ఒకప్పుడు నల్లమల అడవుల్లో తునికి చెట్లు విరివిగా ఉండేవి. కానీ, వీటి సాంద్రత క్రమంగా తగ్గుతున్నది. దీనికి అనేక కారణాలు.. అందులో వాతావరణ మార్పు, అడవికి నిప్పు అంటుకోవటం, చెట్లను నరకటం మొదలైనవి. అడవిలో కార్చిచ్చు అంటుకున్నప్పుడు వీటితోపాటు ఇతర పండ్ల మొక్కలు, చెట్లు కాలిపోతాయి. గిరిజనులు, గిరజనేతరులు పండ్లను తెచ్చి గతంలో సంతల్లో అమ్మేవారు. ప్రస్తుతం ఈ పండ్లను తెచ్చేవారు కరువయ్యారు. ఈతరం వాళ్ళకు ఈ పండ్ల పేర్లు కూడా తెలియకుండా పోయింది. ఈ పండ్లు ఒక్క నల్లమల అడవుల్లోనే కాకుండా∙వరంగల్, ఆదిలాబాద్ అడవుల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, శ్రీకాకుళం మొదలగు అడవుల్లో కూడా ఉన్నాయి.
ఉనికి
దీని స్వస్థలం ఇండియా, శ్రీలంకగా గుర్తించారు. కానీ ఇతర దేశాలైన ఫిలిప్పీన్స్, జపాన్, చైనా, థాయిలాండుల్లో కూడా తునికి చెట్లు ఉన్నాయి. మన దేశంలో ఎక్కువగా మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ మొదలగు రాష్ట్రాల్లో తునికి చెట్లు విస్తరించాయి.
తునికి చెట్లకు ట్రేడ్ పేరు ‘ఎబోని’, కోరొమాండల్ ఎబోని లేక ఈస్ట్ ఇండియన్ ఎబోని అని కూడా∙అంటారు. ఈ చెట్లు దాదాపు 20–25 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. మార్చి, ఎప్రిల్ మాసాల్లో పూత వస్తుంది. పూత పూసిన తరవాత పండ్లు కోతకు రావటానికి ఒక సంవత్సరం పడుతుంది. ఈ పండ్లు పర్షిమాన్ పండ్లను పోలి ఉంటాయి. ఈ పండ్ల చెట్లు మాత్రం గిరిజనుల ఆర్థిక వనరుల్లో తునికి ఆకులు చాలా ముఖ్యమైనవి.
తునికి ఉపయోగాలు
తునికి పండ్లు నశ్యం బ్రౌన్ రంగుతో 1–4 ఉంటాయి. గుజ్జు మాత్రం సన్నటి నూలుపోగులతో వుండి తినటానికి రుచిగా ఉంటాయి. ప్రయోగశాలలో పరిశీలించగా వీటిలో చక్కెర, ప్రోటీన్లు, పీచుపదార్థం, విటమిన్ ‘ఇ’ ఉన్నట్లు గుర్తించారు. తునికి పండు గుజ్జులో పిండి పదార్థం 81%, ప్రోటీన్లు 2%, కొవ్వు 2%, పీచుపదార్థం 11%, 349 కిలోకేలరీలు ఉంటాయి. ఇవి ధాతువులకు నిలయం అంటారు. ఇందులో క్యాల్షియం (11.8%), ఫాస్పరస్ (62%), ఇనుము (3.4%), సోడియం (1.28%), కాపర్ (0.2%). ఇవే కాకుండా విటమిన్ ‘ఇ’ (49 మి.గ్రా%), బీటకరోటిన్ (260 మైక్రోగ్రాములు) ఉంటాయి.
తునికి పండ్లు రక్తస్రావ నివారిణి. శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తాయి. వీటిని తినే ఆదివాసులు ఎండలో కూడా ఎక్కువసేపు శ్రమించగలరు. కాయలు పిత్త దోషాన్ని తగ్గిస్తాయి. ఈ పండ్లు బైల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. పండ్లతో వైన్ తయారు చేస్తారు. ఇందులో చాలా పోషకాలు, యాంటి ఆక్సిడెంట్ చర్యలుంటాయి. మాగిన తునికి పండ్లలో గణించిన పోషకాల నిష్పత్తిని పరీక్షల ద్వారా తెలిసిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఆకులు: ఈ ఆకులను బీడీలు చుట్టటానికి వాడతారు. బీడీ ఆకుల సేకరణ, బీడీలు చుట్టే పరిశ్రమ ఎందరికో జీవనాధారంగా కొనసాగుతోంది. ఆకుల్లో 7.12% ముడి ప్రోటీన్, 25.28% ముడి పీచు పదార్థం ఉంటుంది. కారుతున్న రక్తాన్ని ఈ ఆకుల రసం రాస్తే ఆగుతుంది. దురదలను, పుండ్లను నివారించటానికి వాడతారు.
బెరడు: తునికి చెట్టు బెరడును కాల్చగా వచ్చిన బూడిదను అమ్మవారు (స్మాల్ పాక్స్) తగ్గించటానికి గిరిజనులు వాడతారు. పండ్లను ఆరబెట్టగా వచ్చిన పొడిని కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చేయటానికి ఉపయోగిస్తారు.
పూలు: ఎండిన పూలను మూత్రాశయం, చర్మం, రక్త సంబంధ రోగాలను నివారించటానికి ఉపయోగిస్తారు.
విత్తులు/గింజలు: మానసిక రోగాలను, నరాల బలహీనత, గుండె దడను తగ్గించటానికి గింజల పొడిని ఉపయోగిస్తారు.
కలప: తునికి కలప గట్టిగా ఉండటం వల్ల దీన్ని గృహ నిర్మాణంలో వాడతారు. వ్యవసాయ పనిముట్లు, దువ్వెనలు, స్తంభాలు, చెక్కపెట్టెల తయారీలో వాడుతారు. తునికి పండ్లల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటిపై అధిక దిగుబడినిచ్చే రకాలను, విలువ ఆధారిత పదార్థాలను, వీటి మార్కెటింగ్‌కు, విస్తరణకు ప్రభుత్వాలు పాటుపడితే, ఒక దిక్కున ఉపాధి కల్పించినట్లుగా ఉంటుంది. మరో దిక్కున పర్యావరణాన్ని పోషించినట్లు ఉంటుంది.
నల్లమల అడవులు: ప్రత్యేకంగా ఒకప్పుడు ఆయా రుతువుల్లో పండే పండ్లు ఎందరికో జీవనాధారం. అంటే వీటిని అడవుల్లో ఉండే జనం నేరుగా ఆరగించేవాళ్లు. కావలసిన పోషకాలు దొరికేవి. అట్లే, పండ్లు ఉన్నప్పడు వీటిని సేకరించి దగ్గరగా ఉన్న గ్రామాల్లో అమ్మగా వచ్చే రొక్కంతో వారికి కావలసిన సరకులు కొనుక్కునేవారు.
ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. ఒకప్పుడు అడవుల్లోని పక్షులకు, కోతులకు తునికి కాయలు మంచి ఆహారంగా ఉండేవి. రానురాను ఈ చెట్లు తగ్గిపోవటం, వానరాలకు సంకటంగా మారి జనావాసాల్లోకి చేరుకొనే దశకు చేరుకున్నాయి.
వివిధ భాషల్లో తునికి పేర్లు :
అస్సామీస్: కేంజు
ఇంగ్లీష్ : ఇండియన్ ఎబ్నె, కోరమండల్ ఎబ్నె, బ్లాక్ ఎబ్నె
ఒరియా: కుంజు కన్నడ: అబ్నాసి, బలాయి,
తూప్ర, తుపుర, తుంబురుసు, మల్లాలత
తమిళం : కరై, కురుజుంచి, తుంబి
తెలుగు: బీడీ ఆకు, తుమికి, టుకి, మంచి తునికి, తునికి
బెంగాలి : కండీ, కేంజు సంస్కృతం : దీర్ఘ పత్రిక
హిందీ : టెండు
పూత: మార్చ్ – ఏప్రిల్
పండ్లు: మరుసటి సంవత్సరం ఏప్రిల్ – జూన్ మధ్య.
English Name: East India Ebony/Coromandal Ebony Persimon
శాస్త్రీయ నామం: డైయోస్పైరోస్ మెలనో క్జిలాన్
Scientific Name: Diospyros melanoxylon Roxb.
Synonym (s): Diospyros tomentosa var.tupru (Buch.&Hum.) A.DC.
Diospyros tupru Buch.&Ham.
Family: Ebenaceae
కుటుంబం: ఎబెనేసి
డాక్టర్ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,
ఐసీఏఆర్ – ఐఐఓఆర్,
రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924


