breaking news
time bomb
-
ఒక్కరి రాజీనామాతో ఆగదా?: సీజేపీ సంచలన వ్యాఖ్యలు
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, బాధ్యులపై చర్యలు కోరుతూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం కేవలం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తోనే ఆగిపోదని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత విస్తరించే అవకాశం ఉందని సీజేపీ తాజాగా ప్రకటించింది. కేంద్రంతో నిన్నటి చర్చలు, కొనసాగుతున్న ఆందోళనల నడుమ సీజేపీ ప్రతినిధి(చర్చల) అశుతోష్ రంకా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని, ఇది “టైమ్ బాంబ్”లా మారుతోందని.. ఏ క్షణమైనా పేలొచ్చని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం త్వరగా స్పందించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.‘ఇక డిమాండ్లు మారొచ్చు’సీజేపీ ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే.. నీట్ మరణాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని.. నీట్ నిరసనల్లో విద్యార్థులపై కేసులు ఎత్తేయాలని మరో రెండు డిమాండ్లు ఉంచారు. వీటిల్లో.. మంత్రి రాజీనామా అంశంపై కేంద్రం ఒక్కరోజు గడువు కోరింది. ఇవాళ.. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరగనున్నాయి. ఆ భేటీలో కేంద్రం ఏం చెప్పనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో రంకా మాట్లాడుతూ.. అసంతృప్తి క్రమంగా పెరిగితే అది కేవలం ఒక్కరి రాజీనామా డిమాండ్‌కే పరిమితం కాకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. “ఇక ఈ డిమాండ్ మరింత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం ఉంది” అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే.. మరిన్ని రాజీనామాలు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నట్లు ఆయన మాట్లాడారు. అంతకు ముందు దీప్కే కూడా..విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ నెరవేరిస్తేనే తాము ఆందోళనలను విరమిస్తామని.. అప్పటిదాకా జంతర్ మంతర్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం మొండిపట్టు పడితే.. అవసరమైన పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ రాజీనామా కూడా డిమాండ్ రావచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు. చర్చల్లోనూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నీట్ వివాదంలో ప్రభావిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై చర్చ జరిపారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై మాత్రం ఓ కొలిక్కి రాలేదు.నీట్ వివాదం.. బాధ్యతపై పోరునీట్ పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం పరీక్షల అంశంగా కాకుండా.. ప్రభుత్వ జవాబుదారీతనం, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుండగా.. మరోవైపు నిరసనకారులు వ్యవస్థాపరమైన మార్పులతో పాటు రాజకీయ బాధ్యతను కూడా డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ తాజా వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చ మధ్యలోకి తీసుకొచ్చాయి. ఉద్యమం ఏ దిశగా సాగుతుంది.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
టైం బాంబ్‌లు అమర్చి.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం
దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇదే ఉగ్ర మాడ్యుల్‌కు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అలాగే విచారణలో.. దేశంలోని పలు ప్రాంతాల్లో టైం బాంబ్ పేలుళ్లకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు నిర్ధారించారు.పటాన్ జిల్లాలోని ఖడియాల్ గ్రామంలో గురువారం ఐదుగురు జేషై గ్రూప్ సభ్యుల్ని గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో బిలాల్ అబిద్‌భాయ్ షెరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పలాన్పురి అలియాస్ ఖలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్డియా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఎనిమిది మంది అనుమానితుల విచారణలో ఈ ఐదుగురి పేర్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించారు.దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడు.. టైం బాంబ్ తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా టైం బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడాలని చూసిందని చెప్పారు. అయితే బాంబు తయారీకి సంబంధించిన సామగ్రి, జైష్ ఏ మహ్మద్‌కు సంబంధించిన ఉర్దూ సాహిత్యం ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ముఠా సభ్యులు తయారు చేసిన పేలుడు పదార్థాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించారని, అయితే ఆ ప్రయోగం విఫలమైందని అధికారులు వెల్లడించారు. బాంబు తయారీ సామగ్రి ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడ దాచారు? ఉగ్ర సంస్థకు సంబంధించిన సాహిత్యం వారికి ఎలా చేరింది? అనే అంశాలపై ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది.ఈ కేసులో జూలై 3న గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో జైష్ ఏ మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్లో క్రియాశీల ఉగ్ర నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. తాజా అరెస్టులతో జైష్ ఏ మహ్మద్ మాడ్యూల్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో పెద్ద ఎత్తున పేలుళ్లకు జరిగిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నట్లు ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. -
టిక్.. టిక్.. టిక్.. సినీ ఫక్కీలో టైమ్ బాంబు నిర్వీర్యం
బాంబు ఉందని సమాచారం అందుకోవడం.. ముసుగులేసుకుని స్క్వాడ్లు అక్కడికి చేరుకోవడం.. ఏ వైర్ తెంపాలో అనే ఉత్కంఠ చివరిదాకా.. ఇలాంటి సీన్లు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే.. మహారాష్ట్ర పుణేలో ఈ తరహాలోనే ఓ ఘటన జరిగింది. ఓ ఆస్పత్రి ఆవరణలో లైవ్ బాంబు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.పుణే సిటీలోని హడప్సర్ కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఉదయం బాంబు బయటపడింది. తొలుత అనుమానాస్పద వస్తువుగా భావించినప్పటికీ.. ఆ తర్వాత అది టైమర్ బాంబ్ అని తేలడంతో అందరి గుండెలు గుభేల్మన్నాయ్. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), అగ్నిమాపక సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆసుపత్రి పరిసరాలను ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ పరిణామాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే.. పరిశీలనలో అది 7 గంటల తర్వాత పేలేలా టైమర్‌తో అమర్చిన లైవ్ బాంబు అని తేలింది. బీడీడీఎస్ సిబ్బంది బాంబును సురక్షిత ప్రదేశానికి తరలించి.. ఓపెన్ ఫీల్డ్‌లో నిర్వీర్యం చేశారు. బాంబులో తక్కువ శక్తి గల పేలుడు పదార్థం ఉందని నిర్ధారించారు."నగరంలో తక్కువ శక్తి గల IED (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) కనుగొనబడింది. దానిని నిర్వీర్యం చేశాం. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది." అని పుణే పోలీస్ కమిషనర్ నితేష్ కుమార్ తెలిపారు. క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
యూపీలో టైం బాంబ్ కలకలం
ఫరూఖాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇస్మాయిల్గంజ్లో టైంబాంబ్ కలకలం రేగింది. రెవెన్యూ అధికారి రవీంద్రవర్మ ఇంటి ముందు గురువారం ఉదయం ఓ ప్యాకెట్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో టైం బాంబు అని తేలడంతో బాంబు స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేయడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు. -
ఎన్నికలకు ముందే చిందిన రక్తం!
బీహార్‌లో ఎన్నికలంటే ఒకప్పుడు పెద్ద ఎత్తున హింస చోటుచేసుకునేది. ఆటవిక రాజ్యాన్ని తలపించేవిధంగా మాటవినని అభ్యర్థులపై దాడులు, ఓటర్లకు బెదిరింపులు, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి అరాచకాలు జరిగేవి. ఇటీవలకాలంలో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో ఈ హింస కొంత తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. తాజాగా ఎన్డీయే, జేడీయూ కూటమి మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లోనూ హింస చోటుచేసుకుంటున్నది. ఒకప్పటి అరాచకాలను ఇది గుర్తుచేస్తున్నది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. మధుబని జిల్లాలో జంఝర్‌పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సునీల్ ఝాపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గాయపడిన సునీల్ ఝా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే రెష్మీ వర్మ ఇంటివద్ద టైంబాంబ్ దొరకడం కలకలం సృష్టించింది. బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో రేష్మీ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా నర్కటియాగంజ్ నుంచి పోటీకి దిగారు. రెబెల్‌గా బరిలోకి దిగిన ఆమెకు మొదటినుంచీ బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇంటివద్ద అమర్చిన టైంబాంబును పోలీసులు శనివారం గుర్తించి నిర్వీర్యం చేశారు. గతంలోనూ రేష్మీ వర్మ ఇంటివద్ద బాంబు దొరకడం గమనార్హం. ఇక మొదటి దఫా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు నేటితో ముగిసింది. ఈ నెల 12న తొలిదఫా పోలింగ్ జరుగనుంది. -
శివగంగైలో టైమ్బాంబ్
చెన్నై, సాక్షి ప్రతినిధి: శివగంగైలోని ఒక టాస్మాక్ దుకాణంలో టైమ్బాంబ్ బయటపడింది. పైపు రూపంలో ఒక గోనె సంచిలో రహస్యంగా దాచి ఉంచిన ఈ బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్దప్రమాదం తప్పింది. శివంగంగై గాంధీకి వీధి సమీపంలో జిల్లా ఉపాధికల్పనా కార్యాలయ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణానికి ఎదురుగుండా టాస్మాక్ దుకాణం, దీనికి అనుబంధంగా బార్ ఉంది. కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలకు టాస్మాక్ మూసివేసే వరకు భారీ సంఖ్యలో మందుబాబులు గుమిగూడారు. టాస్మాక్ మూసివేసిన తరువాత సిబ్బందిని పంపివేసి కొందరు మాత్రం లోపలే నిద్రించారు. అర్ధరాత్రి వేళ వారిలో ఒకడు మూత్ర విసర్జన కోసం లేచివెళుతుండగా ఒక మూల నుంచి టిక్‌టిక్ అనే శబ్దం వినిపించింది. భయాందోళనకుగురైన ఆ వ్యక్తి ఇతరులను నిద్రలేపాడు. టాస్మాక్ దుకాణం నలుమూలల పరిశీలించగా ఒక గోతం నుంచి ఆశబ్దం వస్తున్నట్లు కనుగొన్నారు. బాంబుగా అనుమానించిన వారు టాస్మాక్ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అది బాంబుగా నిర్ధారించారు. జాగ్రత్తగా గోతాంను తెరచిచూడగా అర అడుగున్న పైపు రూపంలో బాంబు, రెండు సిలిండర్లు, బ్యాటరీలు, ఒక డయలు కలిగి ఉన్న టైమ్‌బాంబు కనిపించింది. వాటి అనుసంధానాన్ని జాగ్రత్తగా కట్‌చేసి బాంబును నిర్వీర్యం చేశారు. దీనిపై ఓ అధికారి మాట్లాడారు. ఇది చాలా శక్తివంతమైనదని, సుమారు 300 అడుగుల పరిధిలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించగలదని చెప్పారు. భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండేదని చెప్పారు. టైమ్బాంబుగానేగాక రిమోట్ సహాయంతో పేల్చేసే వసతి ఉందన్నారు. -
టైం బాంబు కలకలం
చిలమత్తూరు, న్యూస్‌లైన్ : చిలమత్తూరు మండలం పలగలపల్లి పంచాయతీ పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో టైం బాంబు కలకలం రేపింది. ఆరుబయట భార్యతో కలిసి నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటశివప్పను హతమార్చేందుకు అతని ఇంటి ముందు ప్రత్యర్థులు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బాంబు పేలేలా టైం సెట్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కరెంటు రావడంతో వ్యవసాయబోరు మోటరును ఆన్ చేసేందుకు భార్య,భర్తలు లేవడంతో పాలిథిన్ కవర్లో ఉంచిన బాంబును గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఐదు నిమిషాలు ముందుగానే అంటే 2:55 గంటలకు బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ .. వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంటి వద్ద టైం బాంబు అమర్చిన స్థలాన్ని హిందూపురం రూరల్ సీఐ శివనారాయణస్వామి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఊర్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఆరా తీయగా.. తనకెవరూ వ్యక్తిగతంగా శత్రువులు లేరని బాధితుడు తెలిపారు. తాను వైఎస్సార్సీపీలో చురుగ్గా పాల్గొంటున్నానన్న కారణంగానే ప్రత్యర్థులు ఈ పనికి ఒడిగట్టి ఉంటారని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం సంఘటన స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. త్వరలోనే నిందితులను గుర్తిస్తామని సీఐ చెప్పారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
-
వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో టైంబాంబు
అనంతపురం జిల్లాలో టైంబాంబు కలకలం సృష్టించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటశివప్ప ఇంట్లో ఈ టైంబాంబు మంగళవారం తెల్లవారుజామున బయటపడింది. ఈ ప్రాంతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వెంకట శివప్పను హతమార్చేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులే ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తన స్వగ్రామమైన బండ్లపల్లిలోని ఇంట్లో ఉన్న శివప్ప, మంగళవారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో మోటార్ ఆన్ చేసేందుకు బయటకు వచ్చారు. ఆ సమయంలోనే ఇంట్లో టైం బాంబు ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చిలమత్తూరు నుంచి పోలీసులు వచ్చారు. వెంటనే బాంబు నిర్వీర్యదళాన్ని పిలిపించి, ఆ టైంబాంబును నిర్వీర్యం చేయించారు. శివప్ప ప్రత్యర్థులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.


