సాక్షి,హైదరాబాద్: నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. నగరంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన రాయదుర్గం, గచ్చిబౌలి, మణికొండ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీనివల్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
మరోవైపు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ వ్యాపార, నివాస ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. అలాగే నాంపల్లి, మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ సహా నగరంలోని అన్ని ప్రాంతాలు వాన జల్లులతో తడిసిపోతున్నాయి.
అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.


