చిన్నారికి పట్టేందుకు సరిపడా పాలు తల్లికి పడనప్పుడుగానీ లేదా ఏవైనా అనారోగ్య కారణాలతో తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వలేనప్పుడు చిన్నారికి పోతపాలు పట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమంది గేదెపాల వంటివి ఇస్తుండగా... ఇటీవల చాలామంది ఫార్మూలా పాలపై ఆధారపడుతుంటారు.
అయితే చిన్నారులు ఆ ఫార్మూలా పాలను ఇష్టంగా తాగేందుకు వాటిల్లో చక్కెర మోతాదులను ఎక్కువగా ఉండేలా చూస్తున్నారన్న వాదనలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మూలా పాలపొడిలా చక్కెరల నియంత్రణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పోతపాల రూపంలో ఇచ్చే ఆ ఫార్మూలా పాలలో ఎలాంటి చక్కెరలు కలుపుతుంటారు, వాటి నియంత్రణ విషయంలో ఏం చేయాలనే అనేక అంశాలను చూద్దాం.
పోతపాల్లో ముఖ్యంగా మార్కెట్‌లో దొరికే ఫార్ములా పాలను చాలామంది వాడుతుంటారు. వాటితో పాటు మరికొందరు ఆవు లేదా గేదె పాలు పట్టిస్తుంటారు. ఫార్ములా పాలు పౌడర్ రూపంలో వస్తాయి. వాటికి నీళ్లు కలపాలి. అలాగే ఆవు పాలు కాస్తంత పలుచగా ఉంటాయిగానీ గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి. అంత చిక్కటి పాలు పట్టడం వల్ల బిడ్డకు అవి అరగడంలో సమస్య రావచ్చు. ఈ కారణాలతో పాటు ఫార్ములా పాలను పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు హైజీనిక్ వాతావరణంలో తయారు చేస్తారనే అభిప్రాయంతో ఫార్ములా పాలవైపే చాలామంది మొగ్గుచూపుతుంటారు. నిజానికి ఈ ఫార్ములా పాల కంటే తల్లిపాలే అన్నివిధాలా శ్రేష్ఠం.
ఒక కేస్ స్టడీ : సరిపడినన్ని పాలు పడని ఓ తల్లి ఇప్పుడు తన నాలుగు నెలల పాపను ఎత్తుకుని ఓ సూపర్‌మార్కెట్‌లోని పాలపొడుల షెల్ఫ్ దగ్గర ఫార్ములా పాల కోసం వెదుకుతోంది. ఆ మార్కెట్‌లో చిన్నారులకు పట్టే రకరకాల ఆహారాలతో పాటు పలు రకాల పాల పొడి ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. వాటిని పట్టించడం వల్ల బిడ్డ ఎముకలు బలంగా పెరుగుతాయని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని, బరువు సరిగ్గా పెరుగుతుందని రకరకాల ప్రకటనలు ఉన్నాయి. తొలిసారి తల్లి అయి, తన దగ్గర తగినన్ని పాలు లేని ఆ తల్లివంటి వారిని ఈ ప్రచారాలు అయోమయంలో ముంచెత్తుతుంటాయి. ఏ రకమైన పాలను ఎంపిక చేసుకోవాలో తెలియక ఆందోళనలోనూ పడేస్తుంటాయి.
ఏదైనా పాల పొడి ΄పాకెట్‌ను వెనక్కి తిప్పి, అందులో ఏమేం పదార్థాలు (ఇన్‌గ్రేడియెంట్స్) కలిపారో చదవడం మొదలు పెడితే కొన్ని పేర్లు ఆ తల్లికి అర్థమే కాకపోవచ్చు. కాకపోతే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ వంటి పదజాలంపై అవగాహన ఉన్నప్పుడు అందులో చాలా రకాల చక్కెరలు కలిపినట్లు స్పష్టమవుతుంది. సోయా మిల్క్ ఫార్ములాలో లాక్టోజ్ తక్కువగా ఉన్నప్పటికీ... నిజానికి చాలా రకాల ఫార్మూలా పాలలో చక్కెర మోతాదులు చాలా ఎక్కువగా ఉంటాయన్న అభి్ర΄ాయాన్ని చాలామందిలో వెలిబుచ్చుతుంటారు.
గత నెలలో (నిర్దిష్టంగా చెప్పాలంటే అక్టోబర్ 16న) భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా – ఎప్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఒక ప్రతిపాదనను వెలువరించింది. ఆరు నెలలలోపు చిన్నారుల ఆహారంలో అదనంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ అనే చక్కెరలను కలపడాన్ని నిషేధించాలని ఈ ప్రతిపాదనలో పేర్కొంది. ఇది అమల్లోకి వస్తే పాలు అంతగా పడని చాలామంది తల్లులు కొనుగోలు చేసే శిశు ఆహారాల్లో మార్పులు రావచ్చు. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా ఖరారు కాలేదు.
అదనపు చక్కెరలను ఎందుకు కలపకూడదంటున్నారంటే...
నిజానికి చక్కెరలన్నీ ఒక్క లాంటివే కావు. కాక΄ోతే... శాస్త్రీయంగా చూసినప్పుడు కార్బోహైడ్రేట్లన్నీ చక్కెరలే అని చెప్పవచ్చు. తల్లి పాలలో ప్రధానంగా ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోస్ అనేది కూడా ఒక రకమైన చక్కెరే. అయితే, అది చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరం.
కానీ, ఫార్ములా పాల పౌడర్లలో అదనంగా కలిపే సుక్రోజ్, ఫ్రక్టోజ్ విషయంలోనే చాలామంది నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే... ఆరు నెలలలోపు చిన్నారులకు ఈ చక్కెరలను అదనంగా ఇవ్వడాన్ని చిన్నపిల్లల డాక్టర్లు, ఆహార నిపుణులు సిఫార్సు చేయడం లేదు. ఎందుకంటే ఇవి శరీరానికి కేలరీలను అందిస్తాయి కానీ, ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలను అందించవు అనేది ఆ నిపుణుల మాట. అందుకే ఆ చక్కెరల గురించి వివరిస్తూ వాటిని ‘ఎంప్టీ క్యాలరీస్’గా నిపుణులు అభివర్ణిస్తుంటారు.
పోతపాలతో నష్టాలేమిటంటే...
నిజానికి పేగుల్లో ఉండే బ్యాక్టీరియా అనేది అందరి వ్యాధి నిరోధక వ్యవస్థలో కీలకమైన భూమిక పోషిస్తుంటుంది. పెద్దల విషయంలోనే కాదు... పిల్లల వ్యాధి నిరోధక వ్యవస్థకూ ఈ గట్ బ్యాక్టీరియా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసే కణాల్లో దాదాపు 70–80 శాతం పేగుల్లోనే ఉంటాయి.
అందుకే చిన్నారుల పేగులు దేహ రక్షణ వ్యవస్థలో కీలకమైన ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ విషయాన్ని ఇంకా లోతుగా పరిశీలించినప్పుడు ‘బైఫిడో బ్యాక్టీరియా’ అనే మేలు చేసే మంచి బ్యాక్టీరియా (గుడ్ బ్యాక్టీరియా) చాలా కీలకమైనది. తల్లిపాలు తాగే పిల్లల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పాలలోని లాక్టోస్ చక్కెరను ఉపయోగించుకుని బాగా పెరుగుతుంది.
ఒకవేళ పాల పొడిలో లాక్టోస్‌కు బదులుగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరలు కలిసినప్పుడు... చిన్నారుల పేగుల్లో ఉండే ఈ మంచి బ్యాక్టీరియా సమతౌల్యత దెబ్బతినే అవకాశం ఉందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా సమతౌల్యత దెబ్బతినడం వల్ల చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు పాపయిలకు తల్లిపాలే అత్యుత్తమ ఆహారం. కాక΄ోతే... ఇక తల్లి దగ్గర తగినన్ని పాలు దొరకనప్పుడు ఇలా ఫార్మూలా పోతపాల వైపు మళ్లక తప్పదు. ఇలాంటప్పుడే చిన్నారుల ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు... తీపి అంటే అందరికీ ఇష్టమే. ఇక పుట్టుకతోనే చిన్నారులకు ఈ తీపి రుచి పట్ల ఆకర్షణ ఉండటమూ, ఫార్ములా పాలలో ఉండే ఈ అదనపు చక్కెరల పట్ల చిన్ననాటి నుంచే బాగా ఇష్టం ఏర్పడటం వల్ల మున్ముందు పెద్దయ్యాక కూడా ఆ పిల్లలు తీపి పదార్థాల పట్ల మరింత ఇష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
దీనిని ‘ఫ్లేవర్ ప్రోగ్రామింగ్’ అంటారు. అంటే, చిన్న వయసులో పదేపదే ఒక రకమైన రుచిని పరిచయం చేయడం వల్ల, భవిష్యత్తులో ఆ రుచే ఇష్టమైనదిగా మారుతుంది. జీవితంలో మొదటి నెలల్లో తీపి ఎక్కువగా ఇచ్చిన పిల్లలకు రెండేళ్ల వయసులోనూ వాటిపై ఎక్కువ ఇష్టం కనిపించినట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. అలాగే, చిన్నప్పుడు తీయ్యని ద్రవాలు తాగిన పిల్లలు 6 నుంచి 10 ఏళ్ల వయసులో కూడా ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలను ఇష్టపడినట్లు మరో అధ్యయనం సూచించింది.
ఒక అధ్యయనంలో, మొక్కజొన్న సిరప్ కలిపిన పాల ఆహారాలు తీసుకున్న పిల్లలు 12–24 నెలల వయసులో ఆహారం విషయంలో ఎక్కువ మారాం చేసినట్లు, తినడానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు గుర్తించారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఈ సమస్యలు తక్కువగా కనిపించాయి. అయితే, ఈ పరిశోధనలకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ‘చాలా అధ్యయనాలు 6 నుంచి 24 నెలల వయసున్న పిల్లలపైనే జరిగాయి. ఆరు నెలలలోపు చిన్నారుల విషయంలో నేరుగా ఆధారాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి’ అనేది నిపుణుల మాట.
వివిధ దేశాల్లో అదనపు చక్కెరలపై నియంత్రణలిలా...
కెనడా: పాల పొడులను మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు 90 రోజుల పాటు సమీక్షిస్తారు. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను పాల పొడిలో అనుమతించరు. అయితే, లాక్టోస్ లేని పాల పొడులు, సోయా ఆధారిత పాల పొడుల్లో కార్న్ సిరప్ సాలిడ్స్, మాల్టోడెక్స వాడటానికి అనుమతి ఉంది.
అమెరికా: పిల్లలకు ఇచ్చే అన్ని రకాల పాల పొడుల్లో అదనపు చక్కెరలను నిషేధించే సాధారణ నిబంధన లేదు.
యూరోపియన్ యూనియన్ : కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్ ఆధారిత పాల పొడుల్లో మాత్రమే సుక్రోజ్‌ను అనుమతిస్తారు. అది మొత్తం కార్బోహైడ్రేట్లలో 20 శాతానికి మించకూడదు. ఫ్రక్టోజ్‌ను అనుమతించే పదార్థాల జాబితాలో చేర్చలేదు.
చివరగా... నిపుణుల మాట ఏమిటంటే... శాస్త్రీయంగా చూసినప్పుడు కార్బోహైడ్రేట్లన్నీ చక్కెరలే. అయితే పాలలో కలిపే చక్కెర లాక్టోస్. చిన్నారి సరిగ్గా ఎదగడానికి అది అవసరమే. అయితే, ఆరు నెలలలోపు చిన్నపిల్లలకు పాలలో అదనంగా కలిపే సుక్రోజ్, ఫ్రక్టోజ్ శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు లేకుండానే అదనపు క్యాలరీలను అందిస్తాయి.
ఈ అదనపు క్యాలరీల వల్ల ఊబకాయం... దాంతో భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్యాలూ, ఆరోగ్య సమస్యలూ, డయాబెటిస్ వంటివి త్వరగా రావడం వంటి ఇబ్బందులు ఉన్నందున ఫార్ములా మిల్క్ ఇచ్చే తల్లిదండ్రులు అందులోని అదనపు చక్కెరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఇబ్బందులేవీ రాకూడదనుకంటే... మరీ తప్పనప్పుడు తప్ప... వీలైనంతవరకు తల్లిపాలనే బిడ్డకు ఇవ్వడం మంచిదని తల్లులందరూ గుర్తించాలన్నది వైద్య నిపుణుల మాట.
తల్లికి స్వాభావికంగానే పాలు పడేందుకు తాజా ఆకుకూరలూ, కూరగాయలు, పండ్లు వంటి వాటితో సమతులాహారం ఇవ్వాలి. ఇంట్లోని కొంతమంది పెద్దవాళ్లు ఆకుకూరలూ, పండ్లు వంటి వాటితో చిన్నారికి జలుబు చేస్తుందంటూ వాటిని తిననివ్వకుండా కఠిన పథ్యం పాటించాలని చెబుతుంటారు. పచ్చళ్లు పెడుతుంటారు. అది సరికాదు. మంచి సమతులాహారంతో ఇస్తూ, దాంతో పాటు కంటినిండా తగినంత నిద్ర, ఒత్తిడికి లోనుకాకుండా హాయిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చూస్తే... బిడ్డకు తగినన్ని పాలు తల్లికే పడతాయని గుర్తుంచుకోవాలి.
ఫార్ములా పాలతో ఇవీ ఇబ్బందులు...
పోతపాలు పట్టాల్సిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నిజానికి డాక్టర్లు ఆయా ఫార్ములా పాలను సూచించాలి. అయితే చాలామంది మార్కెట్‌లో దొరికే వాటిల్లో ఏదో ఒక పాల పౌడర్‌ను ఎంపిక చేసుకుని, ఆ పౌడర్‌లో నీళ్లు కలిపి పాలరూపంలో పట్టిస్తుంటారు. ఈ తరహా పాల వల్ల కొందరు పిల్లలకు చాలా త్వరగా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి హై΄ోర్లెజెనిక్ ఫార్ములా పాలను సిఫార్సు చేస్తారు. ఈ తరహా పాలు అలర్జీ రాకుండా చూడటంతోపాటు రోగనిరోధక
శక్తిని పెంచుతాయి గానీ వీటి ఖరీదు ఎక్కువ.
పోతపాలు ఇచ్చేటప్పుడు వాటి ద్వారా తగినన్ని పోషకాలు అందకపోతే శిశువుల్లో రోగనిరోధక శక్తి తక్కువై త్వరగా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉండవచ్చు. అందుకని పోతపాలు పట్టే తల్లులకు ఈ విషయంలో సరైన అవగాహన ఉండాలి. నిజానికి బిడ్డ ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్ సూచించిన ఫార్ములా పౌడర్‌ను ఔన్స్‌కి 30ఎం.ఎల్ నీళ్లను గానీ లేదా డాక్టరు సూచించిన విధంగా గానీ కలపాలి. శుభ్రపరిచిన కప్పు, స్పూన్ ద్వారా లేదా గోకర్ణం లేదా బాటిల్‌తో పాలు పట్టవచ్చు. వీటిని రోజుకు 6 నుంచి 8 సార్లు పట్టాల్సి ఉంటుంది.
నిపుణుల్లో ఆందోళన ఎందుకంటే...
చక్కెరలు ఎక్కువగా కలిపిన ఆ ఫార్మూలా పాలకు అలవాటు పడ్డ చిన్నారులు మిగతా ఆరోగ్యకరమైన ΄ాలకూ... తల్లి దగ్గర్నుంచి అరకొరగా వచ్చే పాల పట్ల విముఖత చూపవచ్చు. ఇలా తీపి ఎక్కువగా ఉండే ఫార్ములా పాలు, ఇలాంటి పానీయాలకు అలవాటు పడ్డ చిన్నపాపలు... ఇక పోషకాలు ఎక్కువగా ఉండే పాలు తీసుకోవడం బాగా తగ్గించి, వాటిని తాగడానికి విముఖంగా ఉంటే... చిన్నారులకు అందాల్సిన ఆరోగ్యకరమైన పోషకాలు తగ్గిపోతాయి.
దాంతో... ఎముకలు, ఇతర శరీర కణజాలాలు ఎదగడానికి అవసరమైన పోషకాలూ పరోక్షంగా తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి పిల్లల ఆరోగ్యం కోసం ఆ తీపి చక్కెరలు అవసరం లేదు. ఈ నేపథ్యంలో అవసరానికి మించి క్యాలరీలు అందడం వల్ల ఆ అదనపు క్యాలరీలతో చిన్నారులకు నష్టమే తప్ప లాభం ఉండదన్నది నిపుణుల వాదన.
పాలపొడిలో ప్రోటీన్లు ఎంత ఉండాలి?
చిన్నారుల పాల పొడిలో ప్రోటీన్ల పరిమాణం ఎంత ఉండాలన్న అంశంపై కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా – ఎప్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్చిస్తోంది. తల్లిపాలలో ‘వే’ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తల్లి పాలు పూర్తిగా ఏర్పడిన దశలో ప్రతి 100 మిల్లీలీటర్లలో సుమారు 0.8–1.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ పాలలో ఆ ప్రోటీన్‌మోతాదు క్రమంగా తగ్గుతుంది.పాల పొడిలో మాత్రం తల్లిపాలతో పోలిస్తే ప్రోటీన్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆవుపాలలో ఉండే ప్రోటీన్‌ను బిడ్డ శరీరం తల్లిపాలలోని ప్రోటీన్ మాదిరిగానే ఉపయోగించుకోలేదు. ఫలితంగా ఇలా పాల పొడిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే, చిన్నారులు తమ తొలిదశలో వేగంగా బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీనినే ‘ఎర్లీ ప్రోటీన్ హై΄ోథెసిస్’ అంటారు.
ఇలా చిన్నారులకు అవసరానికి మించి ప్రోటీన్ అందితే, వారు వేగంగా బరువు పెరగవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో చిన్నపిల్లల దశలో అధిక బరువు, ఊబకాయం వచ్చే ముప్పు కూడా పెరగవచ్చు. దీనికి ప్రధాన ఆధారం యూరప్‌లో నిర్వహించిన ‘యూరోపియన్ చైల్డ్‌హుడ్ ఒబేసిటీ ట్రయల్’ అనే అధ్యయనం. ఈ అధ్యయనంలో పాల పొడిలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా, తక్కువగా ఉన్న రెండు రకాల ఆహారాలను శిశువులకు ఇచ్చారు. ఆరేళ్ల వయసులో ప్రోటీన్ ఎక్కువగా ఉన్న పాల పొడి తీసుకున్న పిల్లల్లో బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉండటంతోపాటు ఊబకాయం వచ్చే అవకాశం 2.43 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ విడుదలను పెంచే కొన్ని అమైనో యాసిడ్స్, శరీరం (దేహం) పెరుగుదలకు తోడ్పడే ఐజీఎఫ్–1 అనే హార్మోన్ ఎక్కువగా విడుదల కావచ్చు. దీనివల్ల వేగంగా బరువు పెరగడంతో పాటు, శరీరంలో కొవ్వు పేరుకు΄ోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.
పాల పొడిలోని ప్రోటీన్ మోతాదు ఒక్కటే పిల్లల ఎదుగుదలను నిర్ణయించదు. పసిబిడ్డలకు ఎంత పరిమాణంలో పాలు తాగిస్తున్నారు, పిల్లల ఆకలి గుర్తించి తినిపిస్తున్నారా, తల్లిదండ్రుల బరువు, పిల్లల నిద్ర, కుటుంబ పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అవసరానికి మించి కాకుండా... కేవలం పిల్లల సాధారణ ఎదుగుదలకు అవసరమైన నాణ్యమై ప్రోటీన్‌ను, సరైన పరిమాణంలో అందించడమే అందరి లక్ష్యం కావాలి.
చక్కెరలు పెద్దమొత్తంలో వద్దు అనేదే నిపుణుల సూచన...
తల్లిదండ్రులకు వైద్యనిపుణుల సూచన ఏమిటంటే... మొదటి ఆరు నెలల పాటు శిశువులకు అదనపు చక్కెరలు, తీపి నీళ్లు ఇవ్వడం అంత సరికాదు. ఆరు నెలల తర్వాత ఘన ఆహారాలు ప్రారంభించినప్పుడు వివిధ రకాల కూరగాయలను పిల్లలు మాటిమాటికీ తీసుకునేలా వారికి పరిచయం చేయాలి. ఎందుకంటే, ఒక రుచిని తరచూ తినడం వల్ల దానిపైనే ఇష్టం పెరుగుతుంది. దాంతో మిగతా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోడానికి చిన్నారులు విముఖత ప్రదర్శించవచ్చు. ఫలితంగా మిగతా ఆహారాలు అంతగా తీసుకోని కారణంగా వాళ్లలో ΄ోషకాహార లో΄ాలు రావడం, వ్యాధినిరోధకత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.
డాక్టర్ శివ నారాయణ రెడ్డి, సీనియర్ పీడియాట్రీషియన్, నియోనేటాలజిస్ట్
నిర్వహణ యాసీన్
ఇదీ చదవండి: ఆకలిని జయించిన పట్టుదల..నిరాహారంగానే చార్‌ధామ్ యాత్ర!


