రైతులకు వరం సూపర్‌ సంచి! | Hermetic Super bags for safe storage of rice grains and seeds | Sakshi
Sakshi News home page

రైతులకు వరం సూపర్‌ సంచి!

Nov 10 2026 6:36 AM | Updated on Nov 10 2026 6:36 AM

Hermetic Super bags for safe storage of rice grains and seeds

గోనె సంచుల్లో ధాన్యం, పప్పుధాన్యాలు నిల్వ చేస్తే బూజు, పురుగులతో నాణ్యత క్షీణత

గాలి చొరబడని ‘సూపర్‌ గ్రెయిన్‌ బ్యాగ్‌’లే ఈ సమస్యలకు అద్భుత పరిష్కారం అంటున్న ఐఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు

నూకల శాతం 10–14% నుంచి కేవలం 1–2%కి తగ్గుతుంది 

విత్తనాల మొలక 86.7% నుంచి 95%కి పెరుగుతుంది

సూపర్‌ బ్యాగ్‌ ధర సుమారు రూ. 100. ఒక్క సీజన్ లో ఆదా అయ్యే విత్తనాల విలువ (రూ. 115) సంచి ఖర్చు కంటే ఎక్కువే!

ఈ సూపర్‌ సంచిని మూడేళ్ల పాటు తిరిగి వాడుకోవచ్చు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకోవటంలో సరైన సదుపాయాలు లేక ఆసియా దేశాల్లో సుమారు 10 నుంచి 30 శాతం వరకు వరి ధాన్యం వృథా అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు సాంప్రదాయ గోనె సంచుల్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. వీటి వల్ల వాతావరణంలోని తేమను ధాన్యం త్వరగా పీల్చుకుంటుంది. ఫలితంగా బూజు పట్టటం, పురుగులు ఆశించి విత్తన నాణ్యత దెబ్బతినటం జరుగుతోంది. ఈ సమస్యకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) శాస్త్రవేత్తలు అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ‘సూపర్‌ గ్రెయిన్‌ బ్యాగ్‌’ (ఎస్‌జీబీ) అనే గాలి చొరబడని (హెర్మెటిక్‌) నిల్వ సాంకేతికతను అద్భుత పరిష్కారంగా చూపుతున్నారు. 

→ పురుగులను సహజంగానే అరికట్టే సాంకేతికత
అస్సాంలోని శివసాగర్, జోర్హాట్‌ జిల్లాల్లో అత్యధిక తేమ ఉండే వాతావరణంలో ఐఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహించారు. 60 మైక్రాన్ల మందం, ప్రత్యేక గ్యాస్‌ బారియర్‌ పొరతో తయారైన పాలిథిన్‌ ‘సూపర్‌ గ్రెయిన్‌ బ్యాగ్‌’లో ధాన్యాన్ని నింపి గాలి చొరబడకుండా మూసివేస్తారు. సంచి లోపల ఉన్న గింజలు, పురుగులు శ్వాసించటం వల్ల.. సంచి లోపల ఆక్సిజన్‌ లభ్యత తగ్గి, కార్బన్‌ డై ఆక్సైడ్‌ పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి రసాయన పురుగుమందులు వాడకుండానే పురుగులు ఊపిరాడక సహజంగానే నశిస్తాయి. అంతేకాకుండా, బయటి గాలిలోని తేమ లోపలికి వెళ్లకుండా ఈ సంచి అడ్డుకుంటుంది.

→ తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడి..
ఒక సూపర్‌ గ్రెయిన్‌ బ్యాగ్‌ ధర సుమారు రూ. 100 మాత్రమే ఉంటుంది. దీన్ని మూడేళ్ల పాటు తిరిగి వాడుకోవచ్చు. ధాన్యాన్ని విత్తనాల కోసం కూడా సూపర్‌ బ్యాగుల్లో నిల్వచేసుకుంటే.. ఒక్క సీజన్ లో ఆదా అయ్యే విత్తనాల విలువ (సుమారు రూ. 115) సంచి ఖర్చు కంటే ఎక్కువే కావటం విశేషమని ఐఆర్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు చెప్పారు. అస్సాంలో 80 శాతానికి పైగా ఉన్న చిన్న రైతులు సొంతంగా దాచుకునే విత్తనాల్లో సగం భాగాన్ని సూపర్‌ బ్యాగులలో నిల్వ చేస్తే, ఏటా 3,590 టన్నుల విత్తనాలు ఆదా అవ్వటమే కాకుండా సుమారు రూ. 14.5 కోట్ల మేరకు వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అధ్యయనం తేల్చింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు తమ పంటను సురక్షితంగా దాచుకొని, మార్కెట్లో మంచి ధర వచ్చే వరకు వేచి ఉండేందుకు ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుంది. 

→ సూపర్‌ సంచి ప్రయోజనాలెన్నో..!
తేమ నియంత్రణ: సాంప్రదాయ గోనె సంచుల్లో ఐదు నెలలు నిల్వ చేస్తే ధాన్యంలో తేమ శాతం 14.8% నుంచి∙16.3%కి పెరిగింది. ధాన్యపు గింజలు రంగు మారి చెడిపోయాయి. కానీ, సూపర్‌ బ్యాగ్‌లలో నిల్వ చేసిన ధాన్యంలో తేమ శాతం పెరగకుండా స్థిరంగా ఉంది.

పురుగుల నివారణ: ఐదు నెలల తర్వాత గోనె సంచుల్లో పురుగుల సంఖ్య విపరీతంగా పెరగ్గా, సూపర్‌ బ్యాగ్‌లలో పురుగుల సంఖ్య సున్నాకి తగ్గింది.

మొలకెత్తే సామర్థ్యం: గోనె సంచుల్లో నిల్వ చేసిన వరి విత్తనాల మొలక శాతం 97.2% నుంచి 86.7%కి పడిపోగా,  సూపర్‌ బ్యాగ్‌లలో నిల్వ చేసిన విత్తనాలు 95% కంటే ఎక్కువ మొలకెత్తే సామర్థ్యాన్ని నిలుపుకున్నాయి.

మిల్లింగ్‌ నాణ్యత: మిల్లింగ్‌ సమయంలోనూ తేడా కనిపించింది. గోనె సంచుల్లోని ధాన్యం మర పట్టిస్తే 10–14% వరకు నూకలు వచ్చాయి. సూపర్‌ బ్యాగ్‌లలో నిల్వ చేసిన ధాన్యంలో నూకల శాతం కేవలం 1–2% మాత్రమే నమోదైంది. నూక తగ్గటం వల్ల నికర బియ్యం ఉత్పత్తి పెరుగుతుంది. మార్కెట్లో రైతులకు మంచి ధర లభిస్తుంది. బిహార్‌లో జరిగిన ప్రయోగాల్లోనూ ఈ సంచుల్లో నిల్వ చేసిన కంది, వరి విత్తనాలు అత్యుత్తమ మిల్లింగ్‌ నాణ్యతను, అధిక మొలక శాతాన్ని కనబరిచాయి.
 

సూపర్‌ బ్యాగ్‌ను వాడేదెలా?
1. సాధారణ నిల్వ సంచిలో సూపర్‌ బ్యాగ్‌ను ఒక పొరలా (లైనర్‌గా) అమర్చండి.
2. బాగా ఎండబెట్టిన ధాన్యం లేదా విత్తనాలను సంచిలో నింపండి.
3. సంచి లోపల ఉన్న గాలిని బయటకు తీసివేసి, సంచి పైభాగాన్ని గట్టిగా మెలితిప్పండి.
4. మెలితిప్పిన ΄్లాస్టిక్‌ భాగాన్ని కిందికి మడిచి, దృఢమైన రబ్బరు బ్యాండ్లు లేదా టేపుతో గాలి చొరబడకుండా గట్టిగా కట్టండి (సీల్‌ చేయండి).

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement