ఊట బావులు.. ఉబికొచ్చే జలాలు | A natural spring well in Medak district | Sakshi
Sakshi News home page

ఊట బావులు.. ఉబికొచ్చే జలాలు

Jul 29 2026 4:46 AM | Updated on Jul 29 2026 4:46 AM

A natural spring well in Medak district

రేగోడ్‌(మెదక్‌): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి..భూగర్భ జలాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో బావులు, బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక ఊరిలో మాత్రం ఊటబావులు ఇప్పటికీ నిరంతరాయంగా నీటిని అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఈ సహజ జలవనరుల ద్వారానే పంటలను కాపాడుకుంటూ గ్రామ రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. 

మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలంలోని టి.లింగంపల్లి గ్రామం సహజ సిద్ధమైన ఊట బావులకు ప్రసిద్ధి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో భూమి అడుగు నుంచి నిరంతరం ఉబికి వచ్చే ఈ బావులు తరతరాలుగా ప్రజలకు తాగునీరు అందిస్తూ , సాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్నాయి. గ్రామంలో 5 ఊట బావులు ఉండగా, వ్యవసాయ క్ష్రేత్రాల్లో 200లకు పైగా ఊట బావులు ఉన్నట్టు గ్రామస్తులు చెప్పారు.  

పంటలు సాగు 
గ్రామంలో వరి, కూరగాయలు, ఇతర పంటలకు అవసరమైన నీటిని ఈ ఊట బావుల నుంచే అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయినా, ఇక్కడ సహజంగా ఉబికి వచ్చే నీటి కారణంగా పంటలు ఎండిపోకుండా సాగు కొనసాగుతోంది. దీంతో ఈ బావులు రైతులకు నిజమైన జీవనాధారంగా మారాయి. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తిగా ఎండిపోలేదని రైతులు అంటున్నారు. అందుకే గ్రామ ప్రజలు ఇప్పటికీ ఈ బావులపైనే అత్యధికంగా ఆధారపడుతున్నారు.  

30 ఏళ్లుగా బావినీటితో సాగు 
ముప్పై ఏళ్లుగా మూడు బావుల నీటితో పదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను. నా పొలంలో మిర్చి, వరి, వేరుశనగ వేశాను. ఈ ఏడాది వర్షాలు పెద్దగా లేకపోయినా ఊట బావుల్లో నీరు పుష్కలంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది.   – మారుతీరావు, రైతు  

గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి 
వర్షాలు లేకపోయినా ఊటబావుల్లో ఎప్పటికీ నీరు ఉండటం మా గ్రామానికి గొప్ప వరం.బావుల వల్ల ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఇలాంటి సహజ నీటి వనరులను సంరక్షించి అభివృద్ధి చేస్తే భవిష్యత్‌ తరాలకు ఎంతో మేలు జరుగుతుంది.  –చంద్రయ్య, గ్రామస్తుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement