breaking news
Rainfall deficit
-
నైరుతి ముఖం చాటేసిందా?
న్యూఢిల్లీ: కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నప్పటికీ వాస్తవంగా చూస్తే దేశవ్యాప్తంగా వర్షపాతం అనుకున్న స్థాయిలో ఉండబోదని కృత్రిమ ఉపగ్రహాల ఛాయాచిత్రాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటికే దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, ఇక విస్తారంగా వర్షాలు కురవడమే తరువాయి భాగమని భారత వాతావరణ శాఖ ఓవైపు చెబుతుంటే అసలు కురవడానికి ఆకాశంలో మేఘాలు కరువయ్యాయని శాటిలైట్ ఫొటోలు విస్మయకర విషయాన్ని బహిర్గతంచేస్తున్నాయి. జూలై 11న(శనివారం) తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం భారత గగనతలంలో 70 నుంచి 80 శాతందాకా మేఘాలు లేనేలేవు. ఆకాశం మేఘావృతమైందనే మాటకు తావేలేదని ఫొటోల్లో స్పష్టమవుతోంది. ఉన్న కొద్దిమేర మేఘాల కారణంగానే పలు రాష్ట్రాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో వర్షం పడిన రెండు,మూడు రోజులకే ఇలా మేఘాలు ముఖం చాటేయడం వెనుక అసలు కారణం ఏమైఉంటుందనే చర్చ భారతీయుల్లో మొదలైంది. ఇందుకు పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం సమాధానం చెబుతోంది. వర్షాలు తగ్గడానికి కారణం? హిందూ సముద్రం మీదుగా తేమతో కూడిన గాలుల తీరుతెన్నులకు అనేవి ఈ సీజన్లో వర్షాలను పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. రుతుపవనాల కారణంగా ఏర్పడే అల్పపీడన అక్షరేఖ సైతం వర్షాలకు మరో కారణంగా నిలుస్తోంది. ఈ అక్షరేఖ వెంటే వర్షాలు ఎక్కువగా కురిసే ఆస్కారముంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై శక్తివంతమైన తుపాను నెలకొంది. ఇది భారత ఉపఖండంపై పరుచుకోవాల్సిన తేమ, వాయుమండల ప్రసరణను దూరంగా నెట్టేస్తోంది. దీంతో అల్పపీడన అక్షరేఖ అనేది బలహీనపడుతోంది. అందుకే దేశవ్యాప్తంగా వర్షాలు పడే సానుకూల వాతావరణం ఏర్పడక వర్షపాత తక్కువగా నమోదవుతోంది. మళ్లీ భారత గగనతలంలో వాయుమండల ప్రసరణ అనుకూల వాతావరణం ఏర్పడేదాకా మరికొద్దిరోజులపాటు మధ్య భారతం, దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా పడే వీలుంది. సవ్యంగా సాగని విస్తరణ రుతుపవనాల విస్తరణ ఈసారి అస్తవ్యస్తంగా సాగింది. సాధారణంగా ఏటా జూలై 8వ తేదీకల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాలి. కానీ ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశం నలుమూలలకూ రుతుపవనాలు అడుగుపెట్టాయి. దీంతో జరగాల్సిన పాక్షిక నష్టం జరిగిపోయింది. ఈసారి జూన్‌లో దాదాపు 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో గత కొన్నాళ్లలో ఇంత తక్కువ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. అయితే జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా పడిన భారీ వర్షాలతో లోటు వర్షపాతం అనేది తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ లోటు కేవలం 14 శాతానికి పరిమితమైంది. అయితే ఇప్పటికీ దేశవ్యాప్తంగా వర్షపాతం అనేది సమస్థాయిలో లేదు. పశ్చిమ భారత, తూర్పు భారత రాష్ట్రాల్లో తగు స్థాయిలో వర్షాలు పడ్డాయిగానీ మధ్యభారతంలో గణనీయస్థాయిలో లోటు వర్షపాతం నమోదైంది. తర్వాత ఏం జరగొచ్చు? దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే జూలై నెలలోనూ వర్షపాతం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే ఆరుశాతం తగ్గుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఎల్‌నినో రోజురోజుకూ బలపడుతుండటంతో ప్రపంచ వాతావరణంలో తీరుతెన్నులు ప్రతికూలంగా మారే ప్రమాదముంది. ఈ ప్రతికూల పరిస్థితి భారత్‌లో వర్షాలను తగ్గించవచ్చు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. వర్షాల మరో విడత మొదలయ్యేదాకా ఉష్ణోగ్రతలు ఇలా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాలు అదృశ్యం కాలేదుగానీ వాటికి బలహీన దశ నడుస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. పసిఫిక్ మహాసముద్రంపై వాతావరణ వ్యవస్థలు బలహీనమయ్యేకొద్దీ భారత ఉపఖండంపై వరుణుడి ప్రేమ పెరుగుతుందని శాస్త్రవేత్తలు సెలవిచ్చారు. -
చినుకు చింత
సాక్షి, హైదరాబాద్ : వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు దాటినా నగర పరిధిలో వర్షపాతం లోటు తీవ్రంగా వేధిస్తోంది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ఈ నెల మొదటి వారం (1 నుంచి 7 వరకు) పొడి వాతావరణమే కొనసాగుతోంది. సాధారణంగా ఈపాటికే చెరువులు, కుంటల్లోకి నీరు రావాల్సింది. ఆకాశం మేఘావృతమవుతున్నా ఆశించిన చినుకు రాలడం లేదు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన తీవ్రమైన ‘ఎల్‌నినో’ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగడం, అనుకూల ‘లానినా’ ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షపాతం లోటు పునరావృతం జూలైలోనూ గత నెల సాధారణ వర్షపాతం లోటు పునరావతమవుతోంది. జూన్ లో నమోదు కావాల్సిన సగటు వర్షపాతంలో దాదాపు 20 నుంచి 45 శాతం భారీ లోటు నమోదైంది. ఆశలన్నీ జూలై నెలపైనే పెట్టుకోగా.. మొదటి వారంలోనూ అదే పరిస్థితి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చిరు జల్లులే కురిశాయి. రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతం కంటే అధికంగానే నమోదైంది. వర్షపాతం లోటుతో జంట జలాశయాల నీటిమట్టం అంతంత మాత్రంగా ఉంది. మూసీ, ఈసీ నదులు ఇంకా పొడిగానే ఉన్నాయి. -
నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయా? మాన్ సూన్ ఎందుకు ఆగింది
-
మోగుతున్న ఎల్ నినో ఘంటికలు
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారతదేశంపై ఉండదని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. పసిఫిక్ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కే దశలోకి ప్రవేశిస్తోంది. పసిఫిక్‌లో వేగంగా బలపడుతున్న ఎల్ నినోను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో, ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. మధ్య పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి ‘నినో 3.4’అనే ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్ఎస్టీ) వరుసగా 16వ రోజు కూడా కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్లైమేట్ రీఅనలైజర్ డేటా ప్రకారం.. నినో 3.4 జోన్లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం గమనార్హం. చరిత్రలోనే అత్యంత ప్రతికూల వాతావరణ ఘటనలలో ఒకటిగా నిలిచిన 2015–16 నాటి సూపర్ ఎల్ నినో’ప్రారంభ దశల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, కానీ, ఈ ప్రాంతం అప్పటికే ఎల్ నినో పరిస్థితులకు సంబంధించిన స్థాయికి చేరుకుంది. పొడి వాతావరణమే పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్ నినో ముఖ్య లక్షణం. ఈ వేడి జలాలు వాతావరణ ప్రసరణ సరళిని మార్చేస్తాయి. భారత ఉపఖండంలో రుతుపవన వర్షపాతానికి సహాయపడే వాకర్ సర్క్యులేషన్‌ను బలహీనపరుస్తాయి. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ.. నేడు అనేక ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయింది. వర్షపాతం తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్షాధార ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వేగాన్ని కోల్పోతున్న రుతుపవనాలు ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన కచ్చితంగా దేశంలో కరువు వస్తుందని చెప్పలేమని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. హిందూ మహాసముద్ర డైపోల్, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలతో సహా ఇతర వాతావరణ కారకాలు కొన్నిసార్లు ఎల్ నినో ప్రభావాలను తగ్గించగలవు. అయితే.. ఈ ఏడాది పసిఫిక్ వేడెక్కే వేగం, తీవ్రత అధికంగా ఉండడంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్ నినో ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శక్తివంతమైన ఎల్ నినో, సాధారణం కంటే తక్కువ స్థాయి రుతుపవనాల గమనంతో కూడిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరవచ్చు. పసిఫిక్ మహాసముద్రం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండగా.. దాని ప్రభావంతో భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలోనే రుతుపవనాలు తమ వేగాన్ని, ప్రభా వాన్ని కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మేఘాల జాడలేదు నైరుతి రుతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించడం పరిపాటి. ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు అసాధారణంగా పలుచగా కనిపిస్తున్నాయి. ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. యూరోపియన్ వాతావరణ ఉపగ్రహం మెటియోశాట్ ఐఓడీసీ, అమెరికాకు చెందిన ఎన్ఓఏఏ వాతావరణ ఉపగ్రహం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఇన్సాట్–3డీఎస్ మంగళవారం తీసిన చిత్రాలను గమనిస్తే మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిగా దర్శనిమిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలో కొన్నిచోట్ల మాత్రమే అక్కడక్కడా పలుచటి మేఘాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా రుతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైన పొడి గాలిని సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాలతో కూడిన ‘రుతుపవన ప్రధాన ప్రాంతం’లో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంచిన ఎల్‌నినో భయాలు
ముంబై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది 11 ఏళ్ల కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నివేదిక వెల్లడితో ట్రేడింగ్ చివర్లో ఫైనాన్స్, చమురు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాకపోవడం, ఎంఎస్సీఐ సూచీ మార్పులు అమలులోకి రావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,092 పాయింట్లు క్షీణించి 74,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 359 పాయింట్లు పతనమై 23,548 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్ ఒకటిన్నర శాతానికిపైగా పతనంతో, ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.77 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ.465 లక్షల కోట్లకు దిగివచి్చంది. లాభాల్లోంచి భారీ నష్టాల్లోకిఅమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు వార్తలతో క్రూడాయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రథమార్థంలో 352 పాయింట్లు పెరిగి 76,220 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 24,003 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్ సెషన్ నుంచి అమ్మకాలతో తలెత్తడంతో పాటు ట్రేడింగ్ చివర్లో అనూహ్య లాభాల స్వీకరణతో సూచీలు లాభాల్లోంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు క్షీణించి 74,589 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు పతనమై 23,4845 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో బీఎస్ఈలో ఆయిల్ అండ్ గ్యాస్ 2.75%, మెటల్ 2.30%, వినిమయ 2.23%, హాస్పిటల్స్ 2.16%, ఇంధన 2.08%, కమోడిటీస్ 1.94%, ఆటో 1.90%, సరీ్వసెస్ 1.58 శాతం పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 1.26%, మిడ్ క్యాప్ ఇండెక్సు 0.73 శాతం నష్టపోయాయి. నాలుగు షేర్లకు మాత్రమే లాభాలు: సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), హెచ్‌సీఎల్‌టెక్ (1.65%), ఎల్అండ్టీ (0.76%), ఇన్ఫోసిస్ (0.05%) మాత్రమే లాభపడ్డాయి. మరోవైపు, అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్( –2.18%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1.81%), ఐసీఐసీఐ బ్యాంక్ (–1.32%), ఎంఅండ్ఎం(–2.72%), బజాజ్ ఫైనాన్స్ (–2.82%) షేర్లు నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ కోల్పోయిన పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 600 పాయింట్లు కావడం విశేషం.నష్టాలు ఎందుకంటేఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువగా, గత 11 ఏళ్ల కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నివేదికలో వెల్లడి కావడం మార్కెట్‌ను నిరాశపరిచింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఆహార ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న ఆందోళనలు అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ 60 రోజులు పొడిగింపు ఒప్పందం కుదిరినా, ట్రంప్ ఆమోదం లభించలేదు. ఇరాన్ యురేనియం నిల్వల అంశంపై స్పష్టత కొరవడడంతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ మేలో 19 సెషన్లలో 14 రోజులు నికర అమ్మకందారులుగా నిలిచి, శుక్రవారం రూ.21,106 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎంఎస్సీఐ సూచీల పునర్వ్యవస్థీకరణ ప్రభావం కనిపించింది. ఎంసీఎక్స్, ఇండియన్ బ్యాంక్ ప్రధాన సూచీలో చేరగా, ఆర్వీఎన్ఎల్, కల్యాణ్ జ్యువెలర్స్‌తో పాటు 12 స్మాల్‌క్యాప్ స్టాక్‌లు వైదొలిగాయి. -
'ఉత్త'రాదే.. కరువు ముప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి సీజన్ వానలు సాధారణ స్థితిలోనే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ స్థితిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. కొన్నిచోట్ల మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వివరించింది. గతేడాది సీజన్‌తో పోలిస్తే తక్కువ వర్షాలు కురుస్తాయని, కానీ ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయని, ఆయా జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. మరింత స్పష్టమైన అంచనాలను వచ్చే నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నైరుతి సీజన్‌కు సంబంధించిన ముందస్తు అంచనాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాల్లో స్పష్టం చేసింది. ఉత్తరాది జిల్లాలకు కరువు ముప్పు!రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాలు కరువు బారిన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదు కావొచ్చని పేర్కొంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రైతులు పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన భగ భగలు..రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మెజార్టీ జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు మరో మూడురోజుల పాటు నమోదైతే వడగాడ్పుల ప్రభావం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సీయస్ అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, నల్లగొండలో 23.6 డిగ్రీ సెల్సీయస్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
ఈ సారి వర్షాలు తక్కువ.. కష్టాలు ఎక్కువ.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. స్కైమెట్ అధికారిక అంచనాను విడుదల చేసి వివరాలు తెలిపింది. గత అనేక సంవత్సరాల సగటు వర్షపాతాన్ని (దీర్ఘకాల సగటు వర్షపాతం)ఎల్పీఏ అంటారు. ఇది సాధారణంగా 868.6 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా.. ఈ సారి అందులో సుమారు 94 శాతం మాత్రమే ఉండొచ్చని స్కైమెట్ అంచనా వేసింది. దీనికి 5 శాతం ఎక్కువ లేదా తక్కువగానూ వర్షాలు పడవచ్చని చెప్పింది. స్కైమెట్ అంచనాలో ముఖ్యాంశాలుమొత్తం వర్షపాతం: ఎల్పీఏలో 90-95%గా ఉండనుంది, అంటే సగటుతో పోలిస్తే తక్కువ వర్షాలు పడతాయి.ఈఎన్ఎస్ఓ ప్రభావం (ఈఎన్ఎస్ఓ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత మార్పులు ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపే వ్యవస్థ): దీర్ఘకాల లా నినా తర్వాత పసిఫిక్ సముద్రం ఈఎన్ఎస్ఓ-న్యూట్రల్ దశకు మారింది. వర్షాకాలం సమయంలో ఎల్ నినో బలపడుతుంది. ఇది ముఖ్యంగా జులై-సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువ పడేలా చేసే అవకాశం ఉంది.భారత మహాసముద్ర ద్విధ్రువం (ఐఓడీ): న్యూట్రల్ లేదా కొంచెం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. జూన్‌లో వర్షాలు బాగా పడడానికి సాయం చేస్తుంది. కానీ, ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తగ్గించలేదు.ప్రాంతాల వారీగామధ్య, వాయవ్య భారత్ (పంజాబ్, హరియాణా, రాజస్థాన్) ప్రాంతాల్లో ముఖ్యంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. తూర్పు, ఈశాన్య భారత్‌లో సాధారణ వర్షాలు ఉండే అవకాశం ఉంది.నెలవారీగా అంచనాజూన్: ఎల్పీఏలో సుమారు 101% (మంచి ప్రారంభం)జూలై: సుమారు 95%ఆగస్టు: సుమారు 92%సెప్టెంబర్: సుమారు 89% (అత్యల్ప వర్షాలు)ఇలా జరిగే అవకాశాలూ ఉన్నాయ్..అధిక వర్షపాతం (>110% ఎల్పీఏ) అవకాశం 0% (అంటే ఈ సారి అధిక వర్షపాతం పడే ఛాన్స్ లేదు)సాధారణం కంటే ఎక్కువ 10%సాధారణం 20%సాధారణం కంటే తక్కువ 40%వర్షాభావం (<90% ఎల్పీఏ) 30%తక్కువ వర్షపాత ప్రభావాలుమధ్య, పశ్చిమ భారత వర్షాధార ప్రాంతాల్లో రైతులు నీటి కొరతను ఎదుర్కోవచ్చు.ప్రభుత్వ అధికారులు తూర్పు, ఈశాన్యంలో అనుకూల వాతావరణ పరిస్థితులు, వాయవ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసుకోవాలి.సీజన్ రెండో భాగంలో అస్థిరంగా పడే వర్షాలు పంటల దిగుబడి, నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
జాడలేని చినుకు కమ్ముకొస్తున్న కరువు
కడప నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ కరువు మేఘాలు కమ్ముకున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో దుర్భిక్షంతో పంటలు పోగొట్టుకుని అప్పుల పాలైన అన్నదాతలు ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిస్థితి బాగుంటుందని, పంటలు పండించుకుని నాలుగు రూకలు కళ్లజూద్దామని ఆశపడ్డారు. చినుకు జాడ లేకపోవడంతో అవన్నీ అడియాశలవుతున్నాయి. వర్షాల్లేక సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొరగా అక్కడక్కడా విత్తిన పంటలు కూడా తడిలేక వాడిపోతున్నాయి. తమ బతుకులు బాగుపడేదెలా దేవుడా! అనుకుంటూ వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీడు భూములు దుర్భిక్షానికి అద్దం పడుతున్నాయి. ఏడు జిల్లాల్లో తీవ్ర కరువు రాయలసీమతోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో దుర్భర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం గణాంకాలే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్ జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జూన్ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉంది. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. వేరుశనగ విత్తనం వేసే సీజన్ కూడా దాటిపోయింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆగస్టు రెండో తేదీ నాటికి 9.6 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది. విత్తనాలు ఆమ్ముకుంటున్న రైతులు వేరుశనగ విత్తడం కోసం రైతులు విత్తనకాయలు కొనుగోలు చేసిన వాటిని వలిచి విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. సీజన్ దాటినా వర్షం జాడ లేకపోవడంతో వేరుశనగ పప్పును కిరాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇక వర్షం పడినా వేరుశనగ సాగుకు అనుకూలం కాదని, సీజన్ దాటిపోయినందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక ధరలకు విత్తనకాయలు కొని చౌకగా పప్పులు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షపాతం లోటు రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో 247.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఈ నెలల్లో 215.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 2016లో ఇదే కాలంలో 283.2 మిల్లీమీటర్లు, 2017లో 239.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈఏడాది ఇంకా తక్కువ కురిసింది. జూన్‌లో ఒక శాతం లోటు నమోదైన వర్షపాతం జూలైలో ఏకంగా 20 శాతానికి చేరింది. అన్నదాతకు దెబ్బమీద దెబ్బ రాష్ట్రంలో వరుస కరువులు అన్నదాతలను అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. 2016, 2017లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 2017లో ఖరీఫ్‌లో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా రైతులకు తీరని అన్యాయం చేసింది. 2016లో అతి తక్కువ మండలాలను కరువు జాబితాలో చేర్చి మోసం చేసింది. ఎండుతున్న పంటలు రాయలసీమ జిల్లాల్లో చినుకు లేకపోవడంతో నామమాత్రంగా సాగైన పంటలు కూడా వాడిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి మొక్కలు వాడిపోయాయి. జొన్న, పెసర తదితర పంటలు కూడా ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు పొలాలను దున్ని పదును లేక విత్తనాలు వేయకుండా వదిలేశారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టం పాతాళంలోకి పడిపోయింది. బోర్లలో నీరు లేక పండ్ల తోటలు సైతం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు అమ్ముకుంటున్నాం ‘‘వాన కోసం రెండు నెలలుగా ఎదురు చూశాం. కానీ, ఇప్పటికి బలమైన పదును వానలు కురవలేదు. వేరుశనగ సాగు చేయడానికి సిద్ధమైనా వానలు కురవలేదు. ఇక సాగు చేయలేని పరిస్థితి నెలకొనడంతో విత్తనాలలు అమ్ముకుంటున్నాం. గతంలో విత్తనం వేయలేని దుర్భరస్థితి ఎప్పుడు రాలేదు’’ – నాగసుబ్బయ్య, రైతు, కత్తులూరు, వేంపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా నేడు ఉన్నతస్థాయి సమీక్ష ఏడు జిల్లాల్లో ఖరీఫ్‌లో తీవ్ర దుర్భిక్షం నేపథ్యంలో ముఖ్యమైన పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించేందుకు ఏడు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ మురళీధర్‌రెడ్డి శుక్రవారం కడపలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పడిపోయిన సాగు విస్తీర్ణం అధికారిక గణాంకాల ప్రకారం చూసినా 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు భారీగా పడిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇదే కాలంలో సాగు 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే 2018లో 5.89 లక్షల హెక్టార్లలో పంట సాగు పడిపోవడం కరువు తీవ్రతను చాటుతోంది. గత ఏడాదితో పోల్చినా సాగు తగ్గిపోయింది. -
పంటలకు ప్రాణం
ఊపిరిపోస్తున్న వర్షం ఇన్నాళ్లూ లోటు వర్షపాతం ఏజెన్సీలో వరినాట్లు ప్రారంభం అన్నదాతల్లో ఆనందం విశాఖపట్నం: దాదాపు నెల రోజుల నుంచి వాన చినుకు కునుకేసింది. సమృద్ధిగా కురవాల్సిన తరుణంలో ముఖం చాటేసింది. ఆరంభంలో ఆనందాన్ని పంచి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. అంతేకాదు మండే ఎండలతో వరి నారుమళ్లు, చెరకు, ఇతర పంటలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ నెల లోని 23 రోజుల్లో ఏకంగా వారం రోజుల పాటు ఒక్క చినుకూ కురవలేదు. మిగిలిన రోజుల్లో అరకొర జల్లులే పడ్డాయి. అయితే ఇవేమీ పంటలకు మేలు చేయలేదు. మరోవైపు జలాశయాల్లోనూ నీరు ఆశాజనకంగా లేదు. ఈ పరిస్థితుల్లో రైతన్నల్లో ఆందోళన నెలకొంది. వర్షం ఎప్పుడు కురుస్తుందా? అని రోజూ కొండంత ఆశతో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20న కొయ్యూరు, రాంబిల్లిల్లో 3 సెంటీమీటర్లు , డుంబ్రిగుడ, జి.మాడుగుల, కోటఉరట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరంలలో 2 సెంటీమీటర్లు, 21న యలమంచిలిలో 9 సెంటీమీటర్లు, చింతపల్లిలో 5, విశాఖపట్నం, కొయ్యూరు, జీకే వీధిల్లో 3, నర్సీపట్నంలో 2 సెంటీమీటర్లు, 22న చింతపల్లిలో 12, గొలుగొండ, పాయకరావుపేట, నక్కపల్లిల్లో 4, నర్సీపట్నం, భీమిలిల్లో 3, అరకు, విశాఖపట్నం, పాడేరు, రోలుగుంట, చోడవరంలలో 2 సెంటీమీటర్లు, అనకాపల్లి, యలమంచిలిల్లో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదయింది. గురువారం కూడా జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు ఇప్పుడు పంటలకు ప్రాణం పోస్తుండడంతో అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుదలలో ఉన్న వరినారు ఊపిరి పోసుకుంటోంది. ఇప్పటికే మన్యంలో వరినాట్లు ప్రారంభమయ్యాయి. అలాగే అపరాల సాగుకు, వేరుశనగ పంట తీయడానికి పనికొస్తుంది. మరింతగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే చాలాచోట్ల వరినాట్లు వేసుకోవడానికి వీలుపడుతుంది. ఇంకా లోటు వర్షపాతమే.. ఇలావుండగా జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే నమోదవుతోంది. దాదాపు మూడు వారాల పాటు ఎండల ధాటిగా కొనసాగడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ నెల23వ తేదీ వరకు జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 197 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 115 మిల్లీమీటర్లే కురిసింది. అంటే 41 శాతం లోటు వర్షపాతమన్న మాట. ఈ నెలలో హుకుంపేట (-87శాతం), పాడేరు -83శాతం), మాడుగుల (-76శాతం) పెదబయలు, చోడవరం, అరకు, అనంతగిరి, చీడికాడ, జి.మాడుగుల, ముంచంగిపుట్టు (10 మండలాలు)ల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయింది. గొలుగొండ, చింతపల్లి, గాజువాక, విశాఖపట్నం, పెదగంట్యాడ, పరవాడ, అనకాపల్లి, మునగపాక, కశింకోట, పాయకరావుపేట, నక్కపల్లి (11 మండలాలు)ల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. మిగిలిన డుంబ్రిగుడ, దేవరాపల్లి, జీకేవీధి, కొయ్యూరు, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, కోట ఉరట్ల, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ అర్బన్, మాకవరపాలెం, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం (22) మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదయింది. మూడు రోజులుగా కురుస్తున్న వానలతోనే ఈ మాత్రం వర్షపాతమైనా పెరగడానికి దోహదపడింది. -
వర్షాభావాన్ని అధిగమిస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ భరోసా ఇచ్చారు. ఈ సీజన్లో వర్షపాత లోటు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి తన శాఖ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతిని బుధవారమిక్కడ విలేకర్లకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు కొత్త పంటల బీమా పాలసీని తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలపై ప్రభావం పడకుండా దిగుమతులను పెంచుతామని, నిత్యావసరాలకు లోటు రాకుండా చూసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పరంగా వ్యవసాయ, విద్యుత్తు రంగాల్లో తగు ప్రణాళికలతో ‘వర్షపాత లోటు’ వల్ల ఏర్పడే స్థితినుంచి ఒడ్డెక్కే ప్రయత్నిస్తామన్నారు. వాతావరణ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా స్టాక్‌మార్కెట్‌పై కూడా ప్రభావం పడడంతో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాల్లో ప్రత్రామ్నాయ ప్రణాళికలను అవలంబిస్తున్నామన్నారు.


