వద్దంటున్నా.. వరి వైపే..! | Farmers Agian Paddy-cultivating | Sakshi
Sakshi News home page

వద్దంటున్నా.. వరి వైపే..!

Nov 2 2026 7:29 AM | Updated on Nov 2 2026 7:29 AM

Farmers Agian Paddy-cultivating

నల్లగొండ అగ్రికల్చర్‌ : ఎల్‌నినో నేపథ్యంలో యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సాధ్యమైనంత వరకు క్రాప్‌ హాలిడే ప్రకటించడమే మంచిదని సూచించింది. సాగునీరు అందుబాటులో ఉన్న రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని పేర్కొంది. రైతులు సాగు చేసుకున్న పంటలు ఎండిపోతే తమదే బాధ్యత అంటూ వ్యవసాయ అధికారులకు హామీ పత్రం రాసివ్వాలని ప్రకటించింది. కానీ, యాసంగిలో రైతులు వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు ఎంత చెప్పినా.. రైతులు ఇప్పటికే పొలాలను దున్నుకోవడంతో పాటు వరి నార్లు పోసుకుంటున్నారు. 

ఓ వైపు కోతలు.. మరోవైపు యాసంగి సాగు
జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు ధాన్యాన్ని మిల్లులు, కొనుగోలు కేంద్రాలకు తరలించడంతో పాటు యాసంగి వరి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికి వందల ఎకరాల్లో దుక్కులను దున్నుకుని నార్లు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయవద్దని విద్యుత్‌ కొరతో పాటు సాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించా రైతులు మాత్రం తమ బోరుబావుల్లో సరిపడా నీరు ఉందనే ధీమాతో సాగుకు సన్నద్ధమవుతున్నారు. నాటు వేశాక వాతావరణ పరిస్థితులు రైతులకు అనుకూలంగా ఉంటాయో లేదో అనే అనుమానాన్ని వ్యవసాయ శాఖ వ్యక్తం చేస్తోంది.

ఆరుతడి పంటలు వేసుకోవాలి..
రైతులు వరి సాగుకు బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలి. వరి సాగు చేసుకుంటే రానున్న రోజుల్లో విద్యుత్‌ కొరతతో పాటు సాగునీటి ఇబ్బందులు ఏర్పడి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 
– వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement