చెఫ్ అవుదామనుకుని స్టార్‌ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు | Dhanush @ 43 Rs 230 Crore Fortune Luxury Cars Businesses | Sakshi
Sakshi News home page

చెఫ్ అవుదామనుకుని స్టార్‌ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు

Jul 28 2026 5:06 PM | Updated on Jul 28 2026 5:40 PM

Dhanush @ 43 Rs 230 Crore Fortune Luxury Cars Businesses

Happy Birthday Dhanush కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. వర్సటైల్ యాక్టర్ ధనుష్ 43వ బర్డ్‌డే సందర్భంగా ఆయన ఆస్తులు, వందల కోట్ల సామ్రాజ్యంపై  నెట్టింట ఆసక్తి నెలకొంది.

ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరైన వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా (సినీ పేరు: ధనుష్) తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అసలు ధనుష్ చెఫ్ (వంటమనిషి) కావాలను కున్నప్పటికీ, ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ కోరిక మేరకు కుటుంబ సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నటనలోకి అడుగుపెట్టారు.

2002లో తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన 'తుళ్లువదో ఇళమై' సినిమాతో ధనుష్ ఎంట్రీ ఇచ్చారు. 'పొల్లాదవన్', 'ఆడుకాలమ్', 'అనేగన్', 'మారి', 'వాతి' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ  సత్తా చాటుకున్నారు.

'కొలవెరి డి' ప్రభంజనం
2011లో వచ్చిన ఆయన పాట "వై దిస్ కొలవెరి డి" ధనుష్‌ జీవితంలో ఒక పెద్ద మైలు రాయి  అని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ పాటగా చరిత్ర సృష్టించింది.

బాలీవుడ్ ఎంట్రీ
2013లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'రాంఝణా' సినిమాతో హిందీలోకి అడుగుపెట్టి, ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడిగా అవార్డును గెలుచుకున్నారు.  ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్ వంటి నటులతో కలిసి 'ది గ్రే మ్యాన్' హాలీవుడ్ చిత్రంలో కూడా ఆయన నటించారు.

ధనుష్  నెట్‌ వర్త్‌ 
లైఫ్‌స్టైల్ ఆసియా (2025) అంచనా ప్రకారం ధనుష్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 230 కోట్లు. వండర్‌బార్ ఫిల్మ్స్ (Wunderbar Films): 2010లో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ ద్వారా 'పా పాండి', 'కాలా', 'మారి', 'వడ చెన్నై', 'ఇడ్లీ కడై' సహా 20కి పైగా సినిమాలను నిర్మించారు. ఫిల్మ్ ప్రొడక్షన్ కాకుండా ఇతర ఆర్థిక నిధులు, పోర్ట్‌ఫోలియోలను నిర్వహించే కార్పొరేట్ వ్యాపార సంస్థ ధనుష్ గ్లోబల్ వెంచర్స్‌ను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారు.  

ఒక్కో సినిమాకు రూ. 20 -35కోట్లు
ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 20 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

లగ్జరీ ఇళ్లు, కార్లు 
చెన్నైలోని అత్యంత ఖరీదైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో 19,000 చదరపు అడుగుల్లో నిర్మించిన 4 అంతస్తుల భవనం. దీని విలువ సుమారు రూ. 150 కోట్లు. దీంతో పాటు చెన్నై ఆళ్వార్‌పేట్‌లో రూ. 18 కోట్ల విలువైన మరొక ఆధునిక ఇల్లు ఉంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls-Royce Ghost), జాగ్వార్ XE, మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్ HSE, ఫోర్డ్ మస్టాంగ్ వంటి విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. 

ధనుష్ (Dhanush) ఇండియన్‌ సినిమాలో అత్యంత ప్రతిభావంతులైన, విలక్షణమైన నటుల్లో ఒకరిగా పేరుగాంచారు. సాంప్రదాయ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు భిన్నంగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన యాక్టింగ్ స్టైల్‌ను ఏర్పరుచుకున్నారు. బక్కపల్చగా అమాయకంగా  ఉన్నట్టు కనిపించినా నిప్పులు చెరిగే కళ్లతో,  డైలాగ్ డెలివరీ, సహజమైన నటనలో మాత్రం ఆయనకు ఆయనే సాటి. ధనుష్  నటించిన లేటెస్ట్‌ మూవీ  'ఓమ్' (Om - Chapter 1: The Blood Wood) 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలకానుందని భావిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement