మోగుతున్న ఎల్‌ నినో ఘంటికలు | India Facing 64percent Rain Deficit Amid El Nino Effect | Sakshi
Sakshi News home page

మోగుతున్న ఎల్‌ నినో ఘంటికలు

Jun 17 2026 4:59 AM | Updated on Jun 17 2026 4:59 AM

India Facing 64percent Rain Deficit Amid El Nino Effect

పసిఫిక్‌ మహా సముద్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు 

29.32 సెంటీగ్రేడ్‌కు చేరిన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత  

సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్‌ నుంచి 1.8 సెంటీగ్రేడ్‌ అధికం  

భారత్‌లో బలహీన పడిన నైరుతి రుతుపవనాలు  

విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసిన వర్షాలు

ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావం భారతదేశంపై ఉండదని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. పసిఫిక్‌ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కే దశలోకి ప్రవేశిస్తోంది. 

పసిఫిక్‌లో వేగంగా బలపడుతున్న ఎల్‌ నినోను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో, ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. మధ్య పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌ నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి ‘నినో 3.4’అనే ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్‌ఎస్‌టీ) వరుసగా 16వ రోజు కూడా కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

క్లైమేట్‌ రీఅనలైజర్‌ డేటా ప్రకారం.. నినో 3.4 జోన్‌లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్‌ నుంచి 1.8 సెంటీగ్రేడ్‌ అధికం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం గమనార్హం. చరిత్రలోనే అత్యంత ప్రతికూల వాతావరణ ఘటనలలో ఒకటిగా నిలిచిన 2015–16 నాటి సూపర్‌ ఎల్‌ నినో’ప్రారంభ దశల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, కానీ, ఈ ప్రాంతం అప్పటికే ఎల్‌ నినో పరిస్థితులకు సంబంధించిన స్థాయికి చేరుకుంది. 

పొడి వాతావరణమే  
పసిఫిక్‌ మహాసముద్రంలో నెలకొన్న ఎల్‌ నినో పరిస్థితులు భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్‌ మహా సముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్‌ నినో ముఖ్య లక్షణం. ఈ వేడి జలాలు వాతావరణ ప్రసరణ సరళిని మార్చేస్తాయి. భారత ఉపఖండంలో రుతుపవన వర్షపాతానికి సహాయపడే వాకర్‌ సర్క్యులేషన్‌ను బలహీనపరుస్తాయి. 

దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ.. నేడు అనేక ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయింది. వర్షపాతం తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్షాధార ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి.  

వేగాన్ని కోల్పోతున్న రుతుపవనాలు  
ఎల్‌ నినో ఏర్పడినంత మాత్రాన కచ్చితంగా దేశంలో కరువు వస్తుందని చెప్పలేమని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. హిందూ మహాసముద్ర డైపోల్, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలతో సహా ఇతర వాతావరణ కారకాలు కొన్నిసార్లు ఎల్‌ నినో ప్రభావాలను తగ్గించగలవు. అయితే.. ఈ ఏడాది పసిఫిక్‌ వేడెక్కే వేగం, తీవ్రత అధికంగా ఉండడంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్‌ నినో ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 పరిస్థితి ఇలాగే కొనసాగితే శక్తివంతమైన ఎల్‌ నినో, సాధారణం కంటే తక్కువ స్థాయి రుతుపవనాల గమనంతో కూడిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరవచ్చు. పసిఫిక్‌ మహాసముద్రం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండగా.. దాని ప్రభావంతో భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలోనే రుతుపవనాలు తమ వేగాన్ని, ప్రభా వాన్ని కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.   

మేఘాల జాడలేదు  
నైరుతి రుతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించడం పరిపాటి. ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు అసాధారణంగా పలుచగా కనిపిస్తున్నాయి. ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 

యూరోపియన్‌ వాతావరణ ఉపగ్రహం మెటియోశాట్‌ ఐఓడీసీ, అమెరికాకు చెందిన ఎన్‌ఓఏఏ వాతావరణ ఉపగ్రహం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఇన్సాట్‌–3డీఎస్‌ మంగళవారం తీసిన చిత్రాలను గమనిస్తే మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిగా దర్శనిమిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలో కొన్నిచోట్ల మాత్రమే అక్కడక్కడా పలుచటి మేఘాలు కనిపిస్తున్నాయి. 

రుతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా రుతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్‌ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైన పొడి గాలిని సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాలతో కూడిన ‘రుతుపవన ప్రధాన ప్రాంతం’లో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement