జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఆమె శరీర భాగాలు నిందితుడి ఇంట్లోని వంటపాత్రలో కన్పించడం తీవ్ర కలకలం రేపింది. కుచాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జొంబ్రో గ్రామంలో ఈ నెల 10వ తేదీన ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రీయ కోల్ సేన (RKS) ఈ ఘటనకు సంబంధించిన వెల్లడించిన వివరాల ప్రకారం బిశ్వాసి సోయ్(47)ఈ నెల 10వ తేదీన గ్రామ సమీపంలోని మార్కెట్‌లో బియ్యపు సారా విక్రయించేందుకు వెళ్లింది. అక్కడే రాత్రవడంతో బంధువు పైలూష్ ముండా ఇంట్లో ఆగింది. అక్కడ అందరూ కలిసి బియ్యపు సారా తాగి, నిద్రకు ఉపక్రమించారు. అయితే, అర్ధరాత్రి సమయంలో బిశ్వాసిపై పైలూష్ లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడు. ఆపైన శరీరాన్ని ముక్కలుగా నరికాడు. కొంతభాగాన్ని గ్రామ శివారులోని మురుగు కాల్వలో పడేశాడు. మిగతా భాగాల్ని ఇంట్లోని పొయ్యిపై ఉన్న వంటపాత్రలో పడేశాడు. బిశ్వాసి కనిపించకపోయేసరికి భర్త గ్రామస్తులతో కలిసి వెతుకులాట ప్రారంభించాడు. మురుగు కాల్వతోపాటు, ఇంట్లోని వంటపాత్రలో వారికి బిశ్వాసి శరీర భాగాలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: నాగా సంప్రదాయ సంస్థలపై గౌహతి హైకోర్టు ఆగ్రహం
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ హత్యకు గురైందని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ మనోజ్ స్వర్గియారి తెలిపారు. నిందితుడిని పైలూష్ ముండాను అరెస్ట్ చేసి గురువారం జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తల్లిపై కత్తితో కొడుకు దాడి : తర్వాత భవనంపైనుంచి పడి..!


