పాపం ధనుష్‌.. ఆ మాటలకే ఇన్ని తిట్లా? | Tamil Nadu Politics, Actor Dhanush Viral Speech Sparks Fresh Debate Over Political Future, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ బజ్‌: పాపం ధనుష్‌.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?

Jul 27 2026 8:06 AM | Updated on Jul 27 2026 10:15 AM

Dhanush Joins Political Conversation Vijay Comparison Fuels Speculation

సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్‌ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్‌ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.

ఈ క్రమంలోనే మరో స్టార్‌ హీరో ధనుష్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్‌ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్‌ యాంగిల్‌లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్‌ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్‌లు, మీటింగ్స్‌కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్‌ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్‌ రాజకీయ ప్రయాణమే. విజయ్‌ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్‌ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.

ఇటు విజయ్‌ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్‌ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ధనుష్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్‌ను ఆయన మాజీ మామ, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్‌ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్‌ వల్లే కాలేదు.. ఇంక ధనుష్‌ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే ధనుష్‌ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్‌ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement