ఈనెలా వర్షాభావమే! | Telangana Experiences 86 percent Rainfall Deficit in October | Sakshi
Sakshi News home page

ఈనెలా వర్షాభావమే!

Nov 2 2026 5:32 AM | Updated on Nov 2 2026 5:32 AM

Telangana Experiences 86 percent Rainfall Deficit in October

ఆర్నెల్లుగా వరుస వర్షపాత లోటు నమోదు 

అక్టోబర్‌లో 86శాతం లోటు వర్షపాతం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నైరుతి సీజన్‌ నుంచి వానల జాడ లేకుండా పోయింది. వరుసగా ఐదు నెలలుగా లోటు వర్షపాతమే నమోదైంది. ఆరో నెల నవంబర్‌లోనూ లోటు వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు నవంబర్‌ నెల అంచనాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో వర్షపాతం అంచనాలు మారే అవకాశం ఉందని, ఈ నెలలో సగటున 1.57సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కనీసం 25 నుంచి 40శాతం లోటు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల సాధారణం కంటే అధిక వర్షాలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా, అక్టోబరులో వర్షాభావం భారీగా కనిపించింది. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో రికార్డు సృష్టించింది. సాధారణంగా అక్టోబర్‌ నెలలో చాలారోజులు చలి తీవ్రత ఉంటుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి జాడ కనిపించలేదు. అక్టోబర్‌ నెలలో సాధారణం కంటే ఏకంగా 86 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా అక్టోబరులో 9.01 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. కేవలం 1.27 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. గతేడాది అక్టోబర్‌లో ఏకంగా 17.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈసారి అక్టోబర్‌ తీవ్ర వర్షాభావ మాసంగా మిగిలింది.

జూన్‌ నుంచి అక్టోబర్‌ చివరి వరకు రాష్ట్రంలో 83.07 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సగటున 62.82 సెంటీమీటర్లే నమోదైంది. అంటే సాధారణం కంటే 20.25 సెంటీమీటర్ల లోటు ఉంది. ఈ లోటు ఖరీఫ్‌ పంటలు, భూగర్భ జలాల రీచార్జి, చెరువుల నీటి నిల్వలపై ప్రభావం చూపే పరిస్థితి నెలకొంది. సాధారణంగా నవంబర్‌ నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడం ప్రారంభమవుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో చలి తక్కువగా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement