నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది.
కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘ఇక డిమాండ్లు మారొచ్చు’
సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది.
ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్‌కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు.
అంతకు ముందు దీప్కే కూడా..
విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభన
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.
నీట్ వివాదం.. బాధ్యతపై పోరు
నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


