జీఎస్టీ.. ‘వ్యాట్‌’ ఏ వసూల్‌! | GST collections grow in October: Telangana | Sakshi
Sakshi News home page

జీఎస్టీ.. ‘వ్యాట్‌’ ఏ వసూల్‌!

Nov 2 2026 5:37 AM | Updated on Nov 2 2026 5:37 AM

GST collections grow in October: Telangana

రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో స్థిర వృద్ధి

గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ అక్టోబర్‌లో రూ. 1,402 కోట్లు అదనం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పన్నుల వసూళ్లు స్థిరమైన వృద్ధితో ముందుకు సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఎస్టీ వసూళ్లకు సంబంధించిన లెక్కల ప్రకారం ఆదాయం 17 శాతం వృద్ధి సాధిస్తోందని స్పష్టం అవుతోంది. జీఎస్టీ, వ్యాట్‌ వసూళ్లలో బలమైన వృద్ధి రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. పన్నుల వసూళ్లలో తెలంగాణ జోరును ప్రదర్శిస్తోంది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 17 శాతం మేర వృద్ధిని సాధించగా, పెట్రోలియం, మద్యంపై వసూలయ్యే వ్యాట్‌ ఆదాయం ఏకంగా 31 శాతం వరకు అధికంగా నమోదు కావడం గమనార్హం. గత సంవత్సరం అక్టోబర్‌ మాసంతో పోలిస్తే.. ఈ అక్టోబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 3,914 కోట్ల నుంచి రూ. 4,593 కోట్లకు ఎగబాకింది. అదనంగా ఈసారి ఆదాయం రూ. 679 కోట్లు పెరిగింది

 మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరగడంతో ఈ విభాగం కింద ఏకంగా 31 శాతం వృద్ధి సాధించడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌లో వ్యాట్‌ కింద రూ.2,342 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ.3,065 కోట్లకు పెరిగింది. అంటే రూ. 723 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వ్యాట్‌ రూపంలో గతేడాదితో పోలిస్తే అదనంగా రూ. 7,500 కోట్ల అదనపు ఆదాయం సమకూరడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వ్యాట్‌ రూపంలో అక్టోబర్‌ వరకు రూ. 44,023 కోట్ల ఆదాయం సమకూరితే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 51,563 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.

ఆదాయ వృద్ధికి దోహదపడుతున్న ప్రధాన రంగాల్లో సేవా, ఐటీ రంగాలు కీలకం. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఐటీ, ఐటీఈఎస్‌ మరియు కార్పొరేట్‌ సర్వీసెస్‌ రంగాలు రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు, డిజిటల్‌ సేవలు మరియు ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ నుంచి వస్తున్న పన్ను ఆదాయం స్థిరంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ క్లస్టర్లలో తయారీ రంగం ఊపందుకోవడం, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, మరియు ఆటోమొబైల్‌ విడిభాగాల పరిశ్రమల నుంచి వచ్చే దేశీయ లావాదేవీల పన్నులు గణనీయంగా వృద్ధి చెందాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement