దేవదారు చెట్టు ఆకులు మైదాకు చెట్టు ఆకులను పోలి ఉంటాయి. కానీ కాండాన్ని చీల్చినప్పుడు గాని, కాల్చినప్పుడు గాని గంధం చెట్టు వాసన వస్తుంది. అందుకని దీన్ని బాస్టర్డ్ శాండల్ లేక రెడ్ సిడార్ అంటారు. ఈ దేవదారు హిమాలయాలలో ఉండే డియోదర్‌కు ఎలాంటి పోలికా ఉండదు. దీన్ని గురించి చాలా మందికి తెలియదు. కానీ దీన్ని అనేక ఔషధ గుణాలు కలదిగా చెబుతారు. దీనికి ఇంకా కొన్ని పేర్లు ఎరిత్రోక్జైలాం ఇండికం, ఎరిత్రోక్జైల్‌ం సైడరోక్లైలైడ్స్, సేధియా ఇండికా అని కూడా అంటారు.
ఉనికి: దేవదారు ఉష్ణమండలపు చెట్టు. హరితంగా ఉన్నప్పటికీ ఆకులు రాల్చుతుంది. మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇది 5–7 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. మండలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గుబురుగానే అగుపడుతుంది. దీని స్వస్థలం దక్షిణ భారతదేశం, శ్రీలంకగా గుర్తించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఎక్కువగా దీని ఉనికి ఉంది.
నల్లమల అడవులు ఈ చెట్లకు పెట్టింది పేరు. ఈ ప్రాంతపు చిట్టడవుల్లో కూడా పెరుగుతుంది. ఈ చెట్టుకు కాసే పండ్లు తినటానికి ఇంపుగా ఉంటాయి. దేవదారు చెట్టు బెట్టను తట్టుకుంటుంది. దీని కట్టె కూడా గట్టిగా ఉంటుంది. దీన్ని విత్తనం ద్వారా మొలకెత్తించవచ్చు.
ఉపయోగాలు: దేవదారు లేత ఆకులను (చిగుర్లు) కూరగా వాడుతారు. చాలా రుచిగా ఉంటుంది. ఆకులను పశువులకు, మేకలకు మేపుతారు. పండ్లు తింటారు. వగరు–తీపి కలయికతో కూడుకొని ఉంటాయి. పండు రంగు మాత్రం పగడంలా ఎర్రగా మెరుస్తుంటుంది. ఆకులను ఎండబెట్టి, పొడి చేసి పెట్టుకొని అవసరమున్నప్పుడు వాడతారు.
కొమ్మలను హోమాలలో వాడతారు. చెట్టు శాగ ఉన్న మండల నుంచి డిస్టిల్లేషన్ ద్వారా నూనెను తయారు చేస్తారు. ఆ నూనెను ప్రిజర్వేటివ్‌గా టింబర్ మిల్లుల్లో, పర్ ఫ్యూంలలో వాడుతారు. గంధం చెక్కకు బదులుగా ఈ దేవదారు చెక్కలను వాడతారు. దేవదారు చెట్టు వాసన–గంధం చెట్టు వాసనకు అతి దగ్గరి పోలిక ఉంటుంది. కలపను బొమ్మలను ఇతర చిన్న చిన్న ఫర్నీచర్ల తయారీలో వాడతారు. ఫర్నీచర్‌ను పాలిష్ చేస్తే అందంగా కనిపిస్తాయి. ఎక్కువగా చేవ ఉన్న కట్టెలను ఫర్నీచర్ తయారీకి వాడతారు.
దేవదారు చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆకుల నుంచి తీసిన రసానికి చిటికెడు ఉప్పు కల్పి తాగితే కడుపులోని నట్టలు చనిపోతాయి. ఆయుర్వేద మందుల తయారీలో ఈ చెట్టు భాగాలను వాడతారు. గ్రామాల్లో దీపావళి రోజున సాయంత్రం (తెలంగాణలో ఈ చెట్లు ఉండే ప్రాంతాల్లో) కొట్టంగోలలు కాల్చి ఎద్దుల కొట్టాలలో, ఇండ్ల ముంగిట, పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళపై నుండి తిప్పుతారు. దీనివల్ల మంచి చేకూరుతుందని అక్కడి జనాల నమ్మకం.
నల్లమల అడవి ఒకప్పుడు కీకారణ్యం. ఎన్నో జంతుజాలాలు, చెట్టు చేమలకు నిలయంగా ఉందేది. నాడు–నేడు గమనించినట్లయితే ఎన్నో మార్పులు అగుపడుతాయి. కానీ ఈ దేవదారు చెట్ల ఉనికి కొంత చెదిరినా, ఇప్పటికి దర్శనమిస్తాయి.
వీటిపైన అవగాహన లోపం కొంత, ఇతర కారణాల వల్ల ఇక్కడ పరిశోధనలు జరగలేదు. ముఖ్యంగా దేవదారు చెట్లపైన, వీటి ఉపయోగాలను పంట పోలాలకు చేరువగా తేగలిగితే, ఇటు రైతులకు అటు వినియోగదారులకు లాభం చేకూరగలదని నమ్మకం. ఈ పండ్లపై సంస్థలే కాదు వ్యక్తులు కూడా అంతగా పరిశోధనలు చెయ్యలేదు. కానీ దేవదారు ఆకులు, వేర్లు తదితర భాగాలపై పరిశోధన సమాచారం ఉంది.
వివిధ భాషల్లో దేవదారు పేర్లు:
ఇంగ్లీష్ : రెడ్ సెడర్, బాస్టర్డ్ శాండల్, త్రిఆఫ్ ఇండియా
కన్నడ: చంబలు, జీవడలి, జీవడానె, సెం, గంధగరు
తమిళం: అయక్కంతమరం, కక్కర, తపం, సెమ్మనటి, సితారి, వట్టుకొల్లి
తెలుగు: పరిభద్రకము, గతిరి, అడవి గోరంటి, పగడపు, గడర దేవదారు
మరాఠి: గంధ్ – గిరి
మలయాళం: దెవరు, చెం, చెమ్మన
సంస్కృతం: కాటు చందన
పూత : ఏటా రెండు సార్లు పూస్తుంది. మార్చి – జూన్, అక్టోబర్ – డిసెంబర్
పండ్లు : జులై నుంచి మే (మరుసటి సంవత్సరం).
(పూత, కాత సంవత్సరం పొడవునా ఉంటాయి)
డాక్టర్ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,
ఐసీఏఆర్ – ఐఐఓఆర్,
రాజేంద్రనగర్, హైదరాబాద్.
మొబైల్: 94407 08924


