వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది.
శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.


