‘రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదు’ | Minister Tummala Review On Raithu Nestham | Sakshi
Sakshi News home page

‘రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదు’

Jul 28 2026 10:25 PM | Updated on Jul 28 2026 10:25 PM

Minister Tummala Review On Raithu Nestham

హైదరాబాద్: సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీడ్ కంపెనీల ప్రతినిధులు, సీడ్ కంపెనీ అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల్లో పత్తి విత్తనోత్పత్తిలో భాగస్వాములైన ఆర్గనైజర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీడ్ రైతులకు ఆర్గనైజర్ల ద్వారా జరగాల్సిన చెల్లింపులు, అలాగే ఆర్గనైజర్లకు సీడ్ కంపెనీలు చెల్లించాల్సిన బకాయిల అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలపై మంత్రి తుమ్మల సీడ్ కంపెనీల ప్రతినిధులను వివరణ కోరారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ఈ ఏడాది ఆగస్టు నెలలోగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల కారణంగా కంపెనీల వద్ద విత్తన నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్గనైజర్లకు, రైతులకు చెల్లింపులు చేయడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. అవసరమైతే బ్యాంకుల నుంచి మార్ట్గేజ్ రుణాలు తీసుకొని అయినా చెల్లింపులు చేస్తామని, ఈ సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులను ఆగస్టు నుంచి ప్రారంభించి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తామని అన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీడ్ కంపెనీలు కేవలం లాభార్జన కోణంలో కాకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజర్లకు, వారి ద్వారా రైతులకు చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీడ్ కంపెనీలు గానీ, ఆర్గనైజర్లు గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులను వెంటనే ప్రారంభించి రైతులకు సకాలంలో అందేలా కార్యాచరణ చేపట్టాలని కంపెనీలను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సంబంధిత కంపెనీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి, వ్యవసాయశాఖ డైరెక్టర్, సీడ్ కంపెనీ అసోసియేషన్ ప్రతినిధులు, పత్తి విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement