శాటిలైట్ డేటాతో స్వయంచాలక పరిహారం.. ఆఫ్రికాలో 2.4 కోట్ల రైతులకు భరోసా
దరఖాస్తులు లేవు.. ఆలస్యం లేదు.. క్లెయిమ్ నేరుగా ఖాతాలోకే!
చిన్నకారు రైతుల పెట్టుబడులకు ఏఐతో బీమా రక్షణ కల్పిస్తున్న స్టార్టప్ ‘పులా’
పర్యావరణ నోబెల్ ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ రేసులో వినూత్న అగ్రి–టెక్ మోడల్
ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తిలో చిన్నకారు రైతులే అత్యంత కీలక భాగస్వాములు. అయితే, అకాల వర్షాలు, తీవ్ర కరువు, ఆకస్మిక వరదలు వంటి వాతావరణ మార్పుల ప్రభావం మొదట పడేది వీరిపైనే. ఒక్క పంట నష్టపోయినా రైతులు తీవ్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోవటం లేదా వ్యవసాయాన్నే వదిలిపెట్టటం జరుగుతోంది.
ఈ సంక్షోభానికి ఆఫ్రికాకు చెందిన అగ్రిటెక్ సంస్థ ‘పులా’ వినూత్న పరిష్కారం చూపుతోంది. పర్యావరణ పరిరక్షణ రంగంలో నోబెల్ బహుమతిగా భావించే ప్రతిష్టాత్మక ‘ది ఎర్త్‌షాట్ ప్రైజ్’ పోటీలో ‘ఫిక్స్ అవర్ క్లైమేట్’ విభాగంలో ‘పులా’ ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. నవంబర్‌లో ముంబైలో విజేతలను ప్రకటించనున్నారు.
ఏమిటీ ‘పులా’ వినూత్న మోడల్?
సాధారణంగా వ్యవసాయ బీమా క్లెయిమ్ పొందాలంటే రైతులు వ్యక్తిగతంగా తమ పొలంలో పంటకు జరిగిన నష్టాన్ని నిరూపించుకోవాలి. ఇందుకు నెలల తరబడి సమయం పడుతుంది. అయితే ‘పులా’ సంస్థ ‘ఏరియా ఈల్డ్ ఇండెక్స్ ఇన్సూరె¯Œన్స్’ విధానాన్ని తీసుకొచి్చంది. ఇందులో శాటిలైట్ సమాచారం, క్షేత్రస్థాయి కృత్రిమ మేధ డేటాను విశ్లేíÙంచి ప్రాంతాల వారీగా పంట దిగుబడిని అంచనా వేస్తారు. నిర్దేశిత పరిమితి కంటే పంట దిగుబడి తగ్గితే, ఆ ప్రాంతంలోని బీమా చేయించుకున్న రైతులకు ఎటువంటి దరఖాస్తులు లేకుండానే నేరుగా పరిహారం అందుతుంది.
ధైర్యంగా తిరిగి సేద్యానికి 87% రైతులు
రైతులు ప్రత్యేకంగా బీమా కోసం తిరగాల్సిన అవసరం లేకుండా ‘పులా’ జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు, బ్యాంకు పంట రుణాలతోనే ఈ బీమాను నేరుగా అనుసంధానించింది. పంట నష్టపోయిన వెంటనే పరిహారం చేతికందటం వల్ల రైతులు మళ్లీ తదుపరి పంటను ఎలాంటి ఆర్థిక ఆటంకం లేకుండా సాగు చేయగలుగుతున్నారు.
కెన్యా కేంద్రంగా పనిచేస్తున్న ‘పులా’.. ప్రస్తుతం ఎనిమిది ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలతో, 100కు పైగా భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఇప్పటివరకు 2.4 కోట్ల మంది రైతులకు చేరువకావడమే కాకుండా, దాదాపు 2.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 23,380 కోట్ల) వ్యవసాయ పెట్టుబడులకు రక్షణ కల్పించింది. రైతులకు ప్రత్యక్షంగా 136.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,140 కోట్ల) పరిహారాన్ని ఖాతాల్లో జమ చేసింది. ‘పులా’ సర్వేల ప్రకారం, బీమా పొందిన రైతుల్లో దాదాపు 87 శాతం మంది తిరిగి వ్యవసాయంలో ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారు.
నష్టం తాత్కాలిక అవరోధం మాత్రమే
కేవలం బీమాకే పరిమితం కాకుండా, రైతుల పంట ఉత్ప త్తి డేటా ఆధారంగా వారికి అధికారిక ఆర్థిక గుర్తింపు, తక్కువ వడ్డీకే రుణాలు, విద్య–వైద్య సేవలు లభించేలా డిజిటల్ వ్యవస్థను నిర్మించటం ‘పులా’ ప్రత్యేకత. ‘వాతావరణ సంక్షోభం అనేది రైతుల జీవితాన్ని అంతం చేసేది గా కాకుండా, కేవలం ఒక తాత్కాలిక అవరోధంగా మా త్రమే మిగిలేలా చేయటమే మా లక్ష్యం. 2030 నాటికి 10 కోట్ల మంది రైతులకు రక్షణ కల్పిస్తాం’అని ‘పులా’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో థామస్ న్జేరు అంటున్నారు.
- సాక్షి, స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా?


