక్తి కలిగింది. 

అనుమానంతో అప్రమత్తమై.. 
ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ సమీపంలో ఉన్న నజ్రాన్‌ అపార్ట్‌మెంట్‌లో అమి నితా గరల్స్‌ హాస్టల్‌ పేరుతో మహిళా వసతిగృహం ఉంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌ శర్మ (40), నిఖత్‌ శర్మ (38) ఈ భవనంలోని ఐదు పోర్షన్లను నెలకు రూ. 50 వేల అద్దెకు తీసుకొని లోపల అక్రమ అండాల సేకరణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆ భవనం ఎదురుగా చిన్న టీకొట్టు నడుపుతున్న ఓ వ్యక్తికి హాస్టల్‌ వద్ద కదలికలు అనుమానం కలిగించాయి. 

సాధారణంగా మహిళా హాస్టళ్లలో నివసించే వారు నిత్యం కాలేజీలు లేదా ఆఫీసులకు వెళ్తుంటారు. కానీ ఈ హాస్టల్‌ తలుపులు మాత్రం ఎప్పుడూ మూసే ఉండేవి. లోపలి అమ్మాయిలు ఎవరూ కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లడం అతను ఎప్పుడూ చూడలేదు. అలాగే ఆ హాస్టల్‌లోకి తరచూ కొందరు మగవారు ప్రవేశించడం, గంటల తరబడి అక్కడే ఉండటం అతని దృష్టికి వచి్చంది. ముఖ్యంగా హాస్టల్‌ ప్రాంగణంలోకి తరచూ వైద్య సిబ్బంది రావడం, మెడికల్‌ కిట్లు, హార్మోన్‌ ఇంజెక్షన్ల బాక్సులతో కూడిన వాహనాలు ఆగడంతో అతని అనుమానం మరింత పెరిగింది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. 

పేద మహిళలకు పదేపదే హార్మోన్‌ ఇంజక్షన్లు, మాత్రలు 
మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ, బేగంపేట పోలీసులు, హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత నెల 30న హాస్టల్‌ భవనంపై దాడులు చేపట్టి లోపల జరుగుతున్న తతంగం చూసి నివ్వెరపోయారు. ఒక్కో అండానికి రూ. 65 వేల వరకు ఇస్తామని ఆశచూపి పొరుగు రాష్ట్రాల నుంచి పేద మహిళలను అమిత్‌ శర్మ, నిఖత్‌ శర్మ హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. వారికి ప్రమాదకరమైన హార్మోన్‌ ఇంజక్షన్లు, మాత్రలను ఇస్తున్నట్లు కనుగొన్నారు. ఈ వైద్య ప్రక్రియలను బంజారాహిల్స్‌లోని పద్మజ, నర్మద, ఒయాసిస్‌ ఫెర్టిలిటీ సెంటర్లలో నిర్వహించేవారని దర్యాప్తులో తేల్చారు. 

ఈ రాకెట్‌కు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ వ్యవహారంలో వైద్యుల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. గతంలో సికింద్రాబాద్‌ ప్రాంతంలో సంచలనం సృష్టించిన అక్రమ సరోగసి కేంద్రం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తోనూ ఈ అండాల రాకెట్‌కు లింక్‌ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. కొందరు యువతుల్ని కేవలం అండాల కోసం కాకుండా అక్రమ సరోగసీ కోసమూ వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఇదీ చదవండి: డాక్టర్‌ పద్మజకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement