సాహసికులు లేదా సైకోపతిక్ వ్యక్తుల్లో ఆందోళనకు బదులు అమితోత్సాహం
తమకేమీ కాదని.. దేనినైనా ఎదుర్కొని గెలవగలమనే భావనే కీలకం
కెనడా పరిశోధకుల తాజా అధ్యయనంలోవెల్లడి
సాక్షి, హైదరాబాద్: మనలో కొందరు వ్యక్తులు అత్యంత భయంకరమైన హారర్ సినిమాలను ఏమాత్రం భయపడకుండా చూస్తారు.. మరికొందరు రోలర్ కోస్టర్ రైడ్స్‌ను ఎంతగానో ఆస్వాదిస్తారు. సైన్స్, సైకాలజీ భాషలో రిక్రియేషనల్ ఫియర్ పిలిచే ఈ భయం సురక్షితమైన పరిమితుల్లో ఉన్నప్పుడు అది కొందరిలో మెదడుకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే సాధనంగా మారుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
సైకోపతి అండ్ ఫియర్ ఎంజాయ్‌మెంట్: ది రోల్ ఆఫ్ ఇన్విన్సిబిలిటీ అండ్ బోర్డమ్ ప్రోన్నెస్ పేరిట నిర్వహించిన సరికొత్త అధ్యయనంలోఅనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కెనడాలోని బ్రాక్ యూనివర్సిటీకి చెందిన ఫోరెన్సిక్ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏంజెలా బుక్ నేతృత్వంలో ఆమె సహ–పరిశోధకులు బెత్ విస్సర్, తోరి వట్టం, కిర్క్‌లాండ్ జాన్‌స్టన్‌లతో కలిసి ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన వ్యాసం అంతర్జాతీయ సైకాలజీ జర్నల్ అయిన సైకలాజికల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైంది.
ముఖ్యమైన అంశాలు..
సాధారణంగా భయం అనేది మనుషులను ప్రమాదాల నుంచి దూరంగా ఉంచడానికి ఉపయోగపడే ఒక హెచ్చరిక. కానీ కొందరిలో ఇది ఎందుకు ఓ రకమైన ఆనందాన్ని ఇస్తుందనే అంశాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు.
ఈ పరిశీలనలో 1,650 మందికిపైగా వాలంటీర్లపై రెండు ప్రయోగాలు చేశారు. వారికి రోలర్ కోస్టర్ రైడ్స్, అత్యంత భయంకరమైన హారర్ వీడియో గేమ్ క్లిప్‌లను చూపించి వారి మానసిక, శారీరక స్పందనలను నమోదు చేశారు.
ఏం తేలింది?
సాహస లక్షణాలు లేదా సైకోపతిక్ గుణాలు ఎక్కువగా ఉండే వ్యక్తులు భయానక వాతావరణంలో ఉన్నప్పుడు ఆందోళనకు గురికావడానికి బదులు, ఎక్కువ ఉత్సాహాన్ని పొందుతారు. దీనికి వారు బోర్ ఫీల్ కావడం ప్రధాన కారణం కాదని.. తమకు ఏమీ కాదనే భావన, వారి మెదడులోని డోపమైన్ రివార్డ్ సిస్టమ్ అత్యంత బలంగా ప్రేరేపణకు గురవడమే కారణమని ఈ అధ్యయనం నిర్ధారించింది.
దీనిప్రకారం తీవ్రమైన సైకోపతిక్ లక్షణాలు లేదా ఎక్కువ సాహస గుణాలున్న వ్యక్తులు భయానక పరిస్థితులను ఎక్కువగా ఆస్వాదిస్తారు. దీనికి కారణం వారిలో ఉండే ‘నాకేం కాదు.. నేను దేనినైనా ఎదుర్కొని గెలవగలను’అనే భావనే వారిని నిలబెడుతుంది.
వారు ప్రమాదకరమైన లేదా భయానక దృశ్యాలను చూసినప్పుడు ఆందోళనపడటానికి బదులుగా ఆ పరిస్థితిని ఒక సవాల్‌గా లేదా ఉత్సాహంగా భావిస్తారని తేలింది.
భయం ఆస్వాదనకుగల శాస్త్రీయ కారణాలు...
మనం భయపడినప్పుడు మెదడులోని అమిగ్డాలా అనే భాగం అప్రమత్తమై శరీరాన్ని ఎదురుతిరుగు లేదా పారిపో అనే స్థితికి తీసుకెళ్తుంది.
ఈ సమయంలో అడ్రినలిన్, కారి్టసాల్ గుండె వేగాన్ని పెంచి శరీరానికి విపరీతమైన శక్తిని ఇస్తాయి.
భయం కలిగిన వెంటనే మెదడులో డోపమైన్ వంటి ఫీల్–గుడ్ రసాయనాలు విడుదలవుతాయి.
కొందరి మెదడులో డోపమైన్‌ను నియంత్రించే ‘బ్రేకులు’తక్కువగా ఉండటం వల్ల వారు ఈ కిక్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.
సురక్షితమైన వాతావరణం...
మనం థియేటర్‌లో హారర్ సినిమా చూస్తున్నప్పుడు మెదడులోని హిప్పోకాంపస్, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగాలు ‘స్క్రీన్ మీద ఉన్నది మాత్రమే భయం, నిజానికి మనం సేఫ్ రూమ్‌లో ఉన్నాం’అనే విషయాన్ని గ్రహిస్తాయి. దీంతో ప్రమాదం నిజం కాదని తెలిసినప్పుడు ఆ భయం కాస్తా థ్రిల్‌గా, వినోదంగా మారుతుంది.
మానసిక బలం...
ఈ పరిశోధనల ప్రకారం ఇలాంటి వినోదాత్మక భయాలను ఆస్వాదించే వ్యక్తుల్లో నిజజీవితంలోని ఒత్తిళ్లను తట్టుకొనే మానసిక శక్తి ఎక్కువగా ఉంటుంది. భయా న్ని ముందే ప్రాక్టీస్ చేయడం వల్ల అనిశి్చత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మెదడుకు అలవాటవుతుంది.
ఇదీ చదవండి: రంపాలు మొలుస్తాయి


